breaking news
pidathala sai kalpana reddy
-
అక్కా, తమ్ముళ్ళ మధ్య వార్.. మరోసారి పరాభవం తప్పదా?
అక్కా, తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న వార్ ఆ నియోజకవర్గంలో టీడీపీని అట్టడుగుకు నెట్టేస్తోందా? పచ్చ పార్టీలో వరుసకు అక్కా తమ్ముళ్ళయ్యే నేతల తీరుతో అక్కడి కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. కత్తులు దూసుకుంటున్న ఆ ఇద్దరి కారణంగా ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోవడం ఖాయమని డిసైడవుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ అక్కా తమ్ముడు ఎవరు? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు పిడితల సాయికల్పనారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఆగేలా కనిపించడంలేదు. 2014లో వైయస్సార్సీపి నుంచి గెలుపొంది తర్వాత టిడిపీలో చేరిన అశోక్ రెడ్దిని 2019లో గిద్దలూరు ప్రజలు భారీ తేడాతో తిరస్కరించారు. పిడితల సాయికల్పనరెడ్దికి అశోక్‌రెడ్డి వరుసకు తమ్ముడవుతారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్గా అశోక్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకి సాయి కల్పన రెడ్డి దూరంగా వుంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అశోక్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్ళడంలేదని సాయికల్పనా రెడ్డి వర్గం విమర్శిస్తోంది. దీనికి తోడు అశోక్ రెడ్డి కూడా సాయికల్పనా రెడ్డిని ఆహ్వానించడకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ఇద్దరు నేతల తీరుపై పచ్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు గిద్దలూరు వచ్చిన సందర్భంలో కూడా సాయికల్పనా రెడ్డి దూరంగానే వున్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్నా నియోజకవర్గ ఇంచార్జ్ ఆశోక్ బాబు తనను ఆహ్వానించకపోవడంతో సాయికల్పనా రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యనేతలు వెళ్ళి చంద్రబాబు సభకు హజరుకావాలని కోరినా..సాయికల్పనా రెడ్డి మాత్రం రానని తెగేసిచెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఆహ్వనం పలుకుతూ తన వర్గం కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించి వేశారు. దీంతో వీరిద్దరి వ్యవహరశైలి చంద్రబాబును సైతం అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపైనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి సాయికల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం భావిస్తోంది. తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని సాయికల్పనారెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే సాయి కల్పన ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం.. ఫోన్ ద్వారా పలకరించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం వంటి అంశాలు ఆమెకు పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయనే టాక్ నడుస్తోంది. సాయికల్పన ఇండిపెండెంట్‌గా బరిలో దిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బ తిని మరోసారి ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట మసకబారిపోవడం, నేతల మధ్య అంతర్యుద్ధం వంటివి వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పీడ్ పెంచారు. సౌమ్యుడుగా పేరున్న రాంబాబు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు మీదున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకోవడం పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
టీడీపీలో విశ్వసనీయత లేదు
గిద్దలూరు, న్యూస్‌లైన్ : ‘టీడీపీకి విశ్వసనీయత లేదు, అక్కడ సామాన్యులకు పదవులు దక్కవు, కేవలం డబ్బున్న వారికే టికెట్లిస్తున్నారు. తెలుగుదేశం కార్పొరేట్ పార్టీగా మారిపోమయింద’ని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వసనీయత లేని చోట ఉండలేక పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సాయికల్పనారెడ్డి ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను సోమవారం గిద్దలూరులోని తన నివాసంలో విలేకరులకు వివరించారు. ‘2009 ఎన్నికల సమయంలో పాతాలంలో కలిసిన టీడీపీకి గిద్దలూరులో సార థి లేరు. తనను బతిమిలాడితే పార్టీలో చేరా. నాలుగేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన నన్ను చంద్రబాబు మోసం చేశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. టికెట్ మీకే ఇస్తున్నామంటూ సుజనాచౌదరి మార్చి 15వ తేదీ నుంచి చెబుతూ వచ్చారు. చివరి నిమిషం వరకు నమ్మించారు. కానీ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమ’ని ఆమె దుయ్యబట్టారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసి అభ్యర్థుల గెలుపునకు పోరాడిన తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు. కార్యకర్తలు, నాయకుల నిర్ణయం మేరకు పార్టీకి, పదవికి, తన కుమారుడు అభిషేక్‌రెడ్డి, తన అనుచరులతో సహా రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇంతటి మోసానికి పాల్పడిన టీడీపీలో తాను బతికుండగా చేరబోనని తెగేసి చెప్పారు. వైఎస్సార్ సీపీకే మా మద్దతు పార్టీ కోసం కష్టపడిన నాయకుణ్ని గుర్తించి టికెట్ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే వెయ్యి రెట్లు మేలని, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి అని జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చేందుకు తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవ చేశారని, ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పార్టీలో చేరతామరి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పిడతల కుటుంబానికి ప్యాకేజీలా.. ‘గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పిడతల కుటుంబం రాజకీయంగా ముందుంది. అలాంటి కుంటుంబానికి ప్యాకేజీలు తీసుకునే అవసరం లేద’ని సాయికల్పన తనయుడు పిడతల అభిషేక్‌రెడ్డి అన్నారు. ఒక సామాజికవర్గం పనికట్టుకుని తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మేము ప్యాకేజీ తీసుకున్నామని రుజువు చేస్తే అంతకు రెండింతలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రుజువు చేయలేకపోతే ఏం చేస్తారో ఆరోపణలు చేస్తున్న వారు చెప్పాలని అభిషేక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తమకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధిలోని నల్లబండ బజారుకు చెందిన బొంతా లక్ష్మీదేవి, నాయకులు ముత్తుముల మధుసూదన్‌రెడ్డి, పాలుగుళ్ల హనుమంతారెడ్డిలు సాయికల్పనకు మద్దతు తెలిపారు. టీడీపీకి పలువురు నేతల గుడ్‌బై టీడీపీకి సాయికల్పన, అభిషేక్‌రెడ్డిలతో పాటు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొండెపోగు దేవప్రభాకర్, జిల్లా టీడీపీ కార్యదర్శి కుసుమాల మహానందియాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తోట శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి చెరుకుపల్లె లక్ష్మయ్య, గిద్దలూరు, కొమరోలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మునూరి బాబూరావు, గౌరి జయరావు, నాయకులు పసుపుల చిన్న ఓబయ్యయాదవ్, కొమరోలు మండల యూత్ ప్రధాన కార్యదర్శి బిజ్జం చిన్ననరసయ్య, తిమ్మాపురం గౌడ సంఘం అధ్యక్షుడు చిలక కాశీరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దండూరి సోమయ్య, రాచర్ల మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ రసూల్, రాచర్ల టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ షేక్షావలి, రాచర్ల మండల టీడీపీ సమన్వయకర్త గోపవరపు పాండురంగారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను పంపినట్లు వారు తెలిపారు.