breaking news
PGA Championship
-
‘భారత్‌తో నా అనుబంధం ప్రత్యేకం’
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) టూర్లో తీగల సాహిత్ రెడ్డి గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది ఫోర్టినెట్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకొని తన ఖాతాలో తొలి టైటిల్‌ను వేసుకున్నాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన అతనికి భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. సాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ హైదరాబాద్‌కు చెందినవారు. ఐఐటీ మద్రాస్‌లో చదువు పూర్తి చేసుకున్న అనంతరం మురళీధర్ 1980ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. అయితే ఆయన తన మూలాలు మాత్రం మర్చిపోలేదు. తన పిల్లల్లో కూడా ‘భారతీయత’ అనే భావన ఉండేలా వారిని పెంచారు. ప్రతీ ఏటా ఒక్కసారైనా ఈ కుటుంబం భారత్‌కు వచ్చి వెళుతుంది. ‘నా భారత సంస్కృతి, వారసత్వం అంటే నాకు చాలా ఇష్టం. కొద్ది రోజుల క్రితం భారత్‌లోనే ఉన్నాను. నాకు ఇక్కడ లభించిన ఆదరాభిమానాలను మరచిపోలేను’ అని సాహిత్ చెప్పాడు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను తన పిల్లలు తరచుగా కలిస్తే భారత్‌తో అనుబంధం కొనసాగుతుందనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నామని మురళీధర్ వెల్లడించారు. తమ కుటుంబానికి ఆంధ్ర రుచులు అంటే ఎంతో ఇష్టమని... అమెరికాలోనే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాటిని తినేందుకే తాము ఆసక్తి చూపిస్తామని ఆయన చెప్పారు. ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన తర్వాత సాహిత్ తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాడు. ‘భారత్‌లోనే ఉండే సన్నిహితులు నా ఆటను ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. టూర్లో ఫలితాల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు. కెరీర్‌కంటే కూడా ఈ అనుబంధాలు సంతృప్తినిచ్చాయి. నేను గోల్ఫర్గా మారడంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. భారత్ నుంచి వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా అవే విలువలు కొనసాగించారు. వాటి మధ్య మమ్మల్ని పెంచడం కొంత ఆశ్చర్యకరంగా, గర్వంగా కూడా అనిపిస్తుంది’ అని సాహిత్ వ్యాఖ్యానించాడు. అయితే తన వ్యక్తిగత విజయాలకంటే రాబోయే తరపు భారత గోల్ఫర్లకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు సాహిత్ తెలిపాడు. ‘భారత్‌లో గోల్ఫ్ పరిస్థితి మారుతోంది. కొంత డబ్బు, ఇతర సౌకర్యాలు రావడం వల్ల కుర్రాళ్లకు కోచింగ్ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో అంతా క్రికెట్ విస్తరించి ఉందనే విషయం నాకూ తెలుసు. ఇలాంటి సమయంలో ప్రతిభ ఉన్న భారత గోల్ఫర్లు విదేశాలకు వెళ్లి భారత మూలాలు ఉన్న ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటివారు నన్ను చూసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా’ అని సాహిత్ అభిప్రాయ వ్యక్తం చేశాడు. -
టైగర్ వుడ్స్ రికార్డు విజయం
ఇన్జాయ్ (జపాన్): గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అద్భుత కెరీర్లో మరో కొత్త ఘనత చేరింది. తాజాగా జోజో చాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో టైగర్ వుడ్స్ యూఎస్ పీజీఏ టూర్ టైటిల్స్ సంఖ్య 82కు చేరింది. దీంతో స్యామ్ స్నీడ్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును వుడ్స్ సమం చేశాడు. కెరీర్లో 15 ‘మేజర్’ టైటిల్స్ సాధించిన ఈ స్టార్ తన తొలి టూర్ టైటిల్‌ను 20 ఏళ్ల క్రితం గెలవడం విశేషం. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా టైగర్ వుడ్స్ పది నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. -
అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర
కోహ్లర్ (విస్కాన్సిన్): భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈస్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంకుకు చేరాడు. గతంలో 2013 బ్రిటిష్ ఓపెన్‌లో శివ్ కపూర్ తొమ్మిదో స్థానంలో నిలవడమే అత్యుత్తమం. ఇంతకుముందు మూడు వారాల వ్యవధిలోనే మలేసియా ఓపెన్, హీరో ఇండియన్ ఓపెన్‌ను గెలిచిన 28 ఏళ్ల లాహిరి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఎలాంటి ప్రత్యర్థికైనా గట్టి పోటీనివ్వగల ధీమా కలిగిందని లాహిరి తెలిపాడు.