‘భారత్‌తో నా అనుబంధం ప్రత్యేకం’ | Teegala Sahit Reddy American golfer of Indian origin | Sakshi
Sakshi News home page

‘భారత్‌తో నా అనుబంధం ప్రత్యేకం’

Dec 7 2024 4:07 AM | Updated on Dec 7 2024 4:07 AM

Teegala Sahit Reddy American golfer of Indian origin

యువ గోల్ఫర్లకు నా ప్రయాణం స్ఫూర్తినివ్వాలి 

భారత సంతతికి చెందిన అమెరికా గోల్ఫర్‌ 

తీగల సాహిత్‌ రెడ్డి వ్యాఖ్య   

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ (పీజీఏ) టూర్‌లో తీగల సాహిత్‌ రెడ్డి గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది ఫోర్టినెట్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకొని తన ఖాతాలో తొలి టైటిల్‌ను వేసుకున్నాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్‌ ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన అతనికి భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 

సాహిత్‌ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ హైదరాబాద్‌కు చెందినవారు. ఐఐటీ మద్రాస్‌లో చదువు పూర్తి చేసుకున్న అనంతరం మురళీధర్‌ 1980ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. అయితే ఆయన తన మూలాలు మాత్రం మర్చిపోలేదు. తన పిల్లల్లో కూడా ‘భారతీయత’ అనే భావన ఉండేలా వారిని పెంచారు. ప్రతీ ఏటా ఒక్కసారైనా ఈ కుటుంబం భారత్‌కు వచ్చి వెళుతుంది. 

‘నా భారత సంస్కృతి, వారసత్వం అంటే నాకు చాలా ఇష్టం. కొద్ది రోజుల క్రితం భారత్‌లోనే ఉన్నాను. నాకు ఇక్కడ లభించిన ఆదరాభిమానాలను మరచిపోలేను’ అని సాహిత్‌ చెప్పాడు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను తన పిల్లలు తరచుగా కలిస్తే భారత్‌తో అనుబంధం కొనసాగుతుందనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నామని మురళీధర్‌ వెల్లడించారు. 

తమ కుటుంబానికి ఆంధ్ర రుచులు అంటే ఎంతో ఇష్టమని... అమెరికాలోనే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాటిని తినేందుకే తాము ఆసక్తి చూపిస్తామని ఆయన చెప్పారు. ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌గా మారిన తర్వాత సాహిత్‌ తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాడు. ‘భారత్‌లోనే ఉండే సన్నిహితులు నా ఆటను ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. టూర్‌లో ఫలితాల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు. కెరీర్‌కంటే కూడా ఈ అనుబంధాలు సంతృప్తినిచ్చాయి. 

నేను గోల్ఫర్‌గా మారడంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. భారత్‌ నుంచి వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా అవే విలువలు కొనసాగించారు. వాటి మధ్య మమ్మల్ని పెంచడం కొంత ఆశ్చర్యకరంగా, గర్వంగా కూడా అనిపిస్తుంది’ అని సాహిత్‌ వ్యాఖ్యానించాడు. అయితే తన వ్యక్తిగత విజయాలకంటే రాబోయే తరపు భారత గోల్ఫర్లకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు సాహిత్‌ తెలిపాడు. 

‘భారత్‌లో గోల్ఫ్‌ పరిస్థితి మారుతోంది. కొంత డబ్బు, ఇతర సౌకర్యాలు రావడం వల్ల కుర్రాళ్లకు కోచింగ్‌ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో అంతా క్రికెట్‌ విస్తరించి ఉందనే విషయం నాకూ తెలుసు. ఇలాంటి సమయంలో ప్రతిభ ఉన్న భారత గోల్ఫర్లు విదేశాలకు వెళ్లి భారత మూలాలు ఉన్న ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటివారు నన్ను చూసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా’ అని సాహిత్‌ అభిప్రాయ వ్యక్తం చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement