breaking news
pentela Famous
-
హరికృష్ణ శుభారంభం
తొలి గేమ్‌లో హారికపై గెలుపు దోహా: ఖతార్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ శుభారంభం చేశాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో జరిగిన తొలి రౌండ్లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 80 ఎత్తుల్లో గెలిచాడు. హారికపై హరికృష్ణకిది రెండో విజయం కావడం విశేషం. వీరిద్దరూ తొలిసారి 2012 టాటా స్టీల్ టోర్నీలో తలపడగా హరికృష్ణ 33 ఎత్తుల్లో నెగ్గాడు. మొత్తం 40 దేశాల నుంచి 154 మంది పాల్గొంటున్న ఖతార్ మాస్టర్స్ టోర్నీలో 92 మంది గ్రాండ్‌మాస్టర్లు ఉండటం విశేషం. తొమ్మిది రౌండ్లపాటు జరిగే ఈ టోర్నీలో విజేతకు 25 వేల డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తారు. -
ఆ ఎత్తు వేయకపోయుంటే...
మన ఆనంద్ మరోసారి ఓడిపోవడం బాధగా ఉంది. ఈ గేమ్ కోసం అతను చాలా చక్కగా సన్నద్ధమై వచ్చినట్లు ఆరంభంలో కనిపించింది. 26వ ఎత్తు వరకు కూడా మొగ్గు విషీ వైపే ఉంది. అయితే రూక్ని బి4లోకి పంపడం ద్వారా అతను చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ ఎత్తు వేయడంతో అతను తొందర పడ్డాడు. దాని టైమింగ్ తప్పు అనేది నా అభిప్రాయం. కాస్త ఆగి ఉండాల్సింది. బహుశా పాన్‌ను ముందుకు తీసుకెళ్లి క్వీన్‌ను చేద్దామనే ఆలోచన కావచ్చు! కానీ బలి అవుతుందని తెలిసినప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. ఈ ఎత్తు వేసేటప్పుడు ఆనంద్ అతి ధైర్యవంతుడిగా, అతి ఆశావాదిగా కనిపించాడు. బహుశా ఈ సమయంలో తాను అనుకున్న వ్యూహం మర్చిపోయి ఉంటాడు లేదా విజయంపైనే దృష్టి నిలపడం వల్ల ‘డ్రా'కు ఉన్న అవకాశాల గురించి కూడా ఆలోచించలేదేమో. ఇలాంటి అవకాశం ఇస్తే కార్ల్సన్లాంటి ఆటగాడు వదిలేస్తాడా. అందుకే ఎక్కడా పట్టు విడవకుండా, మరో చాన్స్ లేకుండా దూసుకుపోయాడు. చెన్నైతో పోలిస్తే ఈ టోర్నీలో ఆనంద్ ప్రదర్శన చాలా బాగుంది. ఎన్నో సార్లు విజయానికి చేరువలో కూడా వచ్చాడు. కానీ సఫలం కాలేకపోయాడు. ఓటమి విషీని బాధ పెట్టడం సహజమే కానీ అతని గొప్పతనం తగ్గదు. భవిష్యత్ టోర్నీలపై కూడా దీని ప్రభావం ఉండదని నేను భావిస్తున్నా. - పెంటేల హరికృష్ణ, చెస్ గ్రాండ్ మాస్టర్