breaking news
Oxford researchers
-
ఆ నగరాల జాబితాలో హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 నుంచి 2035 మధ్య అత్యంత వేగంగా ఎదిగే టాప్ 20 నగరాల జాబితాలో 17 భారతీయ నగరాలకు చోటు దక్కింది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించిన ఈ జాబితాలో సూరత్ అగ్రస్ధానంలో నిలవగా వరుసగా ఆగ్రా, బెంగళూర్, హైదరాబాద్, నాగపూర్, తిరుపూర్, రాజ్‌కోట్, తిరుచిరాపల్లి, చెన్నై, విజయవాడలు నిలిచాయి. అయితే 2035 నాటికి ఈ నగరాల మొత్తం జీడీపీ చైనా నగరాల జీడీపీతో పోల్చితే తక్కువగానే ఉంటుందని వార్షిక ప్రపంచ నగరాల పరిశోధన నివేదికలో ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్ నగరాల కంటే అధికంగా చైనా నగరాలే 2035 నాటికి అత్యధిక ఉత్పత్తులు సమకూరుస్తాయని అంచనా వేసింది. ఇక 2018-2035 మధ్య సూరత్ 9.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత నగరాల జాబితాలో నెంబర్ వన్‌గా నిలిచింది. భారత్ వెలుపల కంబోడియా రాజధాని ఫెమ్ ఫన్ అత్యధికంగా 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో ఎదుగుతాయని ఈ అథ్యయనం పేర్కొంది. ఆసియా నగరాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నా 2035 నాటికి సైతం అమెరికా నగరం న్యూయార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్టను నిలుపుకుంటుందని అంచనా వేసింది. -
గోధుమల దిగుబడి పెంపుకు కొత్త పద్ధతి!
లండన్: గోధుమల దిగుబడిని పెంచడానికి ఉపకరించే కొత్త పద్ధతిని వ్యవసాయ పరిశోధనల సంస్థ రోథమ్‌స్టెడ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల పరిశోధకులు కనుగొన్నారు. మొక్కల్లో సాధారణంగా ఉండే టీ6పీ అనే రసాయనాన్ని శాస్త్రవేత్తలు కృత్రిమంగా తయారుచేశారు. దీనిని గోధుమ మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా గింజల పరిమాణం, వాటిలోని పిండి పదార్థాలను 20 శాతం మేర పెంచవచ్చని వారు పేర్కొంటున్నారు. కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి అయ్యే సుక్రోజ్, గోధుమ గింజలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. సుక్రోజ్‌ను గోధుమ చెట్లు ఎలా ఉపయోగించుకోవాలనే దానిని టీ6పీ నియంత్రిస్తుంటుంది. టీ6పీ ఎక్కువగా ఉంటే, పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం టీ6పీని కొద్దిగా సవరించి, కృత్రిమంగా తయారు చేశారు. తర్వాత దానిని ద్రావణంతో కలిపి గోధుమ మొక్కలపై పిచికారీ చేశారు.