breaking news
Organizational election
-
నిబంధనలకు నీళ్లు.. అంతా ఒకే వర్గం వాళ్లు!
సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగిన తీరుపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఇది పేరుకే ఎన్నిక గానీ... వాస్తవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్టీ సంఘటనా కార్యదర్శి కనుసన్నల్లో తమకు నచ్చిన వారికే జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టారని ఆ నేతల్లో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు రోజు రాత్రి జిల్లా ఎన్నికల అధికారులకు ముఖ్య నేతలు ఫోన్ చేసి తాము చెప్పిన వారినే అధ్యక్షులుగా ప్రకటించాలని ఒత్తిడి చేశారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా పక్కా పథకం ప్రకారం తమకు నచ్చినవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించుకున్నారని సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై ప్రభావం ఉంటుందనే.. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుల అభిప్రాయం కీలకం. అందువల్ల మెజారిటీ జిల్లాల అధ్యక్షులుగా తమ మనుషులు ఉండాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ ఎన్నికలను పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడిపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఇలా...» బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో కొన్ని నిబంధనలు పాటించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖలను ఆదేశించింది. » కనీసం ఆరేళ్లు పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండటంతోపాటు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల వారే జిల్లా అధ్యక్షులుగా పోటీకి అర్హులని జాతీయ నాయకత్వం స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నట్లు నాయకులు చెబుతున్నారు. » కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణ వయసు కేవలం 40 సంవత్సరాలేనని, అతనిపై తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. » నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అభిరుచి మధుకు నిబంధనల ప్రకారం కనీసం ఆరు సంవత్సరాల క్రియాశీలక సభ్యత్వం లేదని, ఆయనపై గతంలో రౌడీషీటర్‌గా అభియోగాలు ఉన్నాయని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. » అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అతనికి అర్హత లేదని ఎన్నికల అధికారి సావిత్రి తిరస్కరించారని, అయినా ఆయన్నే తిరిగి జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు బీజేపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. » అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సాయిలోకేష్ కేవలం మూడు సంవత్సరాల కిందటే బీజేపీలో చేరినట్లు అదే పార్టీ నాయకులు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష పదవిని 60 ఏళ్లు దాటిన వ్యక్తికి కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. » అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు నామినేషన్ వేయడానికి మద్దతుగా మండల అధ్యక్షులు బలపరచాలనే నిబంధన ఉంది. కానీ, ఆ నిబంధనను ఎక్కడా పాటించలేదని తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఒకే వర్గం వారిని అధ్యక్షులుగా నియమించారనే చర్చ జోరుగా సాగుతోంది. -
సీట్లివ్వకుంటే ఎలా?
* స్టాలిన్‌కు మొర * 18 మంది నేతల్లో అసంతృప్తి సాక్షి, చెన్నై : అధిష్టానం నిర్ణయం డీఎంకే సీనియర్లలో అసంతృప్తిని రగుల్చుతోంది. జిల్లా కార్యదర్శుల పదవుల ఎన్నికల్లో కోట్లు కుమ్మరించాల్సి వచ్చిందని, అలాంటప్పుడు తమకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వకుంటే ఎలా? అని పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ప్రశ్నించే పనిలో పలువురు నేతలు పడ్డారు. డీఎంకేలో సంస్థాగత ఎన్నికల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. 65 జిల్లా కార్యదర్శుల పదవుల భర్తీ జోరందుకుంటోంది. రోజుకు కొన్ని జిల్లాలు చొప్పున ఎంపిక చేసి అధినేత కరుణానిధి పర్యవేక్షణలో ఎన్నికలు సాగుతున్నాయి. 31 జిల్లాలకు మాత్రం కొత్త ముఖాలను తెరపైకి తెచ్చే విధంగా ఎన్నికలు సాగుతున్నాయి. మిగిలిన 34 జిల్లాల్లో పార్టీలో ఆయా జిల్లాల్లో పలుకుబడి కల్గిన నేతలు, సీనియర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలు ఏక గ్రీవం అయ్యాయి. అయితే, జిల్లా కార్యదర్శుల ఎన్నికల బరిలో నిలబడి గెలిచిన వాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కరుణానిధి తేల్చారు. ఇందుకు తగ్గ హామీ పత్రాన్ని ఆయా కార్యదర్శుల నుంచి తీసుకుని ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ చర్యలు ఆయా నేతల్లో అసంతృప్తిని రగుల్చుతున్నాయి. జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో గెలుపొందేందుకు నాయకులు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ఆయా జిల్లాల్లో కాకుండా చెన్నైలో ఏర్పాటు చేసి ఉండడంతో తమ మద్దతుదారులు, తమకు అనుకూలంగా ఓట్లు వేసే నాయకుల్ని ఇక్కడకు తీసుకురావడంతో పాటుగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాల్ని కల్పిస్తున్నట్టు సమాచారం. గెలుపు లక్ష్యంగా కొన్ని చోట్ల తాయిలాలు సైతం పంపిణీ చేసినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు గాని, తమ కుటుంబలోని వ్యక్తులకు గానీ సీట్లు ఇవ్వమని అధిష్టానం స్పష్టం చేయడాన్ని అనేక మంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టాలిన్‌కు వినతి: అధిష్టానం హామీ పత్రానికి ప్రధానంగా స్టాలిన్ మద్దతు సీనియర్లు ఇరకాటంలో పడ్డారు. 18 మంది నాయకులు జిల్లాల కార్యదర్శుల పదవుల్ని చేజిక్కించుకున్నారు. అయితే, పార్టీకి ఏళ్ల తరబడి సేవల్ని అందిస్తున్న తమకు ఇతర పదవులు దక్కవన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. దీంతో హామీ పత్రం వ్యవహారంలో ఎన్నికల అనంతరం మార్పులు చేర్పులకు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ వద్ద మొర పెట్టుకునే పనిలో పడ్డారు. వేర్వేరుగా ఆ నేతలు స్టాలిన్‌ను కలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటుగా తమకు పదవులు దక్కే విధంగా అధినేత కరుణానిధిపై ఒత్తిడి తెచ్చి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. అదే సమయంలో డీఎంకే నుంచి బయటకు వెళ్లిన నెపోలియన్ బీజేపీల చేరడం, మరి కొందరు తన బాటలో నడవనున్నట్టు ఆయన ప్రకటించడాన్ని డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నది. ఎక్కడ వలసలు బయలు దేరుతాయోనన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని హామీ పత్రం విషయంలో స్వల్ప మార్పులకు కరుణానిధి యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తన వద్దకు వచ్చే సీనియర్లకు సంస్థాగత ఎన్నికల అనంతరం తదుపరి చర్యలు తీసుకుందామన్న భరోసా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.