మిస్ యూనివర్స్‌పై కేసు
తాజ్ వద్ద ఉన్న డయానా సీట్‌పై చెప్పులు పెట్టినట్లు ఫిర్యాదు
ఆగ్రా: మిస్ యూనివర్స్ ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో.. తాజ్ మహల్ వద్ద ఓ ఘనకార్యం వెలగబెట్టి చిక్కుల్లో పడ్డారు. ఆదివారం ఆమె బ్యాగులోని చెప్పులను ‘డయానా సీట్’గా పేర్కొనే పాలరాతి బెంచీపై ఉంచి చెప్పుల కంపెనీ వ్యాపార ప్రకటన కోసం పోజిచ్చినట్లు భారత పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) ఫొటో ఆధారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కల్పో, ఫొటోషూట్ నిర్వహించిన ఆమె బృందంలోని వారిపై కేసు పెట్టారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1992 నాటి తాజ్ పర్యటన కు గుర్తుగా తాజ్‌లోని ఓ పాలరాతి బెంచీకి ‘డయానా సీట్’ అని పేరు పెట్టామని, కల్పో ఫొటో షూట్ తతంగం ఆ బెంచీని అగౌరవించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాజ్ సంరక్షణ అధికారి మునాజర్ అలీ చెప్పారు. అమెరికాకు చెందిన కల్పో భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.