చారిత్రక సంపదను కాపాడుకోవాలి
డిచ్పల్లి : పురాతన కట్టడాలు, చారిత్రక సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని రాష్ట్ర న్యాయ సేవాసంస్థ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి న్యాయమూర్తుల కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుజన, ఇతర న్యాయమూర్తులతో కలిసి డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో హైకోర్టు న్యాయమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామాలయంపై ఉన్న శిల్పకళను వారు తిలకించారు. ఆలయ చర్రితను ప్రధానార్చకులు వానమాములై కృష్ణమాచార్యులు వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ రామసుబ్రమణ్యన్ మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన కట్టడాలు తక్కువ సంఖ్యలో ఉంటాయని అన్నారు. డిచ్పల్లి ఖిల్లా రామాలయంపై శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు. అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని ఎంతగా ప్రశంసించినా తక్కువేనని అన్నారు. అపురూప కట్టడాలను, చారిత్రక సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాలని సూచించారు. ఈ ఆలయాన్ని సందర్శించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి తిరుమల దేవి, రెండవ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి జావేద్ పాష, మొబైల్ కోర్టు న్యాయమూర్తి యువరాజ, జిల్లా బార్అసోసియేషన్ అధ్యక్షుడు బిర్లా రామారావు, ప్రధాన కార్యదర్శి ఎండీ ఖాసిం, న్యాయవాదులు టక్కర్ హన్మంత్రెడ్డి, సుదర్శన్రావు, తదితరులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్ గుప్త కుమారుడు న్యాయవాది గజవాడ తులసీదాస్ హైకోర్టు న్యాయమూర్తిని శాలువాతో సన్మానించారు.