ఎమ్మెల్యేపై వేధింపుల కేసు నమోదు
ఒడిషాలో ఓ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు నమోదైంది. స్వయానా ఆయన కోడలే ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమని ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ఎన్నికల అఫిడవిట్లోనే తనకు దాదాపు రూ. 70 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన స్వతంత్ర ఎమ్మెల్యే శాంతన్ మహాకుడ్. ఆయన తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆయన కోడలు కవితా మహాకుడ్.. భువనేశ్వర్‌లోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసింది. ఒడిషాలో ఇనుప ఖనిజం ముమ్మరంగా లభించే కియోంఝర్ జిల్లాలోని చంపువా నియోజకవర్గం నుంచి మహాకుడ్ గెలిచారు. ఆయనకు సొంతంగా ఒక మినరల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది.
తన భర్త పంకజ్, మరిది దీనాబాబు బారిక్ల మీద కూడా ఆమె ఆరోపణలు చేశారు. వీళ్లంతా తనను విపరీతంగా భయపెట్టారని, చిత్రహింసలు పెట్టారని ఆమె తెలిపారు. తన భర్తను బలవంతంగా తనకు దూరంగా ఉంచి, ఆయనకు రెండోపెళ్లి చేశారని కవిత ఆరోపించారు. పంకజ్ తనను లవ్‌మ్యారేజి చేసుకున్నారని, తామిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణకు పోలీసు కమిషనర్ వైబీ ఖురానియా ఆదేశించారు.