breaking news
Notification of the Election Commission
-
ఇక అంతా మాజీలే..!
నిధులిచ్చే అధికారం లేదు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు చంద్రబాబు, కిరణ్ సహా మాజీలే సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలంతా దాదాపుగా మాజీలయ్యారు. ఏప్రిల్ 12వ తేదీ సీమాం ధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు వీరి పదవీకాలం ఉన్నప్పటికీ ఆచరణలో ఎలాంటి అధికారాలు, సౌలభ్యాలు, హోదా ఉండదు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ మాజీలు గా మారారు. ఇకపై వీరు అధికారులతో ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించేం దుకు వీలులేదు. తిరుపతి, చిత్తూరు, రాజం పేట ఎంపీలు చింతామోహన్, ఎన్.శివప్రసాద్, సాయిప్రతాప్ కూడా మాజీలైనట్టే. ఐదేళ్ల పాటు ప్రజాప్రతినిధులుగా అధికారులపై అజమాయిషీ చెలాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకనెల పాటు పదవిలో ఉన్నా డమ్మీలే. వీరికి ప్రోటోకాల్ మర్యాదలు వర్తించవు. వ్యక్తిగత భద్రతకు అవసరమైన గన్మెన్లు మాత్రం ఉంటారు. నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఇతర అభ్యర్థులతో సమానంగానే వీరిని పరిగణిస్తారు. వీరికి ఎలాంటి ప్రత్యేక హోదా, మర్యాదలు ఉండవు. జిల్లాలో ఇది వరకే పలమనేరు, తంబళ్లపల్లె, పుంగనూరు ఎమ్మెల్యేలు మాజీ లుగా మారారు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాజీలైనట్టే. ఎమ్మెల్యే, ఎంపీ గ్రాంట్లకు బ్రేక్ తాత్కాలికంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవిలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అధికారం ఉండదు. ఒకవేళ షెడ్యూల్డ్ తేదీకి ముందే శాంక్షన్ లెటర్లు అధికారులకు పంపి ఉన్నా, ఆ పనులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాతే ప్రారంభించాల్సి ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పనులు చేపట్టేందుకు వీలులేదు. కొత్తగా స్కీంలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్‌తో నిషేధం అమల్లోకి వచ్చినట్లే. ముఖ్యప్రణాళిక అధికారి కార్యాలయం ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే గ్రాంట్స్ విడుదలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజాప్రతినిధుల గ్రాంట్స్‌తో చేపట్టే పనులు ఎలాంటివైనా ప్రారంభించరాదని ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో శాంక్షన్ లెటర్ ఇచ్చి ఉన్నా, ఇప్పుడు పని ప్రారంభించరాదని ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాతే చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అతిథి గృహాల ను, వాహనాలను ఇతర సౌకర్యాలను ప్రత్యేకంగా పొందేందుకు వీలులేదు. ఒకవేళ సేవలు వినియోగించుకున్నా అందుకు అవసరమైన రుసుం చెల్లించాలి. సభల నిర్వహణకు అవసరమైన మైదానాలు, ఇతర పబ్లిక్ స్థలాలను ప్రజాప్రతినిధులతో పాటు, ఎన్నికల్లో పాల్గొనే ఇతర అభ్యర్థులకు, రాజకీయ పార్టీల నేతలకు నిర్ణీత రుసుం వసూలు చేసి అనుమతి ఇవ్వాలని కోడ్‌లో పేర్కొన్నారు. అధికారులు ఏ ఒక్క ప్రజాప్రతినిధికో, రాజకీయ నాయకుడికో అనుకూలంగా వ్యవహరించకూడదు. అధికారికంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదు. -
‘మున్సిపల్’ నగారా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలున్నాయి. షెడ్యుల్డ్ ప్రాంతంలో ఉన్న మందమర్రి మున్సిపాలిటీ మినహా మిగిలిన ఆరు మున్సిపాలిటీ లు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. స్థానాల రిజర్వేషన్లను శనివారం ప్రకటించడంతో ఈనెలాఖరులోపే ఎన్నికల తంతు ముగించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వార్డులవారీగా ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈనెల14లోపు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్లు ముగుస్తుండటంతో ఆయా పార్టీలో ఒక్కసారిగా టిక్కెట్ల గోల మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 18లోపు గడువు ముగుస్తుంది. దీంతో పక్షం రోజుల్లో బరిలో నిలిచేవారెవరో స్పష్టంగా తేలిపోనుంది. మార్చి 30న పోలింగ్ ఉండటంతో అభ్యర్థుల ప్రచారానికి కేవలం పది రోజులే మిగులుతుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన పక్షంలో ఏప్రిల్ 1న రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఫిబ్రవరి 2న కౌటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ రోజే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు ఆ తర్వాత చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 3.56 లక్షల మంది పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 95,372 మంది ఓటర్లున్నారు. మంచిర్యాలలో 73,985, నిర్మల్‌లో 67,576, కాగజ్‌నగర్‌లో 44,104, బెల్లంపల్లిలో 41,258, భైంసాలో 34,048 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపల్ పట్టణాల్లో మాత్రమే కోడ్ అమలులో ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నాలుగేళ్ల తర్వాత పాలకవర్గం ఆయా మున్సిపాలిటీల గత పాలక వర్గం పదవీకాలం 2010 సెప్టెంబర్‌తో ముగిసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సాహసించలేదు. దాదాపు నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొచ్చింది. ఎట్టకేలకు కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో బల్దియాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద మార్చి మొదటి వారంలో ఈ మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది.