ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
నేడు కశ్మీర్ గవర్నర్‌కు లేఖ ఇవ్వనున్న పీడీపీ, బీజేపీ నేతలు
ఉమ్మడి అపాయింట్మెంట్ కోరిన ఇరు పార్టీలు
♦ సీఎంగా మెహబూబా ముఫ్తీ, ‘డిప్యూటీ’గా బీజేపీ నేత నిర్మల్‌సింగ్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో రెండు నెలల అనిశ్చితికి తెరపడింది. పీడీపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఇరు పార్టీల నేతలు శనివారం రాష్ర్ట గవర్నర్ ఎన్ఎన్ వోరాను ఉమ్మడిగా భేటీ అయి దీనిపై లేఖలు ఇవ్వనున్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతిస్తామని బీజేపీ గవర్నర్‌కు తెలపనుంది. రాష్ట్రానికి మొదటి మహిళా సీఎంగా మెహబూబా (56) రికార్డు సృష్టించనున్నారు. 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమై నిర్మల్ సింగ్‌ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఈయన మెహబూబా కేబినెట్లోనూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. పీడీపీ, బీజేపీ పార్టీల నేతలు శనివారం గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మెహబూబా గవర్నర్‌కు లేఖ ఇస్తారని, ఈ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ నిర్మల్‌సింగ్ లేఖ ఇస్తారని తెలిపాయి. ఇరుపార్టీల నేతలు శుక్రవారం విడివిడిగా గవర్నర్‌తో భేటీ కావాల్సి ఉండగా, శనివారం ఉమ్మడిగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. 87 మంది సభ్యులున్న కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27 మంది, బీజేపీకి 25 మంది సభ్యుల బలముంది.
బీజేపీఎల్పీ భేటీ అనంతరం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సత్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ, మెహబూబా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించిందని చెప్పారు. త్వరలోనే ఇరు పార్టీల నేతలు సమావేశమై మంత్రి పదవులు, సమన్వయం, సహకారం తదితర అంశాలపై చర్చలు జరుపుతారన్నారు. ఏడాది కింద అప్పటి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో నిర్ణయించుకున్న ఎజెండా, కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగానే ముందుకెళ్తామన్నారు. కాగా జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ కూటమిగా దేశ వ్యతిరేక కూటమి అని ఆమ్ఆద్మీపార్టీ నేత కపిల్ మిశ్రా విమర్శించారు. ‘మెహబూబా ముఫ్తీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘భారత్‌మాతాకీ జై’ అంటారా? అలా కానప్పుడు పీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు?’ అని ప్రశ్నించారు.