breaking news
New York Film Academy
-
‘అంతకంటే ముందు నేను ఓ పని చేయాలి’
న్యూయార్క్: నటిగా తనను తాను నిరూపించుకున్నాకే తన కుటుంబంతో కలిసి పనిచేస్తానని అలనాటి నటి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్ అన్నారు. నటి శ్రీదేవి, బోనీ కపూర్ల చిన్న కూమార్తె ఖషీ కపూర్. తల్లి శ్రీదేవి, సోదరి జాన్వీ కపూర్లాగే హీరోయిన్ కావాలని ఖుషీ కపూర్ కోరుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ వెళ్లిన ఖుషీ అక్కడే న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీలో ఖుషీ మూవీకి సంబంధించిన కోర్సు పూర్తి కూడా చేస్తున్నారు. ఇక త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం న్యూయార్కులోనే ఉన్న ఖుషీ తన స్కూల్ అకాడమీ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తూ, న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్లో తన అనుభవాన్ని పంచుకున్నారు. (చెఫ్‌గా మారిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై) తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. ‘నా ఫ్యామిలీ బిజినెస్ చూస్తుంటారు. నా కుటుంబంతో కలిసి పనిచేసేందుకు నేనెప్పుడూ ఇష్టపడతాను. కానీ అందుకు కొంచెం సమయం పడుతుంది. అంతకంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. నటిగా నా స్థానాన్ని నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. ఫిల్మ్ స్కూల్లో నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. ఇప్పుడు నేను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను’. అంటూ పేర్కొన్నారు. కాగా ఖుషీకి నటన వారసత్వంగానే ఉంది. ఆమె నిర్మాత సురీందర్ కపూర్ మనవరాలు. తండ్రి బోనీ కపూర్ కూడా నిర్మాతే. తల్లి శ్రీదేవి సోదరి జాన్వీ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్ అంతా బాలీవుడ్ నటులే. ఇక ఖుషీ తన నటనతో బాలీలవుడ్‌లో ఏ మేరకు రాణించగలరో చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. (విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య) -
ఆ సినిమాలు చూసి... కథక్ నేర్చుకున్నా!
రాఖీ, జల్సా, రెడీ, బొమ్మరిల్లు, నువ్వే, క్లాస్మేట్స్, నేనొక్కడినే చిత్రాలతో నటునిగా మంచి పేరు తెచ్చుకున్న రవివర్మ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని రవివర్మ అన్నారు. మరిన్ని విషయాలు పంచుకుంటూ, ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందు లోనూ కమల్‌హాసన్, చిరంజీవి అంటే ఇంకా ఇష్టం. కమల్ హాసన్ ‘సాగరసంగమం’, చిరంజీవి ‘అభిలాష’ చిత్రాలు చూసి స్కూల్లో ఉన్నప్పుడే కథక్ నేర్చుకున్నా. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశా. ఇప్పటిదాకా 26 చిత్రాలలో నటించా. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, నాగచైతన్య ‘దోచేయ్’ , నారా రోహిత్ ‘అసుర’, పీవీపీ బ్యానర్లో ‘క్షణం’, శ్రీకాంత్ ‘హోప్’ చిత్రాలలో నటిస్తున్నా. వీటిలో చేస్తున్నన్నీ విభిన్న తరహా పాత్రలే’’ అన్నారు. ‘‘పాత్ర బాగుంటే ప్రతినాయకుడిగా చేయడానికీ రెడీ’’ అని రవివర్మ తెలిపారు. -
ఇది ఏ వర్మకో... పూరీకో పరిమితం కాదు!
మీకు ‘దిల్’ రాజు తెలియకపోవచ్చు... సురేష్‌బాబు తెలియకపోవచ్చు... అల్లు అరవింద్ తెలియకపోవచ్చు... అంత పెద్దవాళ్లను వదిలిపెడితే అసలు మీకు ఇండస్ట్రీలో స్పాట్బాయ్ కూడా తెలియకపోవచ్చు. మీరు ఖమ్మంలో ఉండొచ్చు... తాడేపల్లిగూడెంలో ఉండొచ్చు... అనంతపురంలో ఉండొచ్చు... అసలు మీరు హైదరాబాద్ రావడానికి ట్రైన్ టికెట్ కొనడానికి మనీ లేకపోవచ్చు... అయినా సరే... మీరున్న చోటే ఏ ఖర్చు లేకుండా థియేటర్లో రిలీజ్ చెయ్యగలిగే ఒక పూర్తి నిడివి గల సినిమా ఎలా తీయొచ్చో నేను చెబుతాను అంటున్నారు... రామ్‌గోపాల్ వర్మ. అవునా... ఇదంతా నిజమా? అసలు వర్మ మాటలను విశ్వసించవచ్చా? లేక ఇదేమన్నా ఆయన చేసే రొటీన్ పబ్లిసిటీ జిమ్మిక్కా? అసలిది వర్మలాంటి వారికే పరిమితమా? లేక అందరికీ సాధ్యమా? ఈ ప్రశ్నలన్నింటికీ వర్మ దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. అసలు ‘ఐస్‌క్రీమ్’ సినిమాను అతి తక్కువ బడ్జెట్లో ఎలా తీయగలిగారు? అసలు ఇలా తీయాలని ఎందుకనిపించింది? ఈ విశేషాలన్నింటినీ రామ్‌గోపాల్‌వర్మ ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్‌గా వివరించారు. 1. ఇది 1999 నాటి మాట. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్సు చేసిన ఇద్దరు ఔత్సాహిక దర్శకులు 15 వేల డాలర్ల ఖర్చుతో ఓ సినిమా తీశారు. దాన్ని విడుదల చేయడం కోసం ఓ స్టూడియో వాళ్లకు చూపిస్తే ఓ అరగంట సినిమా చూసి పారిపోయారు. కానీ నానా తిప్పలుపడి మొత్తానికి ఆ సినిమా రిలీజ్ చేయగలిగారు వాళ్లిద్దరూ. సరిగ్గా అదే రోజు మరో పెద్ద సినిమా ‘ఐస్ వైడ్ షట్’ కూడా రిలీజ్. టాప్ హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, నికోల్ కిడ్మన్ నటించిన సినిమా అది. అయితే దానికన్నా ఈ కొత్త సినిమాకే బాగా ఓపెనింగ్స్ వచ్చాయి. దానికి కారణం ఇంటర్నెట్లో వాళ్లు చేసుకున్న ప్రచారం. ఒక సినిమాని అలా ప్రచారం చేసి, హిట్ చేయొచ్చని హాలీవుడ్‌కి అప్పుడే తెలిసొచ్చింది. 250 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఆ సినిమా పేరు ‘ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’. 2. ఏడు వేల డాలర్లతో తీసిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ సెన్సేషన్ సృష్టించింది. ఇలా తక్కువ బడ్జెట్లో ఓ సహకార సంఘంలాగా సినిమా తీయడమనేది హాలీవుడ్లో ఓ ట్రెండ్ అయ్యింది. వాటి ఇన్స్పిరేషన్తోనే ‘ఐస్‌క్రీమ్’ మొదలుపెట్టా! 3. మామూలుగా ఓ సినిమా తీయాలంటే కథ కావాలి. ఆర్టిస్టులు కావాలి. టెక్నీషియన్లు కావాలి. వాళ్లకు డబ్బులిచ్చి సినిమా తీయాలి. ఇది రెగ్యులర్ ఫార్మాట్. నేను దీనికి పూర్తి భిన్నంగా వెళ్లదలిచా! 4. మొదట ఆర్టిస్టుల విషయానికొద్దాం. ఇందులో రెండే రెండు ప్రధాన పాత్రలు. నవదీప్, తేజస్వి. వీళ్లిద్దరికీ పారితోషికాలు కాకుండా, సినిమాలో ఇంత వాటా ఇస్తామని చెప్పాం. అంటే విడుదల తర్వాత లాభాలను బట్టి వాళ్ల డబ్బులు వాళ్లకు పర్ఫెక్ట్గా అందుతాయి. ఈ సినిమాకి నో కాస్ట్యూమ్ డిజైనర్స్. సీన్‌కి తగ్గట్టు వాళ్ల కాస్ట్యూమ్స్ వాళ్లే వేసుకొచ్చేశారు. నో మేకప్. ఏవైనా టచప్‌లు ఉంటే వాళ్లే చేసుకున్నారు. షూటింగ్‌కి వాళ్ల కారులోనే వచ్చారు. బ్రేక్ ఫాస్ట్ ఎవరింట్లో వాళ్లు చేసి రావడమే. లంచ్ ఎవరికి నచ్చింది వాళ్లు ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే. సెట్లో కాఫీ, టీలు మాత్రమే ఇచ్చాం. 5. సినిమా షూటింగ్ అంతా ఒక్క బిల్డింగ్‌లో చేశాం. ఆ బిల్డింగ్ రెంట్ రోజుకి 30 వేలు. 7 రోజుల షూటింగ్‌కి 2 లక్షల 10 వేల రూపాయలు ఇచ్చాం. కాఫీ, టీలకు 1, 832 రూపాయలు ఖర్చు అయ్యింది. అంటే మొత్తం 2 లక్షల 11 వేల 832 రూపాయలు ఖర్చయినట్టు. ఇది ఒక రకంగా మా మేకింగ్ కాస్ట్! 6. మా యూనిట్ మొత్తం 8 మంది మాత్రమే. నలుగురు కెమేరా ఆపరేటర్లు, నేను, ఒక అసిస్టెంట్ డెరైక్టర్, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ అసిస్టెంట్. కై్లమాక్స్కి మాత్రం ఇంకొంతమంది పెరిగారు. 7. ‘సత్య’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి 20 లక్షలైంది. ఆ తర్వాత సినిమాకి అమర్ మొహిలే 10 లక్షలు తీసుకున్నాడు. ‘డి’ దగ్గరకొచ్చేసరికి 3 లక్షలే అయ్యింది. టెక్నాలజీ పెరిగేకొద్దీ బ్యాగ్రౌండ్ స్కోర్కయ్యే ఖర్చు తగ్గిపోయింది. ‘ఐస్‌క్రీమ్’కి మాత్రం నాకు రూపాయి ఖర్చు కాలేదు. దానికి కారణం... కొన్ని వెబ్ సైట్స్‌లో ఆర్ఆర్ ట్రాక్స్‌ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకున్నాం. వాటిని స్టీరియో మిక్స్ చేయడానికి ఓ టెక్నికల్ పర్సన్ సపోర్ట్ తీసుకున్నామంతే! 8. సౌండ్ ఎఫెక్ట్స్‌కి కూడా మాకు డబ్బు ఖర్చు కాలేదు. టీవీ సీరియల్క్కూడా పనిచేయని ఒకతను మాకు ఈ వర్క్ చేసిపెట్టాడు. సినిమా బాగోలేదన్నవాళ్లు కూడా సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయని చెప్పిన విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. 9. ‘బ్లాక్‌మ్యాజిక్’ అనే పాకెట్ కెమేరాతో ఈ సినిమా తీశాం. దాని ఖరీదు కేవలం పాతిక వేలు. లైట్లు అస్సలు వాడలేదు మేం. 10. ఓసారి స్టడీక్యామ్ కెమేరాను గుర్తు చేసుకుందాం. గ్యారెట్ బ్రౌన్ అనే వ్యక్తికి జాగింగ్ చేస్తున్నపుడు ఓ సందేహం వచ్చింది. మనిషి పరిగెడుతున్నా విజన్ షేక్ కావడం లేదు... మరి కెమేరాతో పరిగెడితే పిక్చర్ ఎందుకు షేక్ అవుతోందని? కెమేరా ఐ పీస్ చిన్నగా ఉండటం వల్లే ఈ సమస్య వస్తుందని గుర్తించిన అతను, ఐ పీస్ లేకుండా కెమేరాకు మానిటర్ పెడితే? ఎలా ఉంటుందని ఆలోచించాడు. దాన్నుంచి పుట్టిందీ స్టడీక్యామ్. ‘శివ’ టైమ్‌లో అన్నపూర్ణ స్టూడియోలో - ఎవరూ చదవకుండా పారేసిన ‘అమెరికన్ సినిమాటోగ్రాఫర్’ మేగజైన్లో ఈ విశేషాలు చదివాను. ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ల దగ్గర ఈ స్టడీకామ్ నాలుగేళ్లుగా ఖాళీగా పడివుందని తెలిసి ఆశ్చర్యపోయా. మా కెమేరామేన్ ఎస్. గోపాల్‌రెడ్డికి స్టడీకామ్ వాడదామని చెబితే, ‘‘ఫోకస్ సరిగ్గా ఉండదు, బ్యాలెన్స్ ఉండదు’’ అని చెప్పారు. అయినా పర్లేదని చెప్పి వాడాం. ‘శివ’ హిట్టయ్యాక అందరూ స్టడీక్యామ్ వాడసాగారు. ఇప్పుడా స్టడీక్యామ్ మూల పడిపోయే రోజు వచ్చింది. అదెందుకనో వివరంగా చెబుతాను. 11. ‘ఐస్‌క్రీమ్’కి ‘గింబల్’ అనే రిగ్ వాడాం. ఈ గింబల్ దెబ్బకు ఇకపై స్టడీక్యామ్, ట్రాక్ అండ్ ట్రాలీ కనబడవ్! కావలిస్తే ఒకటి, రెండు నెలలు ఆగి చూడండి. అవి చేసే పనులను పది రెట్లు ఇంకా బెటర్‌గా ‘గింబల్’ చేస్తుంది! స్టడీక్యామ్ ఎక్విప్మెంట్ మొత్తానికి రోజుకి వేలల్లో ఖర్చు అవుతుంది. ‘గింబల్’కి అంత అవసరం లేదు. స్కిల్డ్ ఆపరేటర్ కూడా అవసరం లేదు. ‘ఐస్‌క్రీమ్’కి ఓ ప్రొడక్షన్ బాయ్‌తో ఆపరేట్ చేయించాం. బకెట్ తీసుకెళ్లినంత సులువుగా, ‘గింబల్’ను వాడొచ్చు. కెమేరాను 360 డిగ్రీస్‌లో ఆపరేట్ చేయొచ్చు. 12. ‘ఫ్లోకామ్’ విషయానికొద్దాం. ‘ఫ్లోక్యామ్’... కెమేరా కాదు, ఒక మెథడ్! ఆర్టిస్టులకి కెమేరా కనబడ కుండా ఆపరేట్ చేసే పద్ధతి. ఇది నేను కనిపెట్టిందే! ఫ్లోక్యామ్ పద్ధతిలో కెమేరా ఎక్కడుందో తెలీకుండా, అసలు షూటింగ్ జరుగుతున్నట్టే తెలియకుండా షాట్స్ తీసుకోవచ్చు. దీనివల్ల ఓ కొత్త రకమైన ఫిల్మ్ లాంగ్వేజ్ వస్తుంది. సినిమా గ్రామర్ మారుతుంది. 13. మాకు ‘ఎడిటర్’ అనే కాన్సెప్టే లేదు. ఆరుగురు ట్రైనీలు ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో ఎడిట్ చేస్తుంటే, వాటిని ఫైనల్‌గా ఒకరు పర్యవేక్షించారు. 14. లిమిటెడ్ బడ్జెట్లో, లిమిటెడ్ టీమ్‌తో ఎవరైనా సినిమా తీసేయొచ్చు. ఇది రామ్గోపాల్వర్మకో, పూరి జగన్నాథ్కో పరిమితం కాదు. టెక్నాలజీని మనం ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. 15. మునుపటిలోలాగా స్టూడియోల గేట్లు పట్టుకుని వేలాడనవసరం లేదు! ఎవరి దగ్గరా అసిస్టెంట్లుగా చేరనవసరం లేదు. నిర్మాతల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. మీకు నచ్చినట్టుగా సినిమా తీసేసి ఓ ట్రయిలర్ రెడీ చేసుకోండి. దాన్ని పేరున్న పంపిణీ సంస్థకో, నిర్మాణ సంస్థకో పంపండి. వాళ్లకు మీ కంటెంట్ నచ్చితే కచ్చితంగా మీకు ఆహ్వానం పలుకుతారు. ఇక ఇంటర్నెట్లో యూ ట్యూబ్ ఎలానో ఉంది. అక్కడ కూడా మీ ప్రయత్నాన్ని అందరూ వీక్షించేలా చేసుకోవచ్చు. 16. మీకో ఉదాహరణ చెబుతాను. ఓ నాగ్‌పూర్ అబ్బాయి ఓ చిన్న సినిమా తీశాడు. అచ్చం నేను అంతకు ముందు తీసిన ‘అడవి’ సినిమాలా అనిపిస్తుంది. అయితే నేను ‘అడవి’ సినిమాను ఏడున్నర కోట్లు ఖర్చుపెట్టి తీస్తే, అతనేమో 6 లక్షల్లో బ్రహ్మాండంగా తీశాడు. పక్కింటాయన దగ్గర కెమెరా తీసుకుని, తన ఫ్రెండ్స్‌ని పెట్టి తీశాడు. అవుట్‌పుట్ చూసి అదిరిపోయాను. వెంటనే ఆ డీవీడీని ముంబైలో కె. సెరాసెరా సంస్థ వాళ్లకు పంపించాం. వాళ్లు చూసి టెరిఫిక్‌గా ఉందన్నారు. అయితే 70 నిమిషాల నిడివే ఉంది. దాని నిడివి పెంచి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. 17. అలా నాగ్‌పూర్ నుంచి ఓ దర్శకుడు వచ్చినట్టుగా, ఏ చీరాల నుంచో, రాజమండ్రి నుంచో కరీమ్నగర్ నుంచో డెరైక్టర్లు ఎందుకు రాకూడదనేది నా ప్రశ్న. 8 కోట్ల మందిలో ఒక రామ్‌గోపాల్ వర్మ, ఒక పూరి జగన్నాథేనా? మా మాదిరి టాలెంట్ ఉన్నవాళ్లు ఇంకా చాలామందే ఉండి ఉంటారు. ఈ టెక్నాలజీ వాళ్లకు పెద్ద ఊతాన్ని ఇవ్వాలి. 18. నాకు 2 లక్షల్లో సినిమా అయినట్టుగా మీకు అవ్వకపోవచ్చు. ఇంకాస్త ఎక్కువైతే అయ్యింది... ముందంటూ ప్రయత్నం మొదలుపెట్టండి. మీకు అందుబాటులో ఉన్న వనరులతోనే సినిమా తీసి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. 19. టెక్నాలజీలో వచ్చే మార్పుల్ని మొదట ఎవ్వరూ జీర్ణించుకోలేరు. కమల్‌హాసన్ ‘ఆవిడ్’ వాడినప్పుడు, మిగతా ఎడిటర్లంతా నిరాకరించారు. నేను ‘దొంగల ముఠా’ను 5డిలో తీసినప్పుడు కూడా అంతే. టెక్నాలజీ వల్ల సినిమా మేకింగ్‌లో సరికొత్త విప్లవం వస్తుంది... ఇంకా రావాలి కూడా. ఇలా మీరు చెప్పడం వల్ల ప్రతివాడూ డెరైక్షన్ చేసేస్తాడు కదా? అని ఎవరో అడిగారు. ఏం... ఎందుకు చేయకూడదు? ప్రతివాడికీ ఓటు హక్కు ఉన్నట్టుగా... ప్రతివాడూ ఎందుకు సినిమా తీయకూడదు? ఈ టెక్నాలజీ కొంతమందికి మింగుడు పడకపోవచ్చు. కానీ భవిష్యత్తు ఇండస్ట్రీ ఇదే! 10-15 శాతం ఖర్చు తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో 80 శాతం ఖర్చు కలిసొస్తుందంటే అందరూ దీని గురించి par ఆలోచించాల్సిందే!ఙ- సంభాషణ: పులగం చిన్నారాయణ