breaking news
nation award
-
లరియాపల్లికి జాతీయ గుర్తింపు
భువనేశ్వర్: రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లె జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి రాష్ట్రపతి పురస్కారం అందుకుంది. ఒకనాడు సారా మైకంలో తేలియాడిన ఈ పంచాయతీలో నేడు సారా ఛాయలు లేకుండా పోవడం విశేషం. ఈ విశిష్టత భారత రాష్ట్రపతి గుర్తింపును సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. సంబల్పూర్ జిల్లా బమొరా సమితి లరియాపల్లి పంచాయతీ గ్రామం సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. లరియాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సుక్రి కుజుర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సారా తాగుడు, మత్తు పదార్థాల (డ్రగ్స్) సేవన నిర్మూలన కార్యక్రమంలో విజయం సాధించినందుకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ పంచాయతీ వ్యాప్తంగా మద్యం నిషేధం అమలవుతోంది. ఒకానొకప్పుడు ఈ గ్రామం నిండా మందు బాబులే. ఈ గ్రామంలో ఏటా 2.4 క్వింటాళ్ల నాటు సారా విక్రయం జరిగేది. ఇది 3 ఏళ్ల కిందటి పరిస్థితి. గ్రామస్తుల నిరవధిక కృషితో నేడు ఈ పంచాయతీ సారా రహిత గ్రామంగా పేరొందడం విశేషం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ డైరెక్టర్, కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామస్తులు సారా నిర్మూలనకు నిరవధికంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి లక్ష్యం సాధించారు. గ్రామంతో బాటు పంచాయతీ వ్యాప్తంగా మత్తు పానీయాలు, పదార్థాల విక్రయం, సేవన నిర్మూలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రామం మత్తు రహిత ప్రాంతంగా వెలుగొందుతోంది. గ్రామస్తుల దైనందిన జీవన పోకడలో సంస్కరణ ధ్యేయంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యక్తిత్వ వికాస కేంద్రం క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇతరేతర కార్యక్రమాల్ని చేపట్టారు. అంచెలంచెలుగా మద్యం వైపరీత్యాలపట్ల గ్రామస్తుల్ని చైతన్య పరిచారు. నిరవధికంగా చైతన్య కార్యక్రమాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ డైరెక్టర్ భోలా నాథ్, లరియాపల్లి గ్రామ సర్పంచ్‌తో పాటు మరో 50 మంది గ్రామస్తులు చైతన్య కార్యక్రమాల్ని నిరవధికంగా సాగించి మద్యం ఇతరేతర మత్తు పదార్థాల విక్రయం, సేవించడాన్ని నిర్మూలించారు. యూత్ లీడర్షిప్ శిక్షణ ఇతరేతర చైతన్య కార్యక్రమాల్ని – మిగతా 2వపేజీలో uనిర్వహించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 6 అబ్కారీ కేసులు నమోదు కాగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ కేసుల నమోదు 3కి దిగజారింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2018–19లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. గ్రామంలో దీర్ఘకాలం పని చేసిన మద్యం కొట్లు మూయించారు. ఈ దుకాణాల్లో సిబ్బంది, కార్మికులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులుగా చేర్పించి ఉపాధి కల్పించడంతో వీరి జీవన శైలి ఊహాతీతంగా సంస్కరణకు నోచుకుంది. ఉద్యానవనాల పెంపకం, చేపలు ఇతరేతర జలచరాల ఉత్పాదన, వ్యవసాయ రంగం పనులు వగైరా వ్యవహారాల్లో సారా విక్రేతల అనుబంధ వర్గాలు ఇప్పుడు తలమునకలై స్వగ్రామానికి జాతీయ వన్నె దిద్ది రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు. -
అక్షరాస్యతలో వీర్నపల్లి నంబర్ 1
ఎల్లారెడ్డిపేట : అదో మారుమూల గిరిజన గ్రామం.. నిన్నామొన్నటివరకు ఆ ఊరిపేరు మండలానికే పరిమితమైంది. అదే గ్రామం నేడు సంపూర్ణ అక్షరాస్యత సాధించి దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకుంటోంది. అదే కరీంనగర్ జిల్లాలోని వీర్నపల్లి. ఎల్లారెడ్డిపేటలోని వీర్నపల్లిని ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. అప్పటినుంచి ఇక్కడి గిరిజనులు పలుగుపారతోపాటు పలకాబలపం పట్టారు. కూలీనాలీ చేసుకునే గిరిజనులు సైతం అక్షరాలు దిద్దడం.. అదికూడా వందశాతం అక్షరాస్యులు కావడం రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిగా నిలిచింది. మారుమూల గ్రామంలో వందశాతం అక్షరాస్యత సాధించారని తెలుసుకున్న ముంబయి ఎస్ఎన్డీటీ మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ జైకుట్టి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ల బృందం జిల్లా అధికారులతో కలిసి సోమవారం వీర్నపల్లిలో పర్యటించి అక్షరాస్యతపై పరిశీలించింది. వందశాతం అక్షరాస్యత సాధించిన రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, దుండిగల్, నల్లగొండ జిల్లా దామెరచెర్ల, సబ్దుల్లాపురం, పుట్టపాక సరసన వీర్నపల్లిని ఎంపిక చేసింది. జాతీయ అవార్డుకు సిఫారసు వందశాతం అక్షరాస్యత సాధించిన వీర్నపల్లిని జాతీయ అవార్డుకు సిఫార సు చేయనున్నట్లు ముంబయి ప్రొఫెసర్ల బృందం సూచనప్రాయంగా తెలిపింది. వందశాతం అక్షరాస్యతకు చేసిన కృషి, వయోజనులు అక్షరాలు నేర్చుకున్న విధానం, పత్రికల్లో వచ్చిన కథనాలు, విద్యకేంద్రాల నిర్వాహణ, ఉపాధి కూలీలకు అడవిలో చెప్పిన చదువుతీరు రికార్డులను కలెక్టర్‌కు సమర్పించాలని బృందం సభ్యులు సూచించారు. ఈమేరకు ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ మంగళవారం కలెక్టర్‌కు సమర్పించారు. అక్షరాస్యత సాధించిన ఆరు గ్రామాల్లో వీర్నపల్లి ముందువరసలో ఉందని ముంబయి ప్రొఫెసర్ల బృందం తెలిపినట్లు ఎంపీడీవో చిరంజీవి, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ తెలిపారు.