breaking news
Narreddy Sivarami Reddy
-
కామ్రేడ్ శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ మృతి
సాక్షి, హైదరాబాద్ : కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన నర్రెడ్డి శివరామిరెడ్డి సతీమణి కొండమ్మ గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆమె కుమార్తె భగీరథీ ఇంట్లో కన్నుమూశారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామంలో జన్మించిన కొండమ్మకు 1947లో శివరామిరెడ్డితో వివాహమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న కాలంలో 1949 అక్టోబర్ 1న వీరపునాయునిపల్లె మండలం, యూరాజుపాలెం గ్రామంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన కమ్యూనిస్టు కుటుంబాల్లో, ప్రజల్లో ఆమె ధైర్యం నింపారు. ఇతరనాయకురాళ్లతో కలసి మహిళా ఉద్యమాన్ని నిర్మించారు. పార్టీ సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను కొనేందుకు తన మెడలోని బంగారు నగల్ని విరాళంగా ఇచ్చారు. సాయుధ పోరాటంలో ఆర్థికంగా చితికిపోయిన కామ్రేడ్ల కుటుంబాలను ఆదుకోవడానికి తనవంతు వాటాకు వచ్చిన ఆస్తిని అమ్మి ఆర్థిక సహాయం అందించే అంశంలోనూ, దుర్భర దారిద్య్రాన్ని గడిపిన సందర్భంలోనూ భర్తకు ఆమె అండగా నిలిచారు. కమ్యూనిస్టు ఉద్యమానికి నర్రెడ్డి కొండమ్మ సేవలు మరువలేనివని హైదరాబాద్ కొండమ్మ పార్థీవదేహం వద్ద నివాళులర్పించిన సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంతాపం ప్రకటించారు. -
మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం శివరామిరెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు డా.గురుప్రసాద్ మీడియాకు తెలిపారు. గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివరామిరెడ్డికి గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. తొలితరం ప్రజాప్రతినిధి.. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ సంతాపం సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.