breaking news
Nahid Afrin
-
పాడు అఫ్రీన్
పాడకపోతే... పాడు అఫ్రీన్ అంటారు. పాడతానంటే... ‘పాడు అఫ్రీన్’ అంటారు. అయినా పాటకి ‘పాడు’, ‘మంచి’ ఉంటుందా? పాడటమే ఉంటుంది కదా! పాటకి ఇన్ని పాట్లయితే... పాట మూగబోవాలా? గొంతెత్తి నినదించాలా? నహీద్ అఫ్రీన్ ఈ శనివారం 25వ తేదీన నినదిస్తుందా..? మూగబోతుందా? ఏఆర్ మురుగదాస్ సినిమా ‘అకీరా’ (2016)లో అకీరా శర్మ అనే అమ్మాయి ఉంటుంది. చిన్న పల్లె. అమాయకపు పిల్ల. అమ్మానాన్న, తను. హాయిగా ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఓరోజు ఓ గుంపు ఒక యువతి ముఖం మీద యాసిడ్ పోసి పారిపోవడం చూస్తుంది. వాళ్లలో ఒకడిని గుర్తుపట్టి పోలీసులకు చెబుతుంది. పోలీసులు వాడిని పట్టుకుంటారు. తప్పించుకుపోయినవాళ్లు ఈ అమ్మాయి మీద పగబడతారు. ఎందుకైనా మంచిదని కూతురికి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తాడు తండ్రి. ఇంకోసారి ఇంకో గ్యాంగు ఓ అమ్మాయిని ఏడిపించడం చూస్తుంది అకీరా. వాళ్లను తరిమి తరిమి కొడుతుంది. వాళ్లలో ఒకడు అకీరా మీదకు యాసిడ్ విసరబోతాడు. అకీరా ఒడుపుగా తప్పించుకుంటుంది. యాసిడ్ విసిరినవాడి మీదే పడుతుంది. అకీరానే పోసిందని, ఆమెను బాలనేరస్థుల జైలుకు పంపుతారు. జైలు నుంచి విడుదలయ్యాక, కాలేజీలో చేరాక జీవితంతో అకీరా ఫైట్ మొదలవుతుంది. అన్యాయాలతో ఆమె రాజీ పడదు. అందుకే ఆ ఫైట్. పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ సినిమా ‘ఖుదా కె లియే’ (2007)లో మన్సూర్, సర్మద్ అనే ఇద్దరు యువ గాయకులు ఉంటారు. వాళ్లది లాహోర్. ఇద్దరికీ మంచి పేరొస్తుంటుంది. సర్మద్ హఠాత్తుగా పాటలు పాడడం ఆపేస్తాడు. ‘ఇస్లాం మతస్థుడెవరూ నీలా పాటలు పాడుతూ తిరగడు’ అని సర్మద్ మనసు మార్చేస్తాడు ఓ కార్యకర్త. ఇస్లాం పేరుతో వ్యక్తం అయ్యే ఇస్లాం వ్యతిరేక భావాలను దర్శకుడు చివర్లో కోర్టు సీన్లో చూపిస్తాడు. అవి రెండూ సినిమాలు పై రెండు సినిమాలకు, ప్రస్తుతం ఇస్లాం వ్యతిరేకిగా నిందను మోస్తున్న పదహారేళ్ల భారతీయ గాయని నహీద్ అఫ్రీన్‌కి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ నెల 25న అస్సాంలోని ఉడాలి సొనాయి బీబీ కాలేజీలో అఫ్రీన్ మ్యూజికల్ నైట్ ఉంది. అయితే అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దని అస్సాంలోని 46 మంది ముల్లాలు ఏకమై అఫ్రీన్కు ఫత్వా జారీ చేశారు. మధ్య అస్సాంలోని హోజాయ్, నగావన్ జిల్లాల్లో ఈ ఫత్వా ఉన్న కరపత్రాలు పంపిణీ అయ్యాయి. ‘చుట్టూ మసీదులు, ఈద్గాలు, మదరసాలు, ముస్లింల సమాధులు ఉన్న ప్రాంతంలో మ్యూజికల్ నైట్ పేరుతో పాటలు పాడితే తరతరాల వరకు అల్లా ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది’ అని ముల్లాలు ఆ కరపత్రాల్లో హెచ్చరించారు. అఫ్రీన్ చిగురుటాకులా వణికిపోయింది. పాటంటే ఆ అమ్మాయికి ప్రాణం. వణికింది ఆ ప్రాణమే. 2015 సోనీ టీవీ మ్యూజికల్ రియాలిటీ షోలో అఫ్రీన్ ఫస్ట్ రన్నర్–అప్. వైష్ణవ ఆచార్యులు శ్రీమంత శంకరదేవ విరచించి, స్వరపరచిన కీర్తనలు అఫ్రీన్ గాత్రంలోంచి ఒలికి ఆమెకొక దేవరాగపుత్రికగా పునర్జన్మనిచ్చాయి. ఈ జన్మను నిలుపుకోడానికి ఇప్పుడు ఫత్వాలతో పోరాటానికి దిగింది అఫ్రీన్! దర్ద్ బేదర్దా... ‘అకీరా’ చిత్రంలో ‘రజ్రజ్కే’ అనే పాట ఉంది. ఆ పాట ‘దర్ద్ బేదర్దా... దర్ద్ బేదర్దా’ అనే చరణంతో మొదలౌతుంది. దర్ద్ బేదర్దా అంటే... దయలేని బాధ. ఆ పాట అర్థం ఇలా ఉంటుంది. జీవితమా... నవ్వూ నేనూ ఘర్షణ పడుతున్నాం రాజీకొచ్చే సూచనలేమీ నాకు కనిపించడం లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరమే ప్రాణాలతో ఉంటాం. కటువుగా ఉండేదే కటుత్వం పనికిరాదని అంటోంది! ఎంత ఏడిపిస్తావో ఏడిపించు నన్నివాళ. ఎంత శిక్షిస్తావో శిక్షించు నన్ను ఇవాళ. బాధను భరించడానికి నా హృదయం సిద్ధమైంది. నా దారిలో పగిలిన గాజుముక్కలు పడి ఉన్నాయి. అవి నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఆ బాధే నాకిప్పుడు ఉపశమన లేపనం... ...అంటూ ఈ పాట పూర్తవుతుంది. సినిమాలో... సమాజానికీ, ఆ అమాయకపు పల్లె పిల్లకు మధ్య జరిగిన ఘర్షణ ఇది. నిజ జీవితంలో ఈ పాట పాడింది ఎవరో కాదు... నహీద్ అఫ్రీనే! ప్రస్తుతం అఫ్రీన్ ఉన్న పరిస్థితికి, ఆ పాటలోని భావం చక్కగా సరిపోతుంది. మా ఊరి కోకిలమ్మ అఫ్రీన్ అస్సామీ. తేజ్‌పూర్‌లోని బిస్వనాథ్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చదువుతోంది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. మ్యూజిక్ షోలో ఫస్ట్ రన్నర్ అప్‌గా గెలిచాక, అఫ్రీన్కు సినిమా చాన్స్ వచ్చింది. ఇంట్లో పెద్దమ్మాయి. తమ్ముడు ఫయీజ్ అన్వర్. సినిమాలో పాడినప్పటి నుంచి అక్కను వాడు అబ్బురంగా చూస్తున్నాడు! ‘అక్కా.. స్కూల్లో అంతా నీ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని ఇంటికి వచ్చీరాగానే ఉత్సాహంగా చెబుతున్నాడు. మునుపటిలా కాదు. అక్క చెప్పిన పనుల్నీ, చెప్పని పనుల్నీ చటుక్కున అందుకుని చేసేస్తున్నాడు. ఇక చరియాలీ గ్రామస్థులైతే ‘మా ఊరి కోకిలమ్మ’ అంటూ మురిసిపోతున్నారు. సీఎం ఫేవరేట్ సింగర్! అఫ్రీన్ తండ్రి డి.ఆర్.డి.ఓ.లో జూనియర్ ఇంజనీరు. ఆయనైతే మరీను. పుత్రికోత్సాహంలో ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తను అఫ్రీన్ అభిమానిని అని చెప్పుకుంటే ఏ తండ్రికి మాత్రం గొప్పగా ఉండదు! అయితే ఇప్పుడా ఉత్సాహం స్థానంలో ఆ కుటుంబంలో భయం, ఆందోళన వచ్చి చేరాయి. అఫ్రీన్‌కి వ్యతిరేకంగా జారీ అయిన ఫత్వాలోని అర్థం ఒకటే. ‘ఆ పిల్ల పాడడం ఆపకుంటే... ఆ ఇంటిని వెలి వెయ్యండి’ అని చెప్పడం. ముస్లిం సంప్రదాయ కుటుంబాలకు సహజంగానే ముల్లాలు చెప్పిందే వేదం అవుతుంది. అయితే అస్సాంలోని ముస్లిం కుటుంబాలకు ఆఫ్రీన్ గాత్రం కూడా వేదంలానే వినిపిస్తోంది. అఫ్రీన్ అభిమాని అయిన పూర్వపు ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి శరవానంద్ సోనోవాల్ పూర్తిగా అఫ్రీన్ వైపే ఉన్నారు. ఈ చిన్నారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్థానిక యంత్రాంగానికి సి.ఎం. ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతేకాదు, సోనోవాల్ స్వయంగా అఫ్రీన్‌కి ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పారు! ‘నా స్వరం... దేవుడి వరం’ ‘మ్యూజిక్, డాన్స్, డ్రామా, థియేటర్... ఇవన్నీ షరియా చట్టాలకు వ్యతిరేకం. అల్లా క్షమించడు’ అని కరపత్రాల్లోని ముల్లాల హెచ్చరికను చూడగానే మొదట ఆఫ్రీన్ ఏడ్చేసింది. తర్వాత తేరుకుంది. ‘స్వరం నాకు దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని నేను వదులుకోలేను’ అంటోంది. అఫ్రీన్ తండ్రి కూడా కూతురికి పూర్తి మద్ధతు ఇస్తున్నారు. స్థానిక మత పెద్దలు, ముస్లిం ప్రముఖులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా అఫ్రీన్ వైపే ఉన్నాయి. అఫ్రీన్కు ముందు.. సుహానా నహీద్ అఫ్రీన్ కన్నా ముందు సుహానా సయీద్ అనే 22 ఏళ్ల కన్నడ ముస్లిం గాయని మతపరమైన ఒత్తిళ్లకు గురయ్యారు. కన్నడ టీవీ రియాలిటీ షోలో ఆమె హైందవ కీర్తనలను ఆలాపించడమే ఆ ఒత్తిళ్లకు ప్రధాన కారణం. సుహానా కుటుంబం కర్నాటకలోని షిమోగా జిల్లాలో ఉంటుంది. టీవీ షోలో సుహానా గాత్రానికి న్యాయనిర్ణేతలు ముగ్ధులై, హిందూ ముస్లిం ఐక్యతకు సుహానా ఒక సాక్ష్యం అని ప్రశంసించారు కూడా. అయితే ఆ ప్రశంసలేవీ సుహానా కుటుంబ సభ్యులను విమర్శల నుంచి కాపాడలేకపోయాయి. ‘సుహానా... నువ్వు మగవాళ్ల ముందు పాడి, ముస్లిం మత ప్రతిష్టకు మచ్చ తెస్తున్నావు. నీ అందాన్ని పర పురుషుల ఎదుట ప్రదర్శించడానికి నీ తల్లితండ్రులు అనుమతించారు. నీ వల్ల వాళ్లు స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. పరదాను గౌరవించని నువ్వు పరదాను వేసుకోవడం మానెయ్’ అని మంగుళూరు ముస్లిం పేరిట ఫేస్బుక్లో సుహానాపై మండిపడుతూ ఒక పోస్టు ప్రత్యక్షమయింది! అయితే అదే పోస్టులో సుహానాను సమర్థిస్తూ కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఉదారవాదులైన ముస్లింలు మాత్రం ఇప్పుడు నహీద్ అఫ్రీన్‌ను వెనకేసుకు వచ్చినట్లే, అప్పుడు సుహానా సయీద్‌ను కూడా అక్కున చేర్చుకున్నారు. పొడవాటి జుట్టున్నయువరాణి సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తను పరిచయం చేసుకుంటోంది నహీద్ అఫ్రీన్. ‘‘అనగనగా ఒక యువరాణి. ఆమె పేరు రాపుంజల్. పెద్ద జుట్టుతో భలే అందంగా ఉండేది. అందరినీ ఆకట్టుకునేది. ఇతర రాజ్యాల యువరాణులు ఆమె జుట్టు రహస్యం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించేవారు. కానీ ఆ రహస్యాన్ని రాపుంజల్ ఎప్పుడూ బయట పెట్టలేదు. ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. నాదీ పెద్ద జుట్టే. నాకూ యువరాణి కావాలని ఆశ. స్వరాల యువరాణి కావాలి. ఏ సంగీత పోటీలకు వెళ్లినా జడ్జీలతో సహా అంతా అందమైన నా పొడవాటి జుట్టును ప్రశంసించేవాళ్లే. నా పేరు నహీద్ అఫ్రీన్. ఈ దేశపు రాపుంజల్ని! సంగీతం అంటే ప్రాణం. యాక్టింగ్, డ్రాయింగ్, టేబుల్ టెన్నిస్... అన్నిటికన్నా అల్లరి చేయడం అంటే చాలా ఇష్టం ’ అని పరిచయం పూర్తి చేసుకుని, తను ఎంపిక చేసుకున్న బెంగాలీ సింగర్ యాష్కింగ్ పాటను పాడింది. పరిచయం, పాట పూర్తవగానే సల్మాన్ ఖాన్ ఎగ్జయిట్ అయిపోయాడు. రియాలిటీ షో జడ్జీలలో ఒకరు ఆయన. ‘‘శభాష్ నహీద్. ఈ పాటతో ఈ రోజు నువ్వు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లావు. శభాష్’’ అన్నాడు. ఇంకో పాటకు ఇంకో జడ్జి ‘‘నువ్వు స్వరాల ఖజానా. ఎక్స్ప్రెషన్స్ ఖజానా. పెర్ఫార్మెన్స్ ఖజానా... ఎన్నని చెప్పమంటావు? నువ్వే ఒక ఖజానా! మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. మిగతా ఇద్దరు జడ్జీలూ అఫ్రీన్కు ఆశీస్సులు అందించారు. అఫ్రీన్ ఇటీవల పాడిన పాటల్లో కొన్ని తీవ్రవాదాన్ని వ్యతిరేకించేవి కూడా ఉన్నాయి. ‘‘బహుశా ముల్లాల ఆగ్రహానికి అదే కారణం కావచ్చు’ అని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలోంచి కూడా విచారణ జరుపుతున్నారు. అమ్మానాన్నలతో అఫ్రీన్ -
యువ స్టార్ గాయనికి ఫత్వా షాక్!
-
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
-
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
ముంబై :రియాల్టీ సింగర్ నహీద్ అఫ్రిన్ పై ముస్లిం మత గురువులు ఫత్వా జారీచేశారు. బహిరంగ వేదికలపై ముస్లిం బాలికలు పాటలు పాడటం ఇస్లాం విశ్వాసాలకు విరుద్దమంటూ 46 మంది మతగురువులు ఆమెకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలు జారీచేశారు. అయితే దేశమంతా తన వెన్నంటే ఉందని, ముస్లిం మత బోధకుల ఫత్వాకు తాను భయపడేది లేదని అఫ్రిన్ స్పష్టంచేసింది. తనను పాడటం ఆపడం చాలా కష్టమని అఫ్రిన్ పేర్కొంది. అస్సాం ప్రభుత్వం సైతం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమె రక్షణకు తాము గ్యారెంటీ ఇస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ఆర్గనైజేషన్లు ఎంతో ప్రతిభకలిగిన గాయని నహీద్ అఫ్రిన్ ప్రదర్శన ఇవ్వకుండా ఆంక్షలు విధించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్విట్టర్ ద్వారా నహీద్ కు మద్దతుగా నిలిచారు. నహీద్ తో మాట్లాడతామని, ఆర్టిస్టులకు రక్షణ, భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సోనోవాల్ పునరుద్ఘాటించారు. ముస్లిం మతగురువులు తనపై ఫత్వా జారీచేశారని విన్న తర్వాత తాను చాలా షాక్ కు గురయ్యాయని, కానీ చాలామంది ముస్లిం గాయకులు తనకు మద్దతుగా నిలిచి పాడేందుకు ప్రోత్సహించారని నహీద్ చెప్పింది. ''పాడటం నాకు దేవుడిచ్చిన వరం, ఇది సరైన మార్గంలో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఎలాంటి హెచ్చరికలకు నేను భయపడను. తుది శ్వాస వరకు నేను పాడుతూనే ఉంటా'' అని నహీద్ తెలిపారు. మసీదు, శ్మశాన సమీపంలో, బహిరంగ వేదికల్లో పాటలు పాడటాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మతగురువులు ఆమెపై ఫత్వా జారీచేశారు. టెర్రరిజం, ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా నహీద్ ఎక్కువగా పాటలు పాడుతూ ఫేమస్ అయింది. ఆమె తర్వాత ఈవెంట్ మార్చి 25న జరుగబోతుంది. -
యువ స్టార్ గాయనికి ఫత్వా షాక్!
గువాహటి: యువ స్టార్ గాయని నహిద్ అఫ్రిన్‌కు వ్యతిరేకంగా 42 మంది ఇస్లామిక్ మతగురువులు ఫత్వా జారీ చేశారు. ఆమె బహిరంగంగా పాటలు పాడవద్దంటూ హుకుం జారీచేశారు. ప్రముఖ టీవీ మ్యూజిక్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్'లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన నహిద్ అఫ్రిన్ దేశం దృష్టిని ఆకర్షించింది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన 'అకిరా' సినిమాలో ఓ పాటను పాడటం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. స్టార్ సింగర్‌గా పేరొందిన ఆమె ఈ నెల 25న గువాహటిలో ఓ బహిరంగ కచేరిలో పాడబోతున్నది. అయితే, బహిరంగ కచేరి వేదిక మసీదుకు, శ్మశానానికి దగ్గరగా ఉందని, కాబట్టి ఆమె సంగీత కచేరిని బహిష్కరించాలంటూ మతగురువులు ఫత్వా జారీచేశారు. ఆమె బహిరంగంగా పాటలు పాడకూడదంటూ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే ఈ ఫత్వాతో బెదిరేది లేదని, సంగీతాన్ని వీడబోనని నహిద్ స్పష్టం చేసింది. 'ఈ ఫత్వా నన్ను షాక్ గురించింది. ఛిన్నాభిన్నం చేసింది. ముస్లిం గాయకుల స్ఫూర్తితో నేను పాడుతున్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాను. సంగీతాన్ని ఎప్పుడూ వీడను' అని ఆమె స్పష్టం చేసింది. సంగీతం నాకు దేవుడు ఇచ్చిన కానుక. దానిని విస్మరించడమండే దేవుడిని విస్మరించడమేనని ఆమె పేర్కొంది. ఫత్వా ఎదుర్కొంటున్న ఆమెకు పూర్తిస్థాయిలో భద్రత కలిస్తామని, అండగా ఉంటామని అసోం సీఎం శరబానంద్ సోనోవాల్ హామీ ఇచ్చారు.