breaking news
Mother Care
-
‘రైజ్ ఏ చైల్డ్’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..
పాపాయి నిద్రపుచ్చినంతసేపు కూడా పడుకోలేదు. భుజానికెత్తుకుని తిప్పి తిప్పి నిద్రపుచ్చి ఇలా మంచం మీద పెట్టానో లేదో వెంటనే లేచేసింది. ఈ బిడ్డతో నేనేం చేయను’ చంటిబిడ్డను పెంచే ప్రతి తల్లి నుంచి వినవచ్చే మాటే ఇది. ఆ తల్లి వెలిబుచ్చిన నిస్సహాయతలో అగాధం వంటి ఆవేదన దాగి ఉంటుంది. ఈపాట్లన్నీ పడిపాపాయిని ఆరు నెలలు పెంచేసరికి మెటర్నిటీ లీవ్ అయిపోతుంది.అప్పుడు మరో ప్రశ్న... ‘బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టి ఉద్యోగానికి వెళ్లవచ్చా. చక్కగా చూసుకోగలిగిన ఆయాలు దొరికితే బావుణ్ను’. బిడ్డకు ఘనాహారం ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్లు చెబుతారు, కానీ ఎలా తినిపించాలనేది మాత్రం బిడ్డను పెంచిన అనుభవం ఉన్న తల్లులే చెప్పాలి. పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెలిసిందో గ్రామం. దాని పేరే ‘రైజ్ ఏ చైల్డ్’. ఎక్కడ ఉందీ గ్రామం. ఈ గ్రామం అడ్రస్ చెప్పాలంటే కేరాఫ్ డిజిటల్ మీడియా అని చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు, నగరాల్లో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పసిబిడ్డ అమ్మమ్మ, నానమ్మల చేతిలో పెరిగే అవకాశాలు తగ్గిపోయిన ఈ కాలంలో బిడ్డ సంరక్షణలో తల్లులకు ఎదురయ్యే సందేహాలను డిజిటల్ మాధ్యమం ద్వారా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. వివిధ ్రపాంతాల్లో ఉన్న తల్లులు ఇందులో జాయిన్ అయ్యారు. ‘క్వశ్చన్స్ అరౌండ్ బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ మదర్స్, బేబీ లెడ్ వీనింగ్, గుడ్ షెడ్యూల్ ఫర్ బేబీస్, క్లాత్ డయాపరింగ్ ఇండియా, ఫస్ట్ ఫార్టీ డేస్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్’ వంటి పది గ్రూప్‌లను ఒక గొడుగు కిందకు తీసుకువస్తూ ‘రైజ్ ఏ చైల్డ్’ పేరుతో ఒక వర్చువల్ విలేజ్‌కి రూప కల్పన చేసింది రోహిణి అనే మహిళ.‘‘నిజానికి నాకెదురైన సమస్యలే ఈ వర్చువల్ విలేజ్ రూపకల్పనకు నాంది. గర్భధారణ, ప్రసవం 30 ఏళ్లలోపు జరగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలలో స్థిరపడిన తరవాతనే పెళ్లి. దాంతో పిల్లలను కనే వయసు దాటిపోతోంది. నేను 32 ఏళ్ల వయసులో గర్భం దాల్చాను. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ రోజువారీ ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం మళ్లీ డాక్టర్ చెకప్ వరకు ఆగలేం.అప్పటికీ రోజూ ఫోన్ చేసి అమ్మ, అత్తగారిని అడిగి తెలుసుకుంటున్నప్పటికీ నేను సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నానా లేదా అనే సందేహం. పాత తరం వారి అనుభవంతోపాటు కొత్తతరంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఇన్ని వేదికలున్నాయని తెలిసింది. ఆ గ్రూప్‌ల అడ్మిన్లందరితో మాట్లాడి అన్నింటినీ ‘రైజ్ ఏ చైల్డ్’ గొడుగు కిందకు తీసుకువచ్చాను. గర్భిణులకు, కొత్త తల్లులకు ఇది ఒక వరంగా మారింది. ఇది మనదేశంలో ఉన్న వాళ్లకే కాదు, విదేశాల్లో ఉన్న మనవాళ్లకు కూడా ఉపయోగపడుతోంది. నిజానికి మనకంటే వాళ్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది.ఎందుకంటే ఐర్లాండ్‌లో ఉన్న ఒక మహిళ అక్కడి వైద్యవిధానాలు, వైద్యుల సూచనను యథాతథంగా పాటించింది. కానీ ఆ పద్ధతులుపాపాయికి సౌకర్యంగా అనిపించడం లేదని తెలిసి ‘రైజ్ ఏ చైల్డ్’లో చేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒకరు తమ సమస్యనుపోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు’’ అని వివరించింది రోహిణి. రైజ్ ఏ చైల్డ్ మొత్తానికి కొత్త తల్లులకు పెద్దబాలశిక్ష అయింది. "ఇందులో ఒకరు తమ సమస్యను పోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు". -
చిన్నారులకు ‘కంగారు మదర్ కేర్’ వరం
నల్లగొండ టౌన్ : నవజాత శిశువులకు కంగారు మదర్ కేర్ వరం లాంటిదని కేర్ చీఫ్ కో ఆర్టినేటర్, ప్రొఫెసర్ శశివాణి అన్నారు. కంగారు మదర్ కేర్‌పై జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో గురువారం నిర్వహించిన మొదటి జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. నవజాత శిశువులు నెలల నిండకుండా పుట్టినప్పుడు వారికి కంగారు మదర్ కేర్ అవసరమన్నారు. ఈ విధానంలో భాగంగా ఎదపె పడుకోబెడతారని.. తల్లిగర్భంలో పొందే వెచ్చదనాన్ని శిశువులు అక్కడ పొందుతారని వివరించారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని వైద్య బృందం సందర్శించింది. కంగారు మదర్ కేర్ విధానంపై యూనిట్ నోడల్ అధికారి డాక్టర్ దామెర యాదయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శశివాణి మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలు దేశంలోనే అదర్శవంతంగా ఉన్నాయన్నారు. కంగారు మదర్‌కేర్ విధానాన్ని అమలు చేస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోందన్నారు. వైద్యులందరూ ఈ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు వైద్యులు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఈ నెల 26న రెండో రోజు సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో డాక్టర్ ప్రొఫెసర్ దీపాబ్యాంకర్, డాక్టర్ పరగ్‌దగ్లి, డాక్టర్ నతాళిచర్పక్, ప్రొఫెసర్ అర్సర్, ప్రొఫెసర్ సుష్మనంగియా, డాక్టర్ సిమ్రాని, డాక్టర్ జులేతా, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జి. శ్రీకాంత్‌రెడ్డి, కె. ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ జిలా ని, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసంతకుమారితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.