breaking news
mission indradhanush
-
‘మిషన్ ఇంద్రధనుష్’లో తెలంగాణ నంబర్ 1
ప్రధాని సమీక్షలో వెల్లడి గుర్తించిన వారిలో 94 శాతం చిన్నారులకు వేశారని ప్రశంస సాక్షి, హైదరాబాద్: రోగ నిరోధక టీకాలు సక్రమంగా అందని పిల్లలకు తిరిగి టీకాలన్నింటినీ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్ ఇంద్రధనుష్’ను అమలుచేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ల లోపు పిల్లలకు పాక్షికంగా టీకాలు వేసినవారిని, అసలే వేయని వారిని సర్వే ద్వారా గుర్తించారు. అలాంటి వారిలో 94 శాతం మందికి మళ్లీ టీకాలు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పథకాల సమీక్షలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ ‘ఇంద్రధనుష్’లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచినట్లు ప్రకటించారని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) తెలంగాణ రాష్ట్ర చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం మూడు అంశాల ఆధారంగా ఈ స్థానాన్ని ప్రకటించారన్నారు. పిల్లలను గుర్తించడంలో సూక్ష్మస్థాయి కార్యాచరణ ప్రణాళికను 97 శాతం అమలుచేయడం, నూటికి నూరు శాతం ప్రచారం నిర్వహించడం, గుర్తించిన వారిలో 94 శాతం మంది పిల్లలకు టీకాలు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘మిషన్ ఇంద్రధనుష్’ కార్యక్రమం అమలు అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 90.90 శాతం మంది పిల్లలు పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకున్నట్లు వెల్లడైందని వివరించారు. ఈ పథకంలో పిల్లలకు హెపటైటిస్-బి, పోలియో, బీసీజీ, పెంటావాలెంట్ (ఇందులో ఐదు రకాల టీకాలు వేస్తారు), తట్టు, ధనుర్వాతం, కోరింత దగ్గులకు ప్రత్యేకంగా టీకాలు వేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అమలులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అందులో పాల్గొన్న అధికారులను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. -
నిలిచిన మిషన్ ఇంద్రధనస్సు
వేములపల్లి: ఆశా వర్కర్ల సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో బుధవారం పీహెచ్‌సీలకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం చిన్నారులకు టీకాలు వేసేందుకు ఏర్పాటు చేసిన మిషన్ ఇంద్ర ధనస్సు(ఏడు టీకాల కార్యక్రమం) నిలిచిపోయింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ధర్నాకు దిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన చేస్తున్న కార్యకర్తలు మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు పాములపాడు గ్రామంలో ఉన్న పీహెచ్‌సీలకు తాళాలు వేశారు. దీంతో పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం నిలిచిపోయింది. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి దండేపల్లి: కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. మాతాశిశు మరణాలను అరికట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తానిమడుగులో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి సి. లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ఆస్పత్రుల స్థాయిని పెంచి.. సరిపడా సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.