breaking news
Minister Sadananda Gowda
-
సదానందగౌడ వ్యాఖ్యలు అర్థరహితం
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనిల్ మహబూబ్‌నగర్ క్రైం : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి కోర్టుల విభజనకు ప్రయత్నాలు చేయాల్సిన కేంద్ర మంత్రి సదానందగౌడ అందుకు విరుద్ధంగా మాట్లాడటం సరైంది కాదని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ విమర్శించారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోర్టుల విభజనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విభజించిన తర్వాతే న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు బెక్కెం జనార్ధన్, ఐఎంఈ సంఘం అధ్యక్షుడు రాంమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్, టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, రాజేశ్వర్‌గౌడు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రాము, సురేష్, వెంకట్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, గౌరవ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి శంకర్ సంఘీభావం ప్రకటించారు. -
సదానందది ద్వంద్వ నీతి
సీపీఐ నేత చాడ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనలో తమ పాత్ర లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుబట్టారు. గతేడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జరిపిన ప్రచారంలో త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని చెప్పిన విషయాన్ని సదానంద మరచిపోయారా అని ప్రశ్నిం చారు. పార్లమెంట్ సాక్షిగా హైకోర్టు విభజనపై 50 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పిన మాటలు ఏమాయ్యాయన్నారు. ఇది ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని ఒక ప్రకటనలో అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండో రోజు మరో 9 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని చాడ వ్యాఖ్యానించారు. -
కేజ్రీవాల్‌లా చేయకండి..
సీఎం కేసీఆర్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద ఫైర్ సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటిమాటికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ విమర్శించారు. ‘‘ఢిల్లీ వస్తా.. ధర్నా చేస్తా.. అంటే మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్.. కేజ్రీవాల్‌లా చేయకూడదు. కేజ్రీవాల్ ఏం చేయరు.. కానీ రోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పలువురు పార్టీ లీగల్ సెల్ నేతలు హైకోర్టు విభజన, న్యాయాధికారుల అంశాలను సదానంద దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం అనంతరం న్యాయమంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ బీజేపీ లీగల్ సెల్, సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ నా వద్దకు వచ్చారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. హైకోర్టు విభజనకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మౌలిక వసతుల కల్పించాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రిది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తుల విభజన చేయాల్సి ఉంటుంది. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యాయశాఖ అవసరమైన చర్యలు చేపడుతుంది. హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. పదేళ్ల సమయంలో రాజధాని ఏర్పాటయ్యేంతవరకు.. ముఖ్యంగా మౌలిక వసతుల ఏర్పాటు అయ్యేంతవరకు అక్కడే కొనసాగడం అనేది ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఆప్షన్. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇందులో కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదు. సబార్డినేట్ కోర్టులు కూడా మా పరిధిలో ఉండవు’’ అని ఆయన అన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, సీఎం సంప్రదింపులు జరిపి న్యాయమూర్తుల నియామకం చేపడతారని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు చూసుకోవచ్చు.. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు చెందిన వారు చాలా తక్కువగా ఉన్నారని, దీనిపై నిన్ననే సమాచారం వచ్చిందని సదానంద గౌడ చెప్పారు. ‘‘న్యాయమూర్తుల విభజన జరిగింది. ఏపీ హైకోర్టుకు 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఉన్నవారిలో ఏపీకి చెందిన వారు 18, తెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. అందులో నేనేమీ విభేదించడం లేదు. అయితే సబార్డినేట్ జ్యుడీషియరీలో న్యాయాధికారులు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రంలో ఉంటారు. దానిని చీఫ్ జస్టిస్ చూస్తారు. అది చట్ట ప్రకారం జరుగుతుంది. ఆశ్చర్యమేంటంటే తెలంగాణ సీఎం మాటిమాటికి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్రం ఏ చర్య తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వారికి కూడా న్యాయశాఖ ఉంది. వాళ్లు రాజ్యాంగ నిబంధనలు చూసుకోవచ్చు. పునర్ వ్యవస్థీకరణ చట్టం చదువుకోవచ్చు. అంతేగానీ సింపుల్‌గా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఈ దేశ ప్రజలు ఆశించడం లేదు’’ అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘‘నాలుగైదు సార్లు తెలంగాణ ఎంపీలు వచ్చి నన్ను కలిశారు. ఇద్దరు సీఎంలతో చర్చించాను. హైకోర్టు విభజన విషయంలో చొరవ చూపాను. ఇంతలో హైకోర్టులో పిల్ దాఖలైంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడది కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల హైకోర్టు విభజనపై నేను మాట్లాడటం తగదు. ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సబ్‌జ్యుడిస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రజలే జవాబిస్తారు... హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు, గవర్నర్‌కు లేఖ రాస్తాన ని సదానంద గౌడ తెలిపారు. ‘‘కానీ సింపుల్‌గా నేను ఢిల్లీ వస్తా.. ధర్నా చేస్తానంటే ఎలా..? స్వాగతిస్తాం. మాకేం అభ్యంతరం లేదు. ఆయన కేజ్రీవాల్‌లా చేయకూడదు. కేజ్రీవాల్ ఏం చేయరు కానీ రోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్‌లా వ్యవహరిస్తానంటే ప్రజలే జవాబిస్తారు’’ అని అన్నారు. బీజేపీ ప్రతినిధి బృందం చెప్పిన వ్యవహారాలన్నింటిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు, గవర్నర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం లేదు కదా అని మీడియా ప్రశ్నించగా... ‘‘ఎవరు ఒత్తిడి చేస్తారు? నేను చేయగలనా? రేపు వాళ్లేమంటారు? రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అంటారు. మీరు సమాఖ్య వ్యవస్థ అంటూ ఇలా ఎందుకు చేస్తున్నారని అడగరా?’’ అని ఎదురు ప్రశ్నించారు. వారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్న ప్రశ్నకు బదులుగా ‘‘నాకు తెలియదు. దానిపై నేనేమీ మాట్లాడను. అందులో మేమేమీ చేసేది లేదు. నేను హైదరాబాద్ వచ్చా. సీఎంలతో మాట్లాడా. హైకోర్టులో కేసు వచ్చాక ఇక నేను చేసేదేమీ లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘విషయం కోర్టులో పెండింగ్‌లో ఉండగా నేను ముఖ్యమంత్రికి లేఖ రాయలేను. సబ్‌జ్యుడిస్ అంటే ఏంటో మీకు తెలుసు. న్యాయశాఖ మంత్రిగా నా పరిధి నాకు తెలుసు. రేపు ఏదైనా జరిగితే మీరు తప్పుపడతారు. అది కోర్టు పరిధిలో ఉందని తెలంగాణకు కూడా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు: దత్తాత్రేయ కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడతోపాటు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తాము సమావేశమయ్యామని, హైకోర్టు విభజన అంశంపై సామరస్యంగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ బాలసుబ్రమణ్యం, లీగల్ సెల్ కన్వీనర్ విశ్వనాథ్, రామారావు, ఆంటోనీ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన వ్యవహారం ఇద్దరు సీఎంలు కలిసి కూర్చొని పరిష్కరించుకునే అంశమే గానీ.. ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తామనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ‘‘మీరు ఢిల్లీ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఏమాత్రం లేదు. మీ కార్యాలయంలో కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. -
వివేకానందుని మార్గం ఆదర్శనీయం
కేంద్ర మంత్రి సదానందగౌడ బెంగళూరు: వివేకానందుని ఆదర్శాలు నే టి తరానికి ఆదర్శనీయమని కేంద్ర న్యాయశా ఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో భాగంగా సోమవారమిక్కడి యశ్వంతపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివేకానందుని విగ్రహాన్ని సో మవారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఏ విధంగా ఆలోచించాలో, ఎలా ఉండాలో వివేకానందుడు మార్గనిర్దేశనం చేశారన్నారు. ఆ మార్గంలో యువత సాగితే విజయాలను సొం తం చేసుకోవచ్చునన్నారు. కేంద్ర ఎరువులు, ర సాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మా ట్లాడుతూ స్వామి వివేకానందుని మార్గాన్ని అ నుసరిస్తూ దేశాన్ని మరింత బలోపేతం చేసే ది శగా యువత ముందుకు సాగాలని సూచించా రు.మాజీ మంత్రి ఎస్.సురేష్‌కుమార్, ఎమ్మెల్యే అశ్వత్థనారాయణ పాల్గొన్నారు. -
ఉమ్మితే.. ఊడ్చాల్సిందే!
సాక్షి, ముంబై: నగరంలోని లోకల్ రైల్వేస్టేషన్లలో ఇకపై ఎవరైనా ఉమ్మితే.. వారే శుభ్రం చేయాల్సి ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి ఈ పద్ధతిని అమలుచేయాలని రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు. సాధారణంగా రైలు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు పాన్ మసాలా తదితర పదార్థాలను తింటూ స్టేషన్ ఆవరణలోనే ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తుంటారు. దీంతో రైల్వే సిబ్బందిపై పనిభారం పడుతోంది. దీంతో ఇకపై ఎవరైనా రైల్వే ఆవరణలో ఉమ్మినట్లు కనిపిస్తే వారితోనే దాన్ని శుభ్రం చేయించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అంతేకాక వారికి తగిన జరిమానా కూడా విధించనున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌ను అపరిశుభ్రం చేసే వారికి స్టేషన్ మాస్టర్ రూ.500 వరకు జరిమానా విధిస్తున్నారు. ఇకపై ఈ నిబంధనను మరింత కట్టుదిట్టంగా అమలుచేయనున్నట్లు వెస్టర్న్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ (ముంబై) శైలేంద్ర కుమార్ తెలిపారు. పరిశుభ్రత విషయంలో సిబ్బందికి పని భారం నానాటికీ పెరిగిపోతోం ది. వీరు ప్రస్తుతం రైల్వే ఆవరణలో పడివేసిన చెత్తను పోగు చేస్తున్నారు. అంతేకాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు ఉమ్మివేసిన పాన్‌మసాలా ఇతరత్రా వాటిని కూడా శుభ్రం చేయాల్సి వస్తోంది. రోజురోజుకు స్టేషన్లలో పెరుగుతున్న రద్దీ కారణంగా పారి శుద్ధ్య సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతోంది. కాగా, స్టేషన్లో ఉమ్మివేస్తే శుభ్రం చేయడం ఎంత కష్టమో ప్రయాణికులకు ప్రత్యక్షంగా తెలియజేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు శైలేంద్ర తెలిపారు. ముందుగా దీన్ని చిన్న స్టేషన్లలో ప్రయోగాత్మకంగా చేపడతామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియతో ప్రజలకు నిరసనలకు దిగే అవకాశముందని సెంట్రల్ రైల్వే డివిజినల్ మేనేజర్ (ముంబై) ముఖేష్ నిగమ్ అభిప్రాయపడ్డారు.