breaking news
Minister Ram Vilas
-
సుష్మాజీ.. ఫ్రిజ్ రిపేర్ చేయించరూ..!
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల్లో బిజీ. విదేశాల్లోని భారతీయులు ట్విటర్లో అభ్యర్థనలు చేసినా సత్వరమే పరిష్కారానికి ఆదేశాలిస్తారు. అందుకు మన్ననలూ అందుకుంటున్నారు. అయితే ఆమె పరిష్కరించలేని సమస్యను ట్విటర్ ద్వారా విన్నవించాడో వ్యక్తి. సామ్సంగ్ కంపెనీ తనకు లోపభూయిష్ట ఫ్రిజ్‌ను అంటగట్టిందని, దానిని మార్చి ఇవ్వడానికి కూడా కంపెనీ అంగీకరించడంలేదని పేర్కొంటూ తన సమస్యను పరిష్కరించాలని మంగళవారం కోరాడు. పనిలో పనిగా మరో మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు కూడా తన అభ్యర్థన పంపాడు. దీనికి సుష్మ సమాధానం ఇస్తూ.. ‘‘బ్రదర్.. రిఫ్రిజిరేటర్ విషయంలో నీకు సహాయం చేయలేను. అమితమైన బాధలు పడుతున్న వారి సమస్యల పరిష్కారంలో నేను బిజీగా ఉన్నాను’’ అంటూ స్పందించారు. -
‘నల్ల’ ఉల్లిపై ఉక్కుపాదం
అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ఉల్లిపై మంత్రి రాంవిలాస్ ఉన్నతస్థాయి సమీక్ష * జీఎస్టీ ఆమోదం పొంది ఉంటే ధరను నియంత్రించేవాళ్లమని వెల్లడి * ధరలు మరింత పెరిగే అవకాశం.. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: నల్ల బజారులో ఉల్లి అమ్మకాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉల్లిని కోయకుండానే జనం కన్నీరు పెడుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సోమవారం ఢిల్లీలో అత్యవసరంగా వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయ విభాగంఅధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఉల్లి నిల్వలు, ధర, ఎగుమతులు, దిగుమతులపై సమీక్షించారు. ఉల్లిధరను నియంత్రించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిఘా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్నవారిపై నిత్యావసర వస్తువుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పాశ్వాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రధానంగా ఆసియాలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వ్యాపారులను కఠినంగా నియంత్రించాలని మహారాష్ట్ర సర్కారును కేంద్రం ఆదేశించింది. ఒకవేళ వస్తుసేవల పన్ను చట్టం(జీఎస్టీ) బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది ఉంటే.. ఉల్లి ధరల నియంత్రణ తేలికయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరను అదుపు చేయటంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పాశ్వాన్ ఆరోపించారు. కావలసినంత నిల్వలు ఉన్నప్పటికీ ఆప్ సర్కారు బ్లాక్ మార్కెట్ వ్యాపారులను అదుపుచేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేశంలో ఉల్లి దిగుబడి కేవలం 5లక్షల టన్నులు మాత్రమే తగ్గిందని, అయితే ఈ పరిస్థితిని అదనుగా చూసుకుని వ్యాపారులు కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికంగా వచ్చే న్యుమోనియా జ్వరం వంటిదేనన్నారు. 10 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవలసిందిగా ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీని ఆదేశించామని మంత్రి వివరించారు. ధరలు పైపైకి..: దేశంలో ఉల్లి సృష్టిస్తున్న ప్రళయం ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. పది రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ప్రజల్ని కంటతడిపెట్టిస్తున్న ఉల్లి రోజు రోజుకూ మరింత అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. హోల్‌సేల్ వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. దాని వల్ల మార్కెట్‌కు సరఫరా లేక.. అవసరాలు తీర్చలేని దిగుమతులు ఉల్లి ధరను కొండెక్కేలా చేశాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.80కి చేరుకున్న కిలో ఉల్లి ధర.. మరో పది శాతం పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లోనే ఉల్లి ధర కిలో రూ. 60కి చేరింది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నా అవసరాలకు సరిపోవటం లేదని ముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకార సంస్థ డెరైక్టర్ అశోక్ వలుంజ్ తెలిపారు. అఫ్ఘాన్ నుంచి రోజుకు ఆరు నుంచి 7 ట్రక్కుల్లో ఉల్లి దిగుమతి అవుతోంది. 30 టన్నుల సామర్థ్యం ఉన్న 100 నుంచి 200 ట్రక్కుల్లో దిగుమతి చేసుకోనున్న ఉల్లిని దేశమంతటా పంపిణీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోనున్నట్లు వివరించారు. అయితే, ఒక్క ముంబై మహానగరానికే వంద లారీల ఉల్లి అవసరమైన నేపథ్యంలో, ప్రస్తుతం చేసుకుంటున్న దిగుమతులు అవసరాలను తీరుస్తాయని భావించలేమని పేర్కొన్నారు. 2వేల కిలోల చోరీ దేశంలో దొంగలకు ఇప్పుడు డబ్బులక్కర లేకుండా పోయాయి.. బంగారం దొంగతనం మీదా మోజు పోయింది. ఇప్పుడు హాట్‌కేక్‌లా సొమ్ములు కురిపించే అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందా అంటే.. అది ఉల్లిపాయే.. రోజుకోచోట దొంగలు ఉల్లిపాయల్ని దర్జాగా దోచుకుపోతున్నారు. ఆదివారం ముంబై సబర్బన్‌లోని ఓ దుకాణం నుంచి 700 కిలోల ఉల్లిని కొందరు దొంగలు దోచుకుని పోతే.. సోమవారం దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన నాసిక్‌లో ఏకంగా రెండు వేల కిలోల ఉల్లిపాయల్ని దొంగలు రాత్రికి రాత్రి దొంగతనం చేశారు. నాసిక్‌లోని నందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబాసాహెబ్ పవార్ అనే రైతు తన గోదాములో దాచుకున్న 2వేల కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.