breaking news
The meeting
-
‘ఎజెండా’పై గందరగోళం
వాకౌట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు 327 అంశాలపై చర్చించిన కౌన్సిల్ పలు పనులకు అనుమతి మంజూరు కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మళ్లీ రసాభాసగా మారింది. ఎజెండా అంశాలపై అధికార, విపక్షాల మధ్య గందరగోళం చెలరేగింది. సమావేశం ఏకపక్షంగా సాగుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్పర్సన్ పిప్పిరి సుష్మ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తొలిసారి హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కౌన్సిల్ సమావేశంలో 327 అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ వాకౌట్.. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిలర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలను ఇప్పుడు సభ ముందు ఎలా ఉంచుతారని నిలదీశారు. గత ఎజెండా అంశాలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయని, హైకోర్టుకు సమాధానం పంపాల్సిన అధికారులు.. అదేమీ పట్టించుకోకుండా పాత ఎజెండాను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం టీఆర్ఎస్ సమావేశంలా మారిందంటూ నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిమ్మ దామోదర్‌రెడ్డి, జమీల్, రామ్మోహన్, బట్టు మోహన్, లక్ష్మణ్‌రావు, శశిరేఖ, పద్మ, సునీత వాకౌట్ చేశారు. పనుల నిర్వహణకు అనుమతులు.. అనంతరం సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే ప్రగతి పనులకు కౌన్సిల్ సమావేశం అనుమతించింది. సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, పైప్‌లైన్ నిర్మాణాలు, సీసీ డ్రైనేజీలు, మురుగుకాలువ నిర్మాణాలు,అవుట్ సోర్సింగ్ సిబ్బంది టెండర్, సెంట్రల్ లైటింగ్ పనులకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. నీటి సమస్య నివారణకు టాస్క్‌పోర్సు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటర్‌వర్క్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్, టౌన్‌ప్లానింగ్ విభాగాలను ప్రక్షాళన చేయాలని కౌన్సిలర్ భూంరెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను కోరారు. స్పందించిన ఆయన మిగులు సిబ్బందిని అవసరమున్న చోటుకు పంపించాలని కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది పైరవీలు చేస్తున్నారని కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్, రవియాదవ్ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించగా.. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేస్తానని కమిషనర్ తెలిపారు. స్టేషన్ రోడ్డులోని మడిగెలకు, మటన్ మార్కెట్ మడిగెలకు అద్దె నిర్ణయించాలని, తద్వారా మున్సిపల్ ఆదాయం పెరుగుతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వైస్ చైర్మన్ మసూద్‌అలీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. చేపల మార్కెట్‌గా బల్దియా: ప్రభుత్వ విప్ మున్సిపల్ కార్యాలయం చేపల మార్కెట్‌గా మారిందని విప్ గంగ గోవర్ధన్ వ్యాఖ్యానించారు. దీన్ని మార్చాలని ఆయన అధికారులకు సూచించారు. కామారెడ్డి నూతన జిల్లా కానున్న తరుణంలో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. కౌన్సిల్ సమావేశంలో పట్టణాభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై జోక్యం చేసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ ఎజెండాపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం కామారెడ్డి: మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండాలో చేర్చిన 1, 2, 3, 4 అంశాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మకు డీసెంట్ నోట్ అందజేశారు. ఈ బాక్స్ టెండర్లకు సంబంధించి ఎటువంటి నోటీసులను ప్రదర్శించ లేదని, నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రహస్య టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎజెండా అంశంలోని 179వ అంశంపై బీజేపీ కౌన్సిలర్ భారతమ్మ డీసెంట్ నోట్ అందించారు. మున్సిపల్ జనరల్ ఫండ్‌ను మసీదులు, మందిరాల వద్ద వాడవచ్చా లేదా అని ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ కమిటీల సమావేశం నేడు
-
వైఎస్సార్సీపీ కమిటీల సమావేశం నేడు
పార్టీ పటిష్టత దిశగా చర్యలు ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల పునర్వ్యస్థీకరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళవారం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహించే ఈ సమావేశం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 2014 ఎన్నికల తరువాత జరుగనున్న తొలి విసృ్తత స్థాయి సమావేశం అయినందున దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీల్లో చాలా మందికి అవకాశం కల్పించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం, మండలాలు, జిల్లాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అదే విధంగా సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికపుడు స్పందించేందుకు వీలుగా పార్టీ అధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. కొత్తగా నియమితులైన వారికి పార్టీ పరంగా నిర్మాణపరమైన బాధ్యతలు అప్పగించే అంశం కూడా చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన గట్టిగా ప్రభుత్వంపై పోరాడింది. అయితే ప్రభుత్వం ఈ అంశాలు వేటిపైనా స్పష్టతనివ్వకుండా ప్రజలను గందరగోళంలో పడేసింది. ఈ నేపథ్యంలో ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలు, వాటిపై మాట తప్పిన విషయాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాలని కూడా జగన్ ఈ సమావేశంలో కోరే అవకాశం ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల ప్రతినిధులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నియామకం హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన అనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం 11మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాష్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్, బి.జనక్‌ప్రసాద్ ఉన్నారు. ఈ కమిటీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి వరకు వైఎస్సార్సీపీని పటిష్టం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్సీపీ కమిటీల్లో మరికొందరి నియామకం వైఎస్సార్ సీపీ ఇటీవలి కాలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో మరి కొందరిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(ప్రకాశం, నెల్లూరు), కార్యదర్శులుగా వంశీ కృష్ణ శ్రీనివాస్, కె.మోషేన్ రాజు, సీజీసీ సభ్యులుగా కుడిపూడి చిట్టబ్బాయి, పాలపర్తి డేవిడ్‌రాజు, అధికార ప్రతినిధిగా పాలపర్తి డేవిడ్‌రాజు నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.