breaking news
marrage dead
-
పెళ్లి సెలవే శాశ్వత సెలవైంది..!
ఆదిలాబాద్: మరో వారం రోజుల్లో ఆ యువకుడి పెళ్లి. తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచి.. ఉద్యోగానికి సెలవు పెట్టి మోటార్‌సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. హార్వేస్టర్ రూపంలో మృత్యువు వెంటాడింది. వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతిచెందాడు. దండేపల్లి ఎస్సై కుందారపు ప్రసాద్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడెంకు చెందిన ఒగేటి సాయి(24) నిర్మల్ మండలం కొండాపూర్‌లో విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. అతడికి ఈ నెల 12 పెళ్లి జరగాల్సి ఉంది. గురువారం ఉదయం కొత్తకొమ్ముగూడెం నుంచి నిర్మల్‌కు వెళ్లాడు. పెళ్లి కోసం ఉద్యోగానికి సెలవు పెట్టాడు. అక్కడి మిత్రులు, తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచి తన స్నేహితుడు మహేష్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై రాత్రి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో దండేపల్లి మండలం మేదరిపేట సినిమా థియేటర్ సమీపంలో లక్సెట్టిపేట వైపు వెళ్తున్న హార్వెస్టర్ వీరి మోటార్‌సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. సాయి తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పెళ్లింట విషాదం.. ఒగేటి సత్తయ్య–లక్ష్మీ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి చేశాడు. ఒక్కగానొక్క కొడుకు సాయి.. పైగా విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి ఎంతో ఘనంగా చేయాలనుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి ఉండడంతో ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమాదంలో సాయి దుర్మరణం చెందడంతో ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుకలతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు.. కొడుకు మరణవార్తతో రోదనలు మిన్నంటాయి. చేతికి అందివచ్చిన కొడుకు, ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఎంతో అండగా ఉంటాడని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు విధి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్లి సెలవే శాశ్వత సెలవైంది..! విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా పనిచేస్తున్న సాయికి పెళ్లి కుదరడంతో అక్కడ తనతో పనిచేసే తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచాడు. పెళ్లి కోసం సెలవు తీసుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతడు తీసుకున్న పెళ్లి సెలవులు శాశ్వత సెలవులయ్యాయి. సాయిని పెళ్లి కొడుకుగా చూడాలనుకున్న తన తోటి ఉద్యోగులు, మిత్రులకు అతడు విగత జీవిగా కనిపించడంతో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన కుటుంబీకులు, బంధువులు, మిత్రులను కలిచివేసింది. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బంధువుల రాస్తారోకో అన్నానగర్: అనుమానాస్పద స్థితిలో ఓ డాక్టర్ భార్య మృతి చెందింది. బంధువులు రాస్తారోకో చేశారు. ఈ ఘటన మన్నార్‌కుడిలో చోటుచేసుకుంది. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి తాలూకా రోడ్డుకు చెందిన ముత్తళగన్ కుమారుడు ఇళంజేరన్. ఇతను తిరుచ్చిలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్. ఇళంజేరన్కి, మన్నార్‌కుడి సమీపం సేరన్‌కుళం గ్రామానికి చెందిన రిటైర్డ్ గ్రామ నిర్వాహక అధికారి కార్తికేయన్ కుమార్తె దివ్య (25)కు గత నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల మగపిల్లాడు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి దివ్య ఇంట్లో స్పృహ తప్పి పడి ఉంది. ఇది చూసిన దివ్య భర్త ఇళంజేరన్, బంధువులు ఆమెను మన్నార్‌కుడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు దివ్య అప్పటికే మృతి చెందిందని తెలియజేశారు. దివ్య తలపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో దివ్య మృతి చెందిన సమాచారాన్ని అందుకున్న ఈమె బంధువులు ఆస్పత్రికి వచ్చారు. దివ్య మృతిపై ఆమె అన్న ప్రేమ్‌కుమార్, మన్నార్‌కుడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో దివ్యని ఆమె భర్త కుటుంబసభ్యులు వరకట్నం కోసం వేధించి హత్య చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జేశారు. మంగళవారం దివ్య బంధువులు, సేరన్‌కుళం గ్రామస్తులు సుమారు 300ల మందికి పైగా మన్నార్‌కుడి రోడ్డు ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న మన్నార్‌కుడి జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ అశోకన్ సంఘటన స్థలానికి వచ్చి రాస్తారోకో చేస్తున్న వారితో చర్చలు జరిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో మన్నార్‌కుడి – తిరుత్తులై పూండి రోడ్డులో ఆరుగంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది.