breaking news
Lentils price
-
కందులు.. ఆల్‌టైమ్ రికార్డు ధర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కందులు పంటకు గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కందులు క్వింటాలుకు రూ.7,200 వరకు ధర లభిస్తోంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు కావడం విశేషం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కందులుకు ఇంతటి ధర లభించలేదు. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన కందులు పంట చెప్పుకోదగినంతగా దిగుబడులు రాకపోవడంతో దిగాలు పడిన రైతులకు మంచి ధర పలుకుతుండడం సంతోషాన్నిస్తోంది. కందులుకు క్వింటాలుకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.ఆరు వేలు కాగా గత నెల వరకు మార్కెట్లో రూ.5,000 నుంచి రూ.5,600 మధ్య ధర కొనసాగింది. ఇప్పుడీ ధర అమాంతం రూ.ఏడు వేలు దాటింది. రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. 5,44,220 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 5,44,220 ఎకరాల్లో కందుల పంటను రైతులు సాగు చేశారు. సాధారణంగా దీన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అంతర పంటగా సాగు చేస్తే ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఒకే పంటగా సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో దిగుబడులు కాస్త తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఎకరానికి 4–5 క్వింటాళ్లు దిగుబడి రాగా, మరికొన్ని జిల్లాల్లో 3–4 క్వింటాళ్లకు మించి రాలేదు. అదే సమయంలో నాణ్యత కూడా తగ్గింది. గత డిసెంబర్ నుంచి పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ మార్చి రెండో వారం వరకు ఇవి కొనసాగుతాయి. గత డిసెంబర్ 2వ వారం నుంచే మార్కెట్‌కు కందులు వస్తున్నాయి. వచ్చే మే నెల రెండోవారం వరకు కూడా వచ్చే అవకాశముంది. పోటీ పడి కొంటున్నారు.. కందులు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.6 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరు వరకు కందులుకు మార్కెట్లో పెద్దగా రేటు లేదు. క్వింటాల్ రూ.5,000–5,600 మధ్య ఉండింది. గడిచిన నెల రోజులుగా ఊహించని రీతిలో ధర పెరగడం మొదలైంది. నాణ్యతను బట్టి రూ.6,800 నుంచి రూ.7,200కుపైగా పలుకుతోంది. రాష్ట్రంలో కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు మార్కెట్లకు పెద్ద ఎత్తున కందులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఇస్తామంటూ వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ప్రభుత్వ చర్యల వల్లే.. నిజానికి మూడేళ్లుగా కందులుకు మార్కెట్లో సరైన ధర పలకలేదు. అయితే కనీస మద్దతు ధరలు లభించని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఆ మేరకు గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా కందులును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయించింది. గతేడాది మార్కెట్లో కందులుకు రూ.4,500కు మించి ధర పలకలేదు. దాంతో ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,800 చొప్పున కనీస మద్దతు ధరను నిర్ణయించడమేగాక.. 394 కోట్ల రూపాయలు వెచ్చించి 61,772 మెట్రిక్ టన్నుల కందులును మార్క్‌ఫెడ్ ద్వారా గతేడాది కొనుగోలు చేసింది. అంతేగాక ఈ సీజన్లో కందులుకు కనీస మద్దతు ధరను రూ.6 వేలుగా నిర్ణయించి.. అంతకన్నా తక్కువకు విక్రయించవద్దని, ఒకవేళ మార్కెట్లో ధర పెరగకుంటే ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుందని రైతులకు అభయమిచ్చింది. ఇది రైతుల్లో భరోసాను నింపగా.. వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటుండడంతో కందులుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ధర ఇలా పెరగడం ఇదే తొలిసారి.. నా పొలంలో పూర్తి కంది పంట సాగు చేశా. మొన్నటిదాకా క్వింటాలు ధర రూ.5,600కు మించి పలకలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.6000గా ప్రకటించింది.. కంగారు పడొద్దు.. మార్కెట్లో రేటు పెరుగుతుంది.. ఒకవేళ పెరగకపోతే కనీస మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు ఓపిక పట్టాం. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.7,200 ధర పలుకుతోంది. దిగుబడి తగ్గినా.. ధర పెరగడంతో ఊరట లభించింది. ఈ ధర ఇలాగే ఉంటే రైతుకు గిట్టుబాటవుతుంది. –సి.వలీసాహెబ్, చింతకుంటపల్లి, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే రైతుకు మంచి ధర... ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మార్కెట్లో కందులు, పెసలు ధరలు పెరుగుతున్నాయి. కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగానే వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ కారణంగానే కందులు క్వింటాలు ధర రూ.7,200కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. –పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
మినుముల ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మినుముల ధర దారుణంగా పడిపోయింది. మద్దతుధర కన్నా ఏకంగా రెండు మూడు వేలు తక్కువగా పలుకుతోంది. మార్కెట్లో వ్యాపారులు మినుములు క్వింటాలుకు రూ.2,500 నుంచి రూ.4,615 వరకు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 75 వేల ఎకరాల్లో మినుము పంట వేశారు. సాధారణ విస్తీర్ణంలో 95 శాతం వరకు సాగు జరిగింది. మొత్తంగా 19 వేల టన్నుల మినుములు దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ప్రకారం ఇప్పటికే మినుములు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ దళారులు, వ్యాపారుల మాయాజాలంలో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. కేంద్రం మినుములకు రూ.5,400 మద్దతు ధర ప్రకటించగా.. అంతకన్నా రెండు మూడు వేలు తక్కువగా చెల్లిస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రంగంలోకి హరీశ్‌రావు మినుములకు సరైన ధర దక్కని విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంగళవారం మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బుధవారమే 14 ప్రాంతాలలో మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజామాబాద్ జిల్లాలో బోధన్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ , వట్పల్లి, నిర్మల్ జిల్లాలో కుభీర్, భైంసా, జైనూర్, ముధోల్, వికారాబాద్ జిల్లా తాండూర్, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు, డీసీఎంఎస్‌లలో.. నాఫెడ్ తరఫున మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మినుములకు మద్దతు ధరను సాధారణంగా అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తుందని.. తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించి షెడ్యూల్ తేదీలకు మినహాయింపు ఇచ్చిందని హరీశ్‌రావు ఈ సందర్భంగా తెలి పారు. క్వింటాలు మినుములకు రూ.5,400 మద్దతు ధర ఉన్నందున... రైతులెవరూ తొందరపడి అంతకన్నా తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మినుములను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఇక పెసర్ల కొనుగోలు విషయంలో నాఫెడ్ విధించిన నాణ్యతా ప్రమాణాలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. పత్తిని పర్యవేక్షించండి పత్తి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ముగిసే వరకు జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని హరీశ్‌రావు సూచించారు. ఖరీఫ్‌లో ఏయే ప్రాంతాల్లో ఎంత పత్తి పండించారో సమగ్ర వివరాలను అక్టోబర్ 5వ తేదీకల్లా పంపించాలని కలెక్టర్లను కోరారు. పత్తి రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా మార్కెట్లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మద్దతు ధర తగ్గిన వెంటనే పత్తి కొనుగోలుకు సీసీఐ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డులను జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇక గతంలో ఏర్పాటు చేసిన 84 మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాలకు అదనంగా జిన్నింగు మిల్లులున్న ప్రాంతాలలో 27 కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ అంగీకరించినట్టు హరీశ్‌రావు తెలిపారు. పత్తి విక్రయించాక 48 నుం చి 72 గంటల్లోపు రైతుల ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
తాండూరులో రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా: తాండూరు మార్కెట్ యార్డులో గురువారం రైతులు ఆందోళనకు దిగడంతో కందుల విక్రయాలు నిలిచిపోయాయి. క్వింటాలుకు రూ.12 వేలు చెల్లించాలంటూ రైతులు అధికారులు, వ్యాపారులు చర్చలు జరిపారు. బుధవారం క్వింటాలుకు మోడల్ ధర 11,600 కాగా గురువారం రూ.11,300 మాత్రమే ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుల ధర పెరగటానికి బదులు తగ్గడంపై రైతులు వ్యాపారులతో గొడవకు దిగారు. రూ.12వేలు చెల్లించాల్సిందేనంటూ రైతులు విక్రయాలను నిలిపివేసి నిరసన తెలిపారు.