పనులకు పగ్గాలు.. ‘మెట్రోకు’ లేవు మార్గాలు
జటిలమవుతున్న భూసేకరణ
►ఇంకా 1700 ఆస్తుల సేకరణకు కసరత్తు
►కొలిక్కిరాని సమస్యలతో అధికారుల అవస్థలు
►{sాఫిక్ బెడదతో పనులకు అనుమతించని పోలీసులు
► అలైన్మెంట్ మార్పుపై నిపుణుల అధ్యయనం
సిటీబ్యూరో: ‘భూసేకరణ పునరావాస చట్టం-2012 ఆధారంగా హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆస్తుల సేకరణ ప్రక్రియ జటిలమవుతోంది. దీంతో పలు మార్గాల్లో పనులు చేపట్టేందుకు, ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ‘రైట్‌ఆఫ్‌వే’ కు అవసరమైన 20 అడుగుల స్థలం కూడా దొరకడంలేదు. దీంతో అందుబాటులో ఉన్న 15 అడుగులపై నుంచే పనులను చేయాల్సి వస్తోంది. మరోవైపు బాధితుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒక్కో సమస్యను అధిగమిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసి పక్షంరోజులకోసారి మెట్రో పనులను సమీక్షిస్తున్నాం. అలైన్మెంట్ మార్పులపై త్వరలో స్పష్టత రానుంది.’ అని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. మెట్రోపనుల పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి టాస్క్ఫోర్సుకు అధ్యక్షుడు కూడా అయిన ఆయన గురువారం ఒక హోటల్లో జరిగిన నగర మెట్రోరైలు మస్కట్ ‘నిజ్’ ఆవిష్కరణ సందర్భంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో పనులకు ఎదురవుతున్న అవాంతరాలు తేటతెల్లమౌతున్నాయి. ఫలితంగా మెట్రో పనులు మరో రెండేళ్లపాటు ఆలస్యం కావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
క్లిష్టంగా మారిన 1700 ఆస్తుల సేకరణ
మలక్‌పేట్-మొజంజాహీమార్కెట్,నాంపల్లి-గాంధీభవన్,చిక్కడపల్లి,అమీర్‌పేట్,సారథిస్టూడియో,గ్రీన్‌ల్యాండ్స్,సోమాజీగూడా-ఖైరతాబాద్,లక్డీకాపూల్-ప్రధాన రహదారి ప్రాంతాల్లో మెట్రో పనులు జరిగేందుకు 1700 ఆస్తులను ఇంకా సేకరించాల్సి ఉంది. భూసేకరణ,పునరావాస బిల్లు-2012 ప్రకారం బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించనిదే ఆస్తుల తొలగింపు జీహెచ్ఎంసీకి కత్తిమీద సామనే చెప్పాలి. పరిహారం సైతం నాలుగురెట్ల మేర పెరగనుంది. దీంతో ప్రధాన రహదారి మధ్యలో మెట్రో పిల్లర్లు,వాటిపై సెగ్మెంట్లు,స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన 8 మీటర్ల స్థలానికి బార్కేడింగ్(పనులు జరిగేందుకు వీలుగా ఇనుపరేకులతో కంచె) వేయడం కష్టసాధ్యమౌతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు మెట్రో పనులకు అనుమతులివ్వడంలేదు. ప్రత్యామ్నాయ దారులు అందుబాటులో ఉన్న చోట్ల ట్రాఫిక్‌ను వాటిగుండా మళ్లించి తమకు పనులు చేసుకునే వీలు కల్పించాలని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఇటీవల సీఎం కేసీఆర్,రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మకు మొరపెట్టుకుంది. దీంతో ఆయన ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పనులకు అవాంతరాలు తొలగించని పక్షంలో ప్రాజెక్టు పూర్తికి మరో రెండేళ్ల ఆలస్యం తప్పదని ఎల్అండ్టీ వర్గాలు తెలంగాణ సర్కారుకు స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తుది గడువేమీ లేదు:ఎన్వీఎస్రెడ్డి
మెట్రో అలైన్మెంట్మార్పు,ఆస్తుల సేకరణకు తుది గడువేమీ లేదు. ఒక్కో సమస్యను అధిగమించి అందరి సహకారంతో మెట్రో పనులు సాఫీగా జరిగేందుకు యత్నిస్తున్నాం. అసెంబ్లీ,గన్‌పార్క్ వద్ద అలైన్మెంట్లో స్వల్ప మార్పులే ఉంటాయి. ఇందుకు నిపుణుల బృందం కసరత్తు చే స్తోంది. ప్రత్యేకంగా కమిటీ వేయలేదు. ఆతరవాత ప్రభుత్వానికి నివేదించి తుది అలైన్మెంట్ ఖరారు చేసి ఎల్అండ్టీ సంస్థకు తెలియజేస్తాం. మెట్రో పనుల ఆలస్యం వల్ల రోజుకు రూ. 5 కోట్ల మేర అంచనా వ్యయం పెరుగుతుందనడం అభూత కల్పనే. ఇక చారిత్రక ప్రదేశాలతోపాటు అమీర్‌పేట్ ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ మార్పుపై పలు వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.