breaking news
katthi remake
-
మెగాస్టార్ జుంబా డ్యాన్స్
రాజకీయ రంగప్రవేశంతో సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి, చాలా కాలంగా తన రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలో తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్‌తో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆయన తెర మీద అందంగా కనిపించడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గినా మరింత ఆకర్షణీయమైన లుక్ కోసం కొత్త తరహా డ్యాన్స్ ఫార్మ్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. బెస్ట్ ఫిట్నెస్ డ్యాన్స్‌గా పేరున్న జుంబా డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. లాటిన్ అమెరికాకు చెందిన ఈ డ్యాన్స్‌ను గంట పాటు చేస్తే శరీరంలో వంద క్యాలరీలకు పైగా కరిగించుకునే అవకాశం ఉందట. అందుకే చిరంజీవి తన 150వ సినిమా కోసం ఈ డ్యాన్స్ ఫార్మ్‌ను ఎంచుకున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో చిరు ఎలా కనిపిస్తాడో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి సినిమాను చిరు వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిండానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
'కత్తి' ఎవరి చేతికి వెళుతుందో..?
టాలీవుడ్లో మరే రీమేక్ సినిమా గురించి జరగనంత చర్చ 'కత్తి' సినిమా విషయంలో జరుగుతోంది. కోలీవుడ్‌లో విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంలోమాత్రం క్లారిటీ రావటం లేదు. కార్పొరేట్ సంస్థల మూలంగా నష్టపోయిన గ్రామ ప్రజలుకు హీరో ఎలా అండగా నిలబడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి భారీ ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్, ఈ రీమేక్‌లో నటించే అవకాశం ఉందంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఎన్టీఆర్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా త్వరలోనే ప్రారంభం అంటూ కూడా వార్తలు వినిపించాయి. చిరు 150వ సినిమాగా 'కత్తి'ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని, ఇప్పటికే రైట్స్ కూడా సొంతం చేసుకున్న చరణ్ కథలో తెలుగు నేటివిటికి తగ్గ మార్పులు చేయిస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాలను చిరు వర్గం ఖండించకపోవటంతో చిరు రీ ఎంట్రీ కత్తితోనే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉందట మెగా క్యాంప్. మరి వరుణ్‌తో అయినా కత్తి రీమేక్ ఉంటుందా..? విజయ్ లాంటి టాప్ స్టార్ చేసిన క్యారెక్టర్‌కు వరుణ్ ఎంత వరకు న్యాయం చేయగలుగుతాడో చూడాలి.