breaking news
Jolepalem Mangamma
-
మంగమ్మ మృతికి వెంకయ్య నాయుడు సంతాపం
హైదరాబాద్ : రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, రచయిత జోలెపాళెం మంగమ్మ (92) మృతి పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. చిత్తూరు జిల్లాకు మదనపల్లెకు చెందిన మంగమ్మ దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్‌రీడర్‌గా పదేళ్లపాటు పని చేశారు. ఆమె పలు భాషల్లో గ్రంథాలు రాయడంతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మంగమ్మ అంత్యక్రియలు ఇవాళ మదనపల్లెలో నిర్వహించనున్నారు. రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, ప్రముఖ రచయిత జోలెపాళెం మంగమ్మ గారి మరణం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/90g1fULT6E — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 2 February 2017 -
మహిళా న్యూస్‌రీడర్ మంగమ్మ కన్నుమూత
మదనపల్లె: ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, రచయిత, విద్యావేత్త డాక్టర్ జోలెపాళెం మంగమ్మ (92) బుధవారం అనారోగ్యంతో చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రెడ్డీస్‌కాలనీలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. స్థానిక అమ్మినేని వీధికి చెందిన సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు మంగమ్మ జన్మించారు. స్థానిక బి.టి.కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. ఢిల్లీలో ఉన్నత చదువులు అభ్యసించారు. అనంతరం ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా చేరారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్‌రీడర్‌గా పదేళ్లపాటు పని చేశారు. అనంతరం బి.టి.కళాశాల పాలకవర్గ సభ్యురాలిగా, రుషీవ్యాలీ పాఠశాలలో పరీక్షల విభాగంలో పని చేశారు. మంగమ్మ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక గ్రంథాలు రాశారు. దీంతోపాటు ఆమెకు ఫ్రెంచ్, తమిళం, హిందీ, కన్నడం భాషల్లోనూ ప్రవేశం ఉంది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి 2002లో ఉగాది పురస్కారం, 2002లో కుప్పం రెడ్డెమ్మ సాహితీపురస్కారం, సిద్ధార్థ కళాపీఠం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. మంగమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.