breaking news
jillela
-
అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా..
సాక్షి, సిరిసిల్ల : తన బుడిబుడి నడకలతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ.. తన చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆనందపజేసే బంగారు కొండ.. ముక్కుపచ్చలారని చిట్టి తండ్రి విగతజీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడేళ్ల బుడతడు రుత్విక్ మరణ వార్త విన్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా అని ఆ తల్లి విలపించిన తీరు కలచివేసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కొమిటి దేవయ్య– రేణుక దంపతులకు రుత్విక్ (3) ఒక్కగానొక్క సంతానం. ప్రేమానురాగాలతో సాగిపోతున్న వారి కుటుంబంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. దేవయ్య– రేణుక ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా రుత్విక్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతడిని ఎవరూ గమనించలేదు. కొంత సేపటికి తల్లిదండ్రులు రుత్విక్ కోసం వెతుకుతుండగా నీటి సంపులో పడిఉండడం చూసి అతన్ని హుటాహుటిన సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుత్విక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఒక్కగానోక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు
కడప : వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం జిల్లేలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్లు మరోసారి వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారం వచ్చేసిందన్న అహంతో రెచ్చిపోతున్నారు. పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ఆస్తులను నష్టపరుస్తున్నారు. కాగా ఘర్షణల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.