breaking news
jayalalithaa daughter
-
జయ కూతురినంటూ పిటిషన్..కోర్టు ఆగ్రహం!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలినంటూ మరో మహిళ ముందుకొచ్చారు. జయలలిత కూతురిని తానేనని, కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించవచ్చునని బెంగళూరు చెందిన అమృత అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలిత కూతురిని తానేనని ఈ నెల 22న అమృత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకురావడంతో ఈ పిటిషన ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత కూతురైన తనను ఆమె సోదరి, భర్త పెంచి పెద్ద చేశారని, డిసెంబర్ 5న జయలలిత మృతిచెందిన తర్వాత తన జన్మరహస్యాన్ని వారు తనకు వెల్లడించారని అమృత తన పిటిషన్లో పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో జయ వారసులమంటూ గతంలో కూడా కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. -
జయలలిత కూతురు ఈమేనంటూ...
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఒక మహిళ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ ఆమె ఫొటోను గ్రూపులలో తెగ షేర్ చేశారు. కానీ అసలు ఆమెకు, జయలలితకు ఏమాత్రం సంబంధం లేదని తేలిపోయింది. ఆమె ఎవరన్న విషయం ఇన్నాళ్ల పాటు తెలియకపోయినా.. ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి పుణ్యమాని అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఇదే ఫొటో 2014 నుంచే ఇలా తిరుగుతోంది. అప్పట్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తొలిసారి ఈ ఫొటో బయటకు వచ్చింది. కాస్త సెన్సిబుల్‌గా ఆలోచించేవాళ్లకు ఇలాంటి ఫొటోలు చూస్తే ఎక్కడలేని చికాకు వస్తుంది. కానీ కొంతమంది మాత్రం వీటిని నిజంగానే నమ్మేస్తారు కూడా. ఇంతకీ ఈ ఫొటో వెనక కథ ఏంటి.. ఆమె ఎవరన్న విషయం తెలుసుకోవాలని ఉందా? అదే విషయాన్ని చిన్మయి తన ఫేస్బుక్ పోస్టులో షేర్ చేసింది. ఆమెపేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్. జయలలిత కూతురు కానే కాదు. ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు, ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్లు తన కుటుంబానికి చాలా బాగా తెలిసిన వాళ్లని, మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని చిన్మయి తెలిపింది. ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలాజీ కుటుంబానికి చెందినవారని వివరించింది. ఆయన కచేరీలు అంతగా బిజీగా లేనప్పుడు ప్రముఖ వెబ్ సిరీస్ 'హజ్బ్యాన్డ్'లో నటిస్తారని కూడా తెలిపింది.