breaking news
Jaya Dheer tirumal Rao
-
ఎందుకీ మహాసభలు?
కామారెడ్డి అర్బన్: పాలకులకు మూడేళ్లుగా పట్టని తెలుగు భాష ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు ప్రశ్నించారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహిస్తూ రూ.50 కోట్లు దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం కామా రెడ్డిలో నిర్వహించిన ‘ఈ వేళ ఎందుకీ మహాసభలు’కరపత్ర ఆవిష్కరణ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా పూర్తి స్థాయిలో అమలు చేయలేని ప్రభుత్వం.. రూ. 50 కోట్ల వ్యయంతో మహాసభల జాతర నిర్వహిస్తోందని, ఇది ప్రభుత్వ ప్రచారంగానే ఉందన్నారు. రాష్ట్రంలో ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. భాష పేరిట పెద్ద పెద్ద కటౌట్లు కట్టి ప్రచారం నిర్వహించుకోవడం విచారకరమన్నారు. వేల మందిని పిలిచే బదులు తెలుగుపై పరిశోధనలు చేసిన వారు, సాహితీ వేత్తలు, కవులు, రచయితలను పిలిచి తెలుగు భాష అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో భాష, యాస, సంస్కృతి, జానపద కళలను కలకాలం నిలపడానికి ప్రయత్నాలు జరగడానికి పరిశోధనలను ప్రోత్సహించాలని, భాష ప్రాధికార మండలిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగాలి
మన్ననూర్: నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగించి చెంచులకు సేద తీర్చడమే తన ఉద్దేశమని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్ తిరుమల్‌రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్, రాంపూర్, బౌరాపూర్ చెంచులతో ఆదివారం అప్పాపూర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను చెంచుపెంటకు వచ్చినప్పుడు కిన్నెర వాయిద్యం గురించి గొప్పగా చెప్పినట్లు వివరించారు. అదే ఉద్దేశంతో మక్తల్‌కు చెందిన కిన్నెర వాయిద్యకారుడు పోషప్పతో తయారు చేయించిన రెండింటిని అప్పాపూర్ పెంటకు చెందిన గురువయ్య, రాంపూర్‌కు చెందిన బయ్యన్నకు ఇచ్చిన్నట్లు చెప్పారు. చెంచుల కళలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెంచులను అడవులకు దూరం చేయాలనుకోవడం భావ్యం కాదని చెప్పారు. ఓయూ ప్రొఫెసర్ కృష్ణయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ గురించి హైదారాబాద్‌లో కార్యక్రమాలు చేపట్టడం కాకుండా మారుమూల ప్రాంతాల్లో దుర్భరమైన జీవితాలను గడుపుతున్న వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. చెంచులకు వైద్యపరీక్షలు కడప మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా రాంకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుతో అమాయకులైన చెంచులు కూడా ఏదో వస్తుందని.. తమ బతుకులు బాగుపడుతాయని ఆశించారని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడే చెంచులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భూమిక తెలుగు మాసపత్రిక సంపాదకులు సత్యవతి, పీయూ ప్రొఫెసర్ మనోజ, ప్రముఖ కవి బెల్లి యాదయ్య, జీసీసీ మేనేజర్ చందర్లాల్, రచయితల సంఘం సభ్యులు నర్సన్, శ్రీధర్, వహీద్, గురువయ్య, చందునాయక్, ప్రసన్నకుమార్, నాగభూషణం, రాజు, యాదగిరి పాల్గొన్నారు.