జపాన్ యుద్ధ విన్యాసాలు..
మౌంట్ ఫ్యూజీ : జపాన్ గుండెల్లో వణుకు పుట్టిన ఉత్తర కొరియాకు ప్రతిగా ఆ దేశం కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. కిమ్ వరుస హెచ్చరికల నేపథ్యంలో జపాన్ కూడా యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో ఈ లైవ్ ఫైర్ డ్రిల్స్‌ను ప్రారంభించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ప్రతి క్షిపణి జపాన్ సముద్రంలో పడుతుండటం ఇటీవల సబ్ మెరైన్ నుంచి క్షిపణి ప్రయోగాలను చేపడుతున్న సమయంలో జపాన్ ఈ విన్యాసాలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2,400 మంది సైనికులు పాల్గొన్న ఈ విన్యాసాలలో పలు యుద్ధ ట్యాంకులు, జపాన్ నూతనంగా అభివృద్ధి చేసిన క్షిపణులను పరీక్షించారు. అన్ని ఆయుధాల పనితీరు బాగుందని ఎటువంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్దమని ఆ దేశ రక్షణాధికారులు ప్రకటించారు. కాగా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో తమకు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేదని అధికారులు చెబుతున్నారు.