ఐరన్ టానిక్ తాగిన విద్యార్థులకు అస్వస్థత
చిన్నశంకరంపేట : వైద్య సిబ్బంది అందించిన ఐరన్ టానిక్‌ను తాగిన పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. జవహర్ బాల ఆరోగ్య పథకంలో భాగంగా గురువారం చందంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది వారికి ఐరన్ సిరప్‌ను అందించారు. ఇది తీసుకున్న కొందరు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. తల తిరుగుతోందని చెప్పడంతో.. ఆందోళనకు గురైన సిబ్బంది వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
5వ తరగతి విద్యార్థులు వినయ్, నందు, రాకేష్, రేణుక, భవాని, సుమన, మాన స, హేమలత, శ్రావణి, కళ్యాణిలకు వైద్యం అందించి గంటపాటు అబ్జర్వేషన్లో ఉంచారు. స్థానిక వైద్యురాలు సవిత సెలవులో ఉండడంతో చేగుంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ అక్కడకు చేరుకుని విద్యార్థులకు వైద్యం చేశారు. ఐరన్ టానిక్ కొందరికి పడదని దీని వల్ల ఏ ప్రమాదమూ ఉండదని డాక్టర్ రాకేష్ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం వారిని ఇళ్లకు పంపించారు. పాఠశాలలోని 105 మందికి సిరప్ అందించగా 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.