రిలయన్స్‌కు పంచ్: మళ్లీ టాప్‌లోకి టీసీఎస్
న్యూఢిల్లీ : రికార్డు సృష్టించిన రిలయన్స్ జియోను టెక్ దిగ్గజం టీసీఎస్ వెనక్కి నెట్టేసింది. మళ్లీ తన స్థానాన్ని తాను ఆక్రమించుకుంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టీసీఎస్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.ఇటీవలే టీసీఎస్ స్థానాన్ని రిలయన్స్ అధిగమించి టాప్‌లో నిలిచింది. అయితే ప్రస్తుతం రిలయన్స్‌ను టీసీఎస్ అధిగమించినట్టు వెల్లడైంది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్‌తో టాటా గ్రూప్‌కు చెందిన ఈ టెక్ సంస్థ మార్కెట్ విలువ రూ.4,55,405.31 కోట్లగా నమోదైంది. ఇది రిలయన్స్ మార్కెట్ విలువ కంటే 299.98 కోట్లు అధికం.
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 4,55,105.33 కోట్లగా ఉంది. నాలుగు ఏళ్ల క్రితమే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానాన్ని టీసీఎస్ దక్కించుకుంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ షేర్ల జోరుతో, టీసీఎస్‌కు దగ్గరి స్థానంలోకి రిలయన్స్ వచ్చేసింది. ఈ ఏడాదిలో రిలయన్స్ షేర్లు 30 శాతం పైకి పెరుగగా.. టీసీఎస్ షేర్లు 2 శాతం పడిపోయాయి. అదేవిధంగా వీటి తర్వాత మార్కెట్ విలువ ప్రకారం ఓఎన్జీసీ మరోసారి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది.