breaking news
hridaya kaleyam
-
9న హృదయ కాలేయం సెకండ్ రిలీజ్
వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండచ్చు. ఒకప్పుడు పాత కాలంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలు సెకండ్ రిలీజ్ అయ్యేవి. అవికూడా మొదటిది విడుదలైన చాలా నెలల తర్వాత. కానీ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'హృదయ కాలేయం' మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9వ తేదీన ఈ సినిమాను సెకండ్ రిలీజ్ చేస్తున్నట్లు సంపు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను తన పుట్టినరోజు బహుమతిగా అందజేస్తున్నానన్నాడు. ''మే 9న మళ్లీ థియటర్స్లో మీ ముందుకు ఈ బర్నింగ్ స్టార్ రాబోతున్నాడు. మీరు కడుపుబ్బా నవ్వితే నాకదే పదివేలు. మా సినిమాని చూసినవాళ్లు, చూడనివాళ్లు ఈసారి తప్పక చూడండి. నా మీద ఫేస్బుక్లో నెగెటివ్ కామెంట్లు పెట్టేవాళ్లు, ఈ సినిమా చూసి ఆ తర్వాత మాట్లాడండి. మీరు పాయింటవుట్ చేస్తున్నా, ఇన్ని నెగెటివ్స్ ఉండి నేను ఒక హీరోగా సినిమా చేసి హిట్ కొట్టి మళ్లీ సెకండ్ రిలీజ్ కూడా చేస్తున్నా. అదికూడా ఇంత పోటీ ఉన్న మన టాలీవుడ్లో. ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించకుండా నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ల దిమాగ్కి, ధైర్యానికి ఛాలెంజ్. చూసి మాట్లాడండి. మా ప్రయత్నం తప్పక నచ్చుతుంది. మీలో మార్పు వస్తుంది'' అని తన ఫేస్బుక్ పేజీలో సంపు రాశాడు. ఇంతకుముందు బాలకృష్ణ లెజెండ్ విడుదలైన సమయంలోనే తన సినిమాను విడుదల చేసి, మంచి కలెక్షన్లు కూడా సాధించిన సంపు, ఇప్పుడు రజనీకాంత్ సంచలనాత్మక సినిమా 'విక్రమసింహ'తో పోటీపడుతూ తన సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇంతకుముందు తన సినిమా వచ్చినప్పుడు యువత అంతా పరీక్షలు, ఎన్నికలతో బిజీగా ఉన్నారని, అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత తన సినిమా విడుదల చేస్తున్నానని చెప్పాడు. -
మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు
తాను సినిమా చేయడానికి నిర్మాత, దర్శకుడు, కథ.. అన్నీ సిద్ధమైపోయినా మూడు నెలల పాటు హీరోయిన్ దొరకలేదని సంచలన హీరో సంపూర్ణేష్ బాబు తెలిపాడు. 'సాక్షి' కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు.. హృదయ కాలేయం సినిమా ఆలస్యం కావడానికి, దాదాపు ఏడాది పాటు బయటకు రాకపోవడానికి కారణమేంటని ప్రశ్నించినప్పుడు ఈ విషయం బయటపెట్టాడు. నిజానికి తన పక్కన హీరోయిన్గా నటించడానికి ఎవరూ ముందుకు రాలేదని, మూడు నెలల పాటు వెతికి వెతికి, చివరకు తప్పనిసరైతే ఎవరైనా అబ్బాయికే అమ్మాయి వేషం వేయించి అయినా హీరోయిన్గా పెట్టేద్దామని అనుకుంటుండగా ఈ హీరోయిన్ దొరికిందని, దాంతో ఇక అప్పటినుంచి ప్రాజెక్టు వేగం పుంజుకుందని చెప్పాడు. ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని, కానీ స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రేక్షక దేవుళ్లు విపరీతంగా ఆదరించారని తెలిపాడు. అమెరికాలో 20 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేయగా, అక్కడ కూడా ప్రేక్షకులు ఈలలు వేసి, చప్పట్లు కొట్టినట్లు తెలిసిందని, వాళ్ల అభిమానానికి తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నాడు. రాబోయే సినిమా 'కొబ్బరిమట్ట'ను కూడా ప్రేక్షకులు ఇదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.