breaking news
Harvard University scientists research
-
సన్‌కే స్ట్రోక్ ఇద్దాం!
సూరీడు సీరియస్‌గా ఉన్నాడు.. ఎండ దంచి కొడుతోంది.. ఏం చేస్తాం? అడ్డంగా గొడుగు పెడతాం.. మనకు ఓకే.. మరి భూమి మొత్తానికి ఎండ కొడుతోందిగా.. ఏం చేయాలి? గొడుగు పట్టాలా? అడ్డుగా ఏదైనా పెట్టాలా? భూతాపం నుంచి రక్షించుకునేందుకు సూర్యుడి వేడిని ఎలా ఆపాలి? వినడానికిది సిల్లీగా అనిపిస్తోందా.. అయితే, ఇదేదో ఊసుపోని పోరగాళ్ల ముచ్చట కాదు.. ప్రపంచంలోనే పేరొందిన హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తల వినూత్న ఆలోచన.. దీనికి నిధులు సమకూరుస్తోంది కూడా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కావడం విశేషం.. అరె.. సింపుల్‌రా భయ్.. బోలెడంత చాక్ పౌడర్‌ను తీసుకెళ్లి.. ఆకాశంలో చల్లేయ్.. అదే పెద్ద సన్షేడ్లాగ సూరీడు నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది ఇంతకీ సూరీడు దుమ్ము దులిపేసే ఆ ఆలోచన ఏంటి? సూర్యుడి వేడి భూమిపై పడకుండా ఉండేందుకు భారీ మొత్తంలో దుమ్మును ఆకాశంలో సూర్యుడికి అడ్డంగా చల్లుతారట. ఇందుకోసం రోజుకు 800 భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో లక్షల టన్నుల చాక్ (క్యాల్షియం కార్బొనేట్) దుమ్మును భూమి కి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తు (స్ట్రాటోఆవరణం)లో జల్లి వస్తారు. ఇలా చల్లిన దుమ్ము సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తుంద ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల భూమిపైకి వచ్చే కిరణాల తీవ్రత తగ్గి.. భూతాపం నుంచి ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. బిల్‌గేట్స్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల నిమిత్తం స్ట్రాటోస్ఫియరిక్ కంట్రోల్డ్ పెర్టుర్బేషన్ ఎక్స్పెరిమెంట్ అనే పరికరం (రూ.20 కోట్లు) ద్వారా ఓ పెద్ద బెలూన్ను ఉపయోగించి రెండు కేజీల క్యాల్షియం కార్బొనేట్ పొడిని 20 కిలోమీటర్ల పైకి పంపి అక్కడ చల్లుతారు. తొలుత న్యూ మెక్సికోలో ఈ ప్రయోగం చేయనున్నారు. దీంతో అక్కడున్న గాలి మందంగా తయా రై సూర్యుడి కిరణాలు కిందకు రాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు. అలాగే కాల్షియం కార్బొనేట్ కణాలు తెలుపు రంగులో ఉండటం వల్ల సూర్యుడి కాంతి పరావర్తనం చెందుతుంది. దీన్నే అల్బిడో అని పిలుస్తారు. శుద్ధమైన మంచుకు అల్బిడో విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు సూర్యుడి కాంతి మొత్తాన్ని పరావర్తనం చెందిస్తుంటుంది. ఎండాకాలంలో ఇంటి మేడపై తెల్లటి (వైట్ వాష్) పెయింట్ వేస్తే సూర్యరశ్మి వేడిమి ఇంట్లోకి రాకుండా ఆపుతుంది కదా.. అలాగన్న మాట. అదే సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాల్షియం కార్బొనేట్‌ను ఆకాశంలో జల్లి వస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. నష్టమా.. లాభమా..? ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి తాపం నుంచి భూమికి, మనకు ఉపశమనం కలుగుతుందో లేదో తెలియదు కానీ.. భవిష్య త్తులో స్ట్రాటో ఆవరణంలోని ఈ పొడి వల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించి కరువులు, హరికేన్లు వచ్చే ప్రమాదముందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వాదనలను హార్వర్డ్ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఉపవాసం మేలు గుట్టు తెలిసింది
తరచూ ఉపవాసం ఉండటం వల్ల ఆయువు పెరుగుతుందని వింటుంటాం.. ఇందుకు కారణాలను సశాస్త్రీయంగా హార్వర్డ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ మైటోకాండ్రియానే కణాలకు అవసరమైన శక్తిని తయారు చేస్తుంది. హార్వర్డ్ శాస్త్రవేత్తలు నులిపురుగులపై ప్రయోగాలు చేశారు. రెండు వారాల పాటే బతికే ఈ నులిపురుగులకు అందే ఆహారాన్ని నియంత్రించినప్పుడు వేర్వేరు కణాల్లోని మైటోకాండ్రియాలు స్థిరంగా ఉండిపోయినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో మైటోకాండ్రియా ఒక దశ నుంచి ఇంకోదశకు సులువుగా మారేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉపవాసం కారణంగా మైటోకాండ్రియా.. ఆక్సిజన్ సాయంతో కొవ్వులను మండించే భాగాలైన పెరాక్సీసోమ్స్ మధ్య సమన్వయం కూడా పెరిగిందని తెలిసింది. -
రొయ్య పెంకుతో.. ప్లాస్టిక్!
రొయ్యలు తినేందుకు రుచిగా ఉండవచ్చుగానీ.. వీటితో ఇప్పుడు ఇంకో ప్రయోజనమూ చేకూరబోతోంది. ఫొటోలో కనిపిస్తున్న రంగురంగుల ప్లాస్టిక్ వస్తువులన్నీ రొయ్యల పైభాగంలోని పెంకుతో తయారయ్యాయి! సాధారణ ప్లాస్టిక్‌తో పోలిస్తే ఎంతో గట్టిగా ఉంటుంది. అంతేకాదు చాలా త్వరగా భూమిలో శిథిలమైపోతుంది. ముడిచమురు నుంచి తయారయ్యే సాధారణ ప్లాస్టిక్ వెయ్యేళ్లపాటు శిథిలం కాకుండా పర్యావరణానికి చేటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తగిన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇప్పటికీ దీన్నే వాడుతున్నాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమాని రొయ్య పెంకులతో తయారయ్యే ప్లాస్టిక్ అందుబాటులోకి వస్తే పర్యావరణ సమస్యలను అధిగమించవచ్చు.