breaking news
green fine
-
అదానీ జరిమానా రద్దు చేయలేదు
న్యూఢిల్లీ: ముద్రాపోర్ట్ నిర్మాణ సమయంలో అదానీ పోర్ట్ సెజ్ లిమిటెడ్ పై విధించిన భారీ జరిమానాను రద్దుచేసి ఎన్డీయే ప్రభుత్వం అదానీ కి భారీ ఊరట నిచ్చిందనే వార్తలపై కేంద్రం స్పందించింది. పర్యావరణ నష్టం కింద అదానీకి విధించిన రూ.200 కోట్ల జరిమానాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రద్దుచేసిందనే వార్తను పర్యావరణ శాఖ ఖండించింది. అది "తప్పు" వార్తని మంత్రిత్వ శాఖ కొట్టి పారేసింది. నష్టనివారణ కోసం, పర్యావరణ పునరుద్ధరణ పరిరక్షణ కోసం సునీతా నారాయణ్ కమిటీ ప్రతిపాదించిన రూ .200 కోట్ల జరిమానాను అదానీ భరించాల్సిందేనని తేల్చి చెప్పింది. జరిమానా రద్దు కాలేదని ప్రకటించడంతో పాటూ, ఈ వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని మంత్రిత్వ శాఖస్పష్టం చేసింది. పునరుద్ధరణ నిధికి రూ .200 కోట్ల గ్రీన్ పెనాల్టీపై వెనక్కి లేదని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు అదానీపై మరింత తీవ్రమైన బాధ్యతను పెట్టినట్టు వివరించింది. దీనికితోడు ఈ జరిమానా వసూలు ప్రక్రియలో చట్టబద్దమైన చర్యలకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా నోటీసులు జారీ చేశామని తెలిపింది. కాగా ముద్రా ప్రాజెక్టు సైట్ పర్యావరణకు నష్టం చేకూరుస్తుందనే ఆరోపణలను కాంగ్రెస్ హయాంలో అదానీ ఎదుర్కొంది. దీనిపై విధించిన సునీతా నారాయణ్ కమిటీ ప్రతిపాదనలను 2013లో అప్పటి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పర్యావరణానికి ముప్పు కల్గించినందుకు గ్రీన్ పెనాల్టీ కింద అదానీకి రూ.200 కోట్ల డాలర్లు లేదా ప్రాజెక్టు ధరల్లో 1శాతం ఏది ఎక్కువైతే అది జరిమానా చెల్లించాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే యూపీఏ హయాంలో అతిపెద్ద గ్రీన్ పెనాల్టీనీ ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసిందనీ, అదేవిధంగా 2009లో గుజరాత్ లో కంపెనీ వాటర్ పోర్ట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు జారీచేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ను పొడిగించి, అదానీ భారీ ఊరట కల్పించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
అదానీకి భారీ ఊరట
యూపీఏ హయాంలో అతిపెద్ద గ్రీన్ పెనాల్టీతో ముప్పుతిప్పలు పడ్డ అదానీకి ఎన్డీయే ప్రభుత్వంలో ఉపశమనం లభించింది. పర్యావరణ నష్టం కింద అదానీకి విధించిన రూ.200 కోట్ల జరిమానాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రద్దుచేసింది.. అదేవిధంగా 2009లో గుజరాత్ లో కంపెనీ వాటర్ పోర్ట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు జారీచేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ను పొడిగించింది. అనేక కఠిన పరిస్థితులతో అదానీకి జారీచేసిన నోటీసులను ప్రస్తుత మంత్రిత్వ శాఖ వెనక్కి తీసుకుంది. అదానీ వాటర్ ఫోర్ట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో నాలుగు పోర్టులు ఉన్నాయి. ముద్రా ప్రాజెక్టు సైట్ పర్యావరణ నష్టం చేకూరుస్తుందనే ఆరోపణలను కాంగ్రెస్ హయాంలో అదానీ ఎదుర్కొంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం 2012లో సునీత సురాయణ్ కమిటీని కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పర్యావరణ నిబంధనలను అదానీ ఉల్లంఘించిదని ఈ విచారణలో కమిటీ గుర్తించింది. లోకల్ ఎకలాజీకి ఎక్కువగా ముప్పు చేకూరిందని, ఎన్నో వాగులు, మడ అడవులకు నష్టంచేకూరిందని కమిటీ వెల్లడించింది. దీంతో పర్యావరణానికి ముప్పు కల్గించినందుకు గ్రీన్ పెనాల్టీ కింద అదానీకి రూ.200 కోట్ల డాలర్లు లేదా ప్రాజెక్టు ధరల్లో 1శాతం ఏది ఎక్కువైతే అది జరిమానాగా కమిటీ ప్రతిపాదించింది. ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద విధించే గరిష్ట రూ.1 లక్షల జరిమానా కంటే ఇది చాలా అధికం. ఈ కమిటీ ప్రతిపాదనలను 2013లో అప్పటి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అదానీ పోర్ట్స్ కు, సెజ్ కు, గుజరాత్ అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీచేసింది. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీరియస్ అయింది. అయితే దీనిపై తుది నిర్ణయం రావడానికి ఆలస్యమైంది. జయంతి నటరాజన్ స్థానంలో పర్యావరణ మంత్రిగా వీరప్పన్ మొయిలీ రావడంతో ఈ నిర్ణయం పెండింగ్ లో పడింది. ఈ ఆరోపణలను అప్పుడే అదానీ పోర్ట్స్, సెజ్ ఖండించింది. ఆఖరికి దీనిపై ప్రస్తుత మంత్రిత్వ శాఖ ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో నిర్ణయం వెలువడింది. దీనిపై పునఃవిచారణ చేపట్టిన ప్రస్తుత మంత్రిత్వ శాఖ, ఈ ప్రాజెక్టు వల్ల మడ అడవులకుఎలాంటి నష్టం వాటిల్లలేదని, శాటిలేట్ డేటా ప్రకారం గుర్తించింది. అధికారులు దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి ప్రకాశ్ జవదేకర్ ఆమోదం తెలిపి, అదానీకి విధించిన పెనాల్టీని విరమించుకున్నారు.