breaking news
Great Hyderabad Urban Development Company
-
ఇక 3 రోజులే...
31తో ముగియనున్న క్రమబద్ధీకరణ గడువు ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లకు ఇదే చివరి అవకాశం నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్న హెచ్ ఎండీఏ సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని అక్రమ లే అవుట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు తుది గడువు 3 రోజుల్లో ముగియనుంది. ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకొనేందుకు ఈ నెల 31ని తుది గడువుగా ప్రభుత్వం నిర్దేశించింది. క్రమబద్ధీకరణ గడువును పొడిగించే విషయమై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు లేవని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, అన్ని డాక్యుమెంట్లు లేకపోయినా.. ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకొని, ఆ ప్రింటవుట్‌ను తీసుకొని మాన్యువల్‌గా దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. అయితే ఆ దరఖాస్తుతో పాటు టైటిల్‌డీడ్ జిరాక్స్ కాపీ(అటెస్టెడ్)తో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రూ.10 వేల డిమాడ్ డ్రాఫ్టును జతచేసి తార్నాకలోగానీ, లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో గానీ సమర్పించి రసీదు తీసుకోవాలని తెలిపారు. క్రమబద్ధీకరణ గడువు మరో 2 నెలలు పెంచాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. అయితే...అటునుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇక ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లకు గడువు పెంచకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. క్రమబద్ధీకరణ గడువు ముంచుకొస్తుండటంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు ఎక్కువ మంది ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో నెట్లో అప్లోడ్ కానిపరిస్థితి ఎదురైంది. దీనికితోడు హెచ్ఎండీఏలోని సర్వర్లు అధిక లోడ్‌ను తీసుకొనేందుకు సపోర్టు చేయకపోవడంతో ఆన్లైన్ ద్వారా దాఖలైన దరఖాస్తులు సోమవారం నాటికి 37180కి మించలేదు. ఎల్ఆర్ఎస్ కింద 27115, బీఆర్ఎస్ కింద 1065 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దాఖలైనట్లు హెచ్ఎండీఏ వెబ్సైట్ చూపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన కమిషనర్ చిరంజీవులు చివరి మూడు రోజులైనా సద్వినియోగం చేసుకొని మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశించారు. ఆమేరకు దరఖాస్తుతో పాటు ఏయే డాక్యుమెంట్లు జతచేయాలో సూచిస్తూ హెచ్ఎండీఏ వెబ్సైట్లో పెట్టారు. దరఖాస్తుదారులకు అసౌకర్యం కలగకుండా దరఖాస్తులన్నీ స్వీకరించేంతవరకు రాత్రి 8 గంటల వరకు ఆఫీసును తెరిచే ఉంచాలని కమిషనర్ నిర్ణయించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లను కూడా రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంచి కొత్త దరఖాస్తులను స్వీకరించాలని ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఆరాటమేదీ...? క్రమబద్ధీకరణకు తుది గడువు ఇక మూడు రోజులే ఉండటంతో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లకు దరఖాస్తుల రాక కాస్త పెరిగినట్లు సమాచారం. ఈ నెల 31తో స్కీం ముగియనుండటంతో వీలైనంత వరకు ఆదాయాన్ని రాబట్టుకొనేందుకు అధికారులు ఆరాటపడాలి. అయితే... హెచ్ఎండీఏలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజూవారీగా ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి? మాన్యువల్‌గా దరఖాస్తులు తీసుకొంటే ఏ రసీదు ఇవ్వాలి.? సేవాకేంద్రాల ను నిరవధికంగా పనిచేయిస్తే సిబ్బందికి భోజనం,ఇతర సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులు ఇంతవరకు దృష్టిపెట్టలేదు. మండ లాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్లపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్లానింగ్ డెరైక్టర్లు కూడా ఇటు దృష్టి సారించకపోవడంతో వారిదే ఇష్టారాజ్యంగా మారింది. కొందరు దళారులు ఒక్కో దరఖాస్తుకు రూ.3 వేల చొప్పున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 63 వేల దరఖాస్తులు... ఈనెల 31వ తేదీతో గడువు ముగియనున్నందున బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తులు అప్లోడ్ చేయడాన్ని సులభతరం చేశామన్నారు. ఇప్పటి వరకు 63 వేల దరఖాస్తులందాయన్నారు. మరిన్ని కౌంటర్లు ఏర్పాటుకు ఆదేశం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో ప్రజల కు ఇబ్బందులు కలుగకుండా సిటిజన్ సెంటర్స్‌లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి సోమవారం రాత్రి ఆయా సర్కిల్స్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని జతచేయండి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొనేవారు తొలుత హెచ్ఎండీఏ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో రూ.10 వేల డీడీని తీసుకొని దాని నంబర్‌ను ఆన్లైన్ దరఖాస్తులో ఎంట్రీ చేయాలి. ఎలాంటి ధ్రువపత్రాలు స్కాన్ చేయాల్సిన అవసరంలేదు. ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, దాన్ని ఒక జిరాక్స్ కాపీ తీసి భద్రపర్చుకోవడంతో పాటు మరో కాపీకి ఈ దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లు జత చేసి హెచ్ఎండీఏ కార్యాలయం, లేదా మండల సహాయ కేంద్రాల్లో సమర్పించాలి. బీఆర్ఎస్కు గతంలో మంజూరు చేసిన ధ్రువపత్రం (ఉంటే). భూమి/బిల్డింగ్‌కు సబంధించి యాజమాన్య ధ్రువపత్రాలు అంటే...రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు(గజిటెడ్ అధికారిచే ధ్రవీకరించినవి). బిల్డింగ్ ప్లాన్‌కు సంబంధించి లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్/ ఇంజనీర్‌చే ధ్రువీకరించిన నమూనా (3 సెట్లు) రూ.10 వేల డీడీ (మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో..) ఇండెమ్నిటి బాండ్ బిల్డింగ్ ఫొటోలు (ఎలివేషన్ ఫొటో) ఎల్ఆర్ ఎస్‌కు భూమికి సబంధించి యాజమాన్య ధ్రువపత్రాలు అంటే... రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (గజిటెడ్ అధికారిచే ధ్రవీకరించినది) స్థలం యొక్క ప్లాన్ (లొకేషన్ స్కెచ్ ప్లాన్) లే అవుట్ ప్లాన్‌లో ప్లాట్ స్థలం, ఖాళీ ప్రదేశం, రోడ్ తదితరాలు తెలియజేస్తూ... ఇండెమ్నిటీ బాండ్ రూ.10 వేల డీడీ (మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో..) -
హెచ్ఎండీఏకు కొత్త రక్తం!
ఖాళీల భర్తీకి మళ్లీ ‘డిప్యుటేషన్’ నియామకానికి కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు కొత్త రక్తం ఎక్కించేందుకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా రెవెన్యూ, ఫారెస్ట్, డీటీసీపీ తదితర విభాగాల్లో మంచి రికార్డు ఉన్న అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా నిర్ణయించారు. ఈ మేరకు ఆయా విభాగాలకు ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని అధికారులను ఆదే శించారు. సంస్థలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను కొత్త జట్టును ఏర్పాటు చేసే దిశగా ఆమె చర్యలు చేపట్టారు. కాగా హెచ్ఎండీఏలో డిప్యుటేషన్‌పై దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు అధికారులను ఇటీవల మాతృ సంస్థలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం హెచ్ఎండీఏకు వచ్చే వారికి సత్వర సేవలందించేందుకుగాను సంస్థను సమూలంగా సంస్కరించాలని కమిషనర్ పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా నిజాయితీ పరులతో కూడిన కొత్త బృందాన్ని ఏర్పాటు చేసి పారదర్శన పాలన అందించాలని ఆమె యోచిస్తున్నారు. గతంలో భూ పరిపాలనా విభాగం, ఓఆర్ఆర్ ప్రాజెక్టులో 36మంది రెవిన్యూ విభాగానికి చెందిన అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను కుదించి ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు, తాహశీల్దార్లు-5, డిప్యూటీ తాహశీల్దార్లు-10, ఐదుగురు సర్వేయర్లతో కలిసి మొత్తం 22మందిని కొత్తగా డిప్యుటేషన్‌పై తీసుకోనున్నారు. అంతేగాకుండా హెచ్ఎండీఏలో కీలకమైన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ) పోస్టు భర్తీకి అకౌంటెంట్ జనరల్ (ఏజీ)కు లేఖ రాయనున్నారు. ప్లానింగ్ విభాగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించాల్సి ఉన్నందున దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఎం.ఎ. అండ్ యూడీ లేదా డీటీసీపీ విభాగాల నుంచి నిజాయితీ పరులైన అధికారులను డెరైక్టర్లు, ప్లానింగ్ ఆఫీసర్లుగా తీసుకోవాలని నిర్ణయించారు. అటవీ శాఖ నుంచి... ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధికి కమిషనర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. హరిత హారం పథకం కింది హెచ్ఎండీఏకు ఇప్పటికే రూ.50కోట్లు నిధులు కేటాయించినందున వాటిని చక్కగా సద్వినియోగం చేసుకొని హరిత హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలని ఆమె లక్ష్యంగా నిర్ణయించారు. అయితే... అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలోని అటవీ శాఖ అధికారులందరినీ మూకుమ్మడిగా మాతృశాఖకు పంపినందున, ఇప్పుడు అదే శాఖ నుంచి మళ్లీ కొత్తగా 12మంది అధికారులను తీసుకోవాలని నిర్ణయించారు. దీనికితోడు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేకపోవడంతో హెచ్ఎండీఏలో పనులు పూర్తిగా స్తంభించిపోవడంతో త్వరలో టెండర్ పిలిచి 50-60మంది సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ఇప్పటికే రోడ్డునపడ్డ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొంటున్నారు.