breaking news
gooty model school
-
యువకుడి దారుణహత్య
సాక్షి, అనంతపురం సెంట్రల్ : నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన శ్రీరాములు(35) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాగుడు అలవాటున్న శ్రీరాములు రోజూ పొద్దుపోయేంత వరకు ఇంటికి వెళ్లేవాడు కాదు. సోమవారం కూడా పూటుగా మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుత్తిరోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో జన సంచారం తక్కువగా ఉండటంతో ఆలస్యంగా గుర్తించారు. భూ వివాదమే కారణమా..? గుంతకల్లు పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి, హేమకోటరెడ్డి దాయాదుల మధ్య 30 ఎకరాల భూ వివాదం నడుస్తోంది. సదరు భూమిని సుధాకర్‌రెడ్డి.. శ్రీరాములు పేరుతో జీపీఏ చేయించాడు. అనంతరం తాడిపత్రికి చెందిన మరో వ్యక్తికి అమ్మాడు. హేమకోటిరెడ్డి కూడా అదే భూమిని మరో వ్యక్తికి విక్రయించాడు. ప్రస్తుతం భూ సమస్య గుంతకల్లు కోర్టులో నడుస్తోంది. శ్రీరాములు సోమవారం కూడా అక్కడి కోర్టుకు హాజరై వచ్చాడు. దాదాపు రూ.కోట్లలో ఈ భూమి విలువ జేస్తుండడంతో శ్రీరాములును తప్పించేందుకే హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విధుల నుంచి ఇన్విజిలేటర్ల తొలగింపు
గుత్తి : గుత్తిలోని మోడల్ పాఠశాలలో శుక్రవారం పదోతరగతి తెలుగు-1 పరీక్షలో ఇద్దరు విద్యార్థులకు 01టీ బదులు 03టీ ప్రశ్నపత్రాలు అందజేసిన ఇన్విజిలేటర్లు పెద్దన్న, జోహార్‌బానును పరీక్ష విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వేణుగోపాల్ శనివారం తెలిపారు. ఇన్విజిలేటర్లు 01టీకు బదులు 03 టీ ఇవ్వడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు ఇన్విజిలేటర్లను శనివారం రిలీవ్ చేశారు. వారిపై పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ అన్నారు.