breaking news
Goa election
-
అంతా గవర్నర్ల విచక్షణేనా?
గోవా ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా గవర్నర్ మృదులా సిన్హా.. బీజేపీ నేత పరీకర్‌ను సీఎంగా నియమించడం వివాదానికి దారితీసింది. గోవాలో మాదిరే మణిపూర్ ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆహ్వానం పలకడంతో ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాకపోతే.. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని ఉల్లంఘించిన సందర్భాలూ ఉన్నాయి. హరియాణాలో.. 1982 మేలో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకు గాను పాలక కాంగ్రెస్ 36, విపక్ష లోక్‌దళ్ 31 సాధించాయి. లోక్‌దళ్ పొత్తు పెట్టుకున్న బీజేపీకి 6 సీట్లు రావడంతో ఆ పార్టీ బలం 37కు చేరింది. 24వ తేదీన లోక్‌దళ్–బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి రాజ్‌భవన్‌కు రావాలని కూటమి నేత, మాజీ సీఎం దేవీలాల్‌ను గవర్నర్ జీడీ తపాసే ఆదేశించారు. ఇందిర ప్రధానిగా ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందోగానీ, కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సీఎం భజన్‌లాల్‌తో 23 సాయంత్రమే సీఎంగా తపాసే ప్రమాణం చేయించారు. వెంటనే దేవీలాల్ రాజ్‌భవన్‌కు వెళ్లి.. భజన్ సర్కారును రద్దుచేసి, తనతో సీఎంగా ప్రమాణం చేయించాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ(కాంగ్రెస్) నేతతో ప్రమాణం చేయించడం ఆనవాయితీగా వస్తోందని, తాను అదే చేశానని, గవర్నర్‌కు ఇలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయని తపాసే వాదించారు. మైనారిటీని మెజారిటీగా మార్చడంలో ఆరితేరిన భజన్ రెండు రోజులకే మెజారిటీ కూడగట్టారు. లాల్ కోర్టుకెక్కినా ఫలితం లేకపోయింది. కేరళలో.. పొత్తు పెట్టుకున్న పార్టీలకొచ్చిన సీట్లన్నీ ఒకే పార్టీ సీట్లుగా పరిగణించిన సందర్భాలూ ఉన్నాయి. 1982 మేలోనే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కి మెజారిటీ వచ్చింది. తర్వాతి స్థానంలో సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ నిలిచింది. కాంగ్రెస్‌కు విడిగా 20 , సీపీఎంకు విడిగా 26 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీని ఆహ్వానించే సంప్రదాయాన్ని పాటించాల్సి వస్తే.. గవర్నర్ సీపీఎం నేతతో సీఎంగా ప్రమాణం చేయించాలి. అయితే, గవర్నర్ యూడీఎఫ్ సారథి అయిన కాంగ్రెస్ నేతనే(సీఎల్పీ) సీఎంని చేశారు. మేఘాలయలో.. 1983 ఫిబ్రవరిలో 60 సీట్ల మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ 25 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. విపక్షాలైన ఆల్ పార్టీ హిల్‌లీడర్స్ కాన్ఫరెన్స్(ఏపీహెచ్చెల్సీ)కు 15, హిల్‌స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(హెచ్చెస్పీడీపీ)కి 15, పబ్లిక్ డిమాండ్స్ ఇంప్లిమెంటేషన్ కన్వెన్షెన్(పీడీఐసీ)కి 2 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీ నేతగా తననే సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కెప్టెన్ విలియంసన్ సంగ్మా గవర్నర్‌ను కోరారు. మెజారిటీకి అవసరమైన 32 మంది మద్దతు తనకుందంటూ ఏపీహెచ్చెల్సీ, హెచ్చెస్పీడీపీ, పీడీఐసీల కూటమి(యూఎంపీపీ) నేత లింగ్డో గవర్నర్‌కు జాబితా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లింగ్డోను గవర్నర్ ఆహ్వానించారు. పెద్ద పార్టీని సర్కారు ఏర్పాటుకు పిలవలేదు. సందర్భాన్నిబట్టి పెద్ద పార్టీని పిలవాలా? మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న నేతను సీఎంను చేయాలా? అనే విషయంలో గవర్నర్‌కు ‘విచక్షణాధికారాలు’ ఉన్నాయని, అర్థమౌతుంది. 1990 ఫిబ్రవరి నాటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించిన కా>ంగ్రెస్‌కు గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు.అప్పుడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ సర్కారు అధికారంలో ఉంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభావం, గవర్నర్ల వ్యక్తిత్వం వివిధ సందర్భాల్లో భిన్న సంప్రదాయాల అమలుకు దారితీస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నెలకు ఐదు లీటర్ల పెట్రోల్ ఫ్రీ..!
ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి విద్యార్థికి నెలకు ఐదు లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తాం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా ఉచితంగా వై-ఫై సేవలు అందిస్తాం.. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రమంతటా నిరంతర విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తాం. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తాం.. బీజేపీ.. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న గోవాలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలు ఇవి. పదిలక్షలకుపైగా ఓటర్లు, 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో అధికార బీజేపీకి మరోసారి పట్టం కట్టాలా? లేక మార్పును స్వాగతించాలా? అన్నది శనివారం ఓటర్లు తేల్చబోతున్నారు. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం (2014-15 తలసరి ఆదాయపరంగా), దేశంలో అక్షరాస్యతలో నాలుగో స్థానంలో ఉన్న రాష్ట్రం గోవా. గోవాలోని విద్యావంతులైన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల ద్వారా చాలా గట్టిగానే ప్రయత్నించాయి. సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో రవాణా సదుపాయాలు పెంపొందిస్తామని, నార్త్ గోవాలోని మోపాలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడం ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపుతామని ప్రకటించింది. అటు ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలను గుప్పించాయి. స్థానిక గిరిజనులను మోసం చేసి మోపాలో భూసేకరణ చేపట్టారని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే మోపాలో భూసేకరణను నిలిపేసి తదుపరి విచారణ చేపడతామని ఒక అడుగు ముందుకేసి ఆప్ ప్రకటించింది.