breaking news
Glow worms
-
మిణుగురు దీపం గుట్టు తెలిసింది...
విద్యుత్ బల్బును కడుపులో పెట్టుకుని.. చీకటిలో దానిని ఆర్పుతూ, వెలిగిస్తూ తిరుగుతున్నట్లు కనిపించే మిణుగురు పురుగుల రహస్యం తెలిసింది. వాటి కడుపులో ఉండే దీపం ఎలా వెలుగుతోందో చిక్కుముడి వీడింది. కీటకాలు ఇలా వెలుగులు విరజిమ్మే ప్రక్రియను జీవ సందీప్తి అంటారని, మిణుగురు దీపం భాగంలోకి ఆక్సిజన్ చేరినప్పుడు లూసిఫెరిన్ పదార్థం విచ్ఛిన్నం కావడం వల్ల వెలుతురు పుడుతుందన్నది ఇదివరకు తెలిసిందే. అయితే, మిణుగురులోని దీపం చాలా సంక్లిష్టంగా ఉండటంతో దానికి ఆక్సిజన్ ఎలా అందుతుంది? అది ఎలా పనిచేస్తోంది? అన్నది ఇంతకాలం తెలియలేదు. ఇప్పుడీ రహస్యాన్ని స్విట్జర్లాండ్, తైవాన్ శాస్త్రవేత్తలు ఛేదించారు. కాంట్రాస్ట్ మైక్రోటోమోగ్రఫీ, ట్రాన్స్మిషన్ ఎక్స్-రే మైక్రోస్కోపీ అనే కొత్త పద్ధతులతో స్కానింగ్ చేసి వీరు మిణుగురు దీపం కణస్థాయిలో ఎలా పనిచేస్తోందో కనుగొన్నారు. మిణుగురు శరీరంలోని ఇతర భాగాల నుంచి ఆక్సిజన్ అత్యంత సూక్ష్మనాళికల ద్వారా దీపానికి చేరే మొత్తం ప్రక్రియను వీరు గుర్తించారు. ఈ ప్రక్రియ ఆధారంగా.. రాత్రిపూట రోడ్డు పక్కన మొక్కలు వీధి లైట్లలా వెలుగులు విరజిమ్మేలా చేయొచ్చట. ఔషధాల పరీక్షకు, నీటి కాలుష్యాన్ని తెలుసుకునేందుకూ ఈ విధానం ఉపయోగపడుతుందట. -
తారలు దిగొచ్చాయి..
మాల్దీవుల్లోని వాదూ ద్వీపానికి వెళ్తే.. అక్కడ నక్షత్రాలు ఆకాశంలోనే కాదు.. ఇలా నేలపైనా కనిపిస్తాయి. అదే అక్కడి స్పెషాలిటీ కూడానూ. ఈ వెలుగులకు కారణం.. నీటిపై తేలియాడే శైవలాలు వంటి జీవులు.. అవి మిణుగురు పురుగుల్లా కాంతిని వెదజల్లుతాయి. దాని వల్ల నీలం రంగులో అక్కడి బీచ్ మెరిసిపోతూ ఉంటుంది. దీన్ని చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తారు.