breaking news
gajwel mandal
-
‘ఆరోగ్య తెలంగాణే సీఎం లక్ష్యం’
సాక్షి, సిద్దిపేట: ‘ఎన్ని సంపదలున్నా ఆరోగ్యమే మిన్న.. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆరోగ్య తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించేందుకు మంత్రి శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం కొల్లూర్, సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి, సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి దోమల ఆవాసాలైన మురికి కాల్వలు, ఇళ్లలో వ్యర్థ వస్తువులు, పాత ఇండ్లు మొదలైన వాటిని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు చేయడం వల్ల 15 కోట్ల మంది మరణిస్తే.. దోమలు కుట్టడం కారణం గా 20 కోట్ల మంది మరణించారని పేర్కొన్నారు. రాజమణమ్మా నీ ఇల్లే ఇలా ఉంటే ఏలా? ‘నీవు ఆశా వర్కర్‌వు.. ఆరోగ్య సేవలు, పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నీమీద ఉంది.. నీ ఇల్లే ఇలా ఉంటే ఏలా అమ్మా’.. అంటూ తడ్కపల్లి గ్రామంలోని ఆశావర్కర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించడంలో భాగంగా ఆయన ఆశావర్కర్ రాజమణి ఇంటికి వెళ్లారు. -
కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద మరో దుర్ఘటన జరిగింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ప్రాంతానికి సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ ఆల్టో కారు దగ్ధం కావడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. కారులో సజీవ దహనమైన మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెండ.. ఎంతో అండ
సాగుతో బోలెడు లాభాలు మంచి ఫలితాలను సాధిస్తున్న రైతులు జిల్లాలో పెరుగుతున్న విస్తీర్ణం గజ్వేల్ ఉద్యాన శాఖాధికారి చక్రపాణి సలహాలు, సూచనలు గజ్వేల్: బెండసాగుతో రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు కురగాయల సాగువైపు మళ్లుతుండగా.. ఇందులో బెండ కీలకమైనదిగా మారుతున్నది. ఈ పంట సాగు విస్తీర్ణం రోజురోజూకు పెరుగుతున్నది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అనుకున్న ఆదాయం పొందవచ్చని గజ్వేల్ ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి (8374449345) తెలిపారు. ఈ పంట సాగుకు సంబంధించి సలహాలు, సూచనలు అందించారు. వాతావరణం వేడి వాతావరణం అనుకూలం. అతిచల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడమే శ్రేయస్కరం. విత్తన మోతాదు వర్షాకాలపు పంటకు ఎకరానికి 4-6 కిలోలు, వేసవి పంటకు 7-8కిలోలు, సంకరజాతి రకాలైతే 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన రకాలు పర్బనిక్రాంతి: కొమ్మలు వేయకుండా మొక్క బలంగా పెరుగుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. ఎకరాకు 4, 4.5 టన్నుల దిగుబడి వస్తుంది. అర్కఅనామిక: విత్తిన 55రోజుల్లో కాపుకు వస్తుంది. శంఖు రోగాన్ని కొంతవరకు తట్టుకోగలదు. కాయలు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. ఈ రకం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడు వస్తుంది. అర్కఅభయా: అర్కఅనామిక రకాన్ని పోలివుండి శంఖు రోగాన్ని బాగా తట్టుకుంటుంది. ఈ రకం ఎకరాకు 4-5 టన్నుల దిగుబడిని ఇచ్చే అవకాశముంది. ఈ రకాలతో 90 రోజుల్లోపు పంట చేతికి వస్తుంది. ఇవే కాకుండా సంకరజాతికి చెందిన వర్ష, విజయ్, విశాల్, నా«ద్శోభ, మహికో హైబ్రిడ్ 10, 64, ప్రియా, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, యూఎన్ 7109, తులసి తదితర రకాలు కూడా సాగుచేసుకోవచ్చు. విత్తే పద్ధతి నేలను 4-5సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60సె.మీల ఎడంతో బోదెల మీద 30సెం.మీ దూరంలో విత్తుకోవాలి. వేసవికాలం పంటలో నేలను మళ్లుగా చేసి వరుసల మధ్య 45సెం.మీ, మొక్కల మధ్య 15-20 సెం.మీ దూరం ఉండేట్లు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకు రెండో తడి నీరు ఇవ్వాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్, 4గ్రా.ల ట్రైకోడెర్మావిరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు చివరి దుక్కిలో ఎకరాకు 6-8టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24కిలోల భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 45 కిలోల నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి 1/3వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3వంతును రెండు భాగాలుగా విత్తిన 30, 45వ రోజున వేయాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదును సుమారు 50శాతం పెంచాలి. కలుపు నివారణ, అంతర కృషి పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు 1.2లీటర్ చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటిరోజునగానీ పిచికారి చేయాలి. విత్తిన 25, 30రోజులపుడు గొర్రు లేదా గుంటుకతో అంతర కృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు సరిచేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20-25శాతం నత్రజని ఆదాతో పాటు అదిక దిగుబడి పొందవచ్చు. నీటి యాజమాన్యం వర్షాకాలంలో సక్రమంగా వర్షాలు రాకపోతే 7-8 రోజులకోసారి నీరు పెట్టాలి. వేసవి పంటకు ప్రతి 4-5 రోజులకొకసారి నీరు పెట్టాలి. సమగ్ర సస్యరక్షణ ఒక ఎకరాకు 100కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయ తొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చాలి. అంతే కాకుండా ఎకరానికి 4చొప్పున పసుపురంగు పూసిన రేకులకు ఆముదం, గ్రీసు పూసిపెట్టి తెల్లదోమను ఆకర్షింపజేయాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామ బదనికలను పూత దశలో వారానికి ఒకసారి చొప్పున 4సార్లు విడుదల చేయాలి. విడుదల సమయంలో పురుగు మందులు వాడొద్దు. రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్, ఫిఫ్రోనిల్, డైమీతోయెట్ మందుల్లో ఏదేని ఒకదానిని లీటరు నీటికి 2మి.లీ.చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా.ల ఎసిఫెట్ను ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్ 3 గ్రా. లేదా ఫ్రొఫెనోఫాస్ 2మి.లీ ఒకలీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. -
పోలీసు తీరుపై వెల్లువెత్తిన నిరసన
గజ్వేల్: గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద శనివారం పోలీసు తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఫలితంగా పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయగా...గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో కేంద్రానికి కొద్ది దూరంలో కొందరు గుమిగూడటం గమనించి అక్కడికి వచ్చిన ఓ ఎస్ఐ .. నవీన్ అనే యువకుణ్ని కొట్టడంతో గ్రామస్తులు అగ్రహానికి గురయ్యారు. తాము ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా...అకారణంగా దాడిచేస్తారా? అంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎంపీటీసీ అంజిరెడ్డి మద్దతు పలికి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. కొందరు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ఓటు వేయబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, తహశీల్దార్ బాల్‌రెడ్డి, బేగంపేట ఎస్ఐ అనిల్‌కుమార్‌లు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులను నచ్చజెప్పి పోలింగ్ ప్రక్రియ యథావిధిగా సాగేలా చూశారు.