breaking news
Financial scandals
-
బ్యాంకింగ్‌లో బయోమెట్రిక్స్!
బయోమెట్రిక్స్ టెక్నాలజీపై బ్యాంకుల దృష్టి కంఠస్వరం గుర్తింపును అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ రుణాల్లో వేలిముద్రల్ని వినియోగిస్తున్న హెచ్డీఎఫ్సీ బయో గుర్తింపుతో మోసాలకు ముకుతాడు పాస్వర్డ్లు, పిన్ నంబర్ల అవసరం ఉండదు బయో ఏటీఎంల వినియోగానికి ప్రభుత్వం కూడా ఓకే ఆర్థిక మోసాలు జరగని రోజు ఒక్కటైనా ఉందా? క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు, పిన్ నంబర్ల చౌర్యంతో కుర్రాళ్ల నుంచి వృద్ధుల దాకా అందరినీ బురిడీ కొట్టిస్తున్నారు నయా వంచకులు. మరి వీటన్నిటి నుంచీ బయటపడాలంటే..? మన కార్డును వేరొకరు ఉపయోగించి మనని లూటీ చేయకూడదంటే..? ఇదిగో... ఇలాంటి టెక్నాలజీపైనే కసరత్తు చేస్తున్నాయి బ్యాంకులు. కస్టమర్ల వేలి ముద్రలు, కంఠస్వరం లేదా రెటీనా స్కాన్లను ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సురక్షితంగా, సులభంగా, మోసాలకు తావులేకుండా నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నాయి. బయోమెట్రిక్స్గా పిలిచే ఈ టెక్నాలజీని విదేశాల్లో ఇప్పటికే సమర్థంగా వాడుతున్నారు. మన దేశంలోనూ వేగంగా రాబోతున్న ఈ టెక్నాలజీ వివరాలివీ... టెక్నాలజీ వేగంగా మారిపోతోంది. మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, ఎవరి ఖాతాకైనా డబ్బులు పంపించాలన్నా బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎంల ద్వారానో లేదా ఆన్లైన్లోనో లేకుంటే మొబైల్ ఫోన్ల ద్వారానో బ్యాంకింగ్ లావాదేవీలు కానిచ్చేయొచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు రుణాలు సైతం ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల ద్వారా వివిధ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ ఇప్పుడు ఈజీ అయిపోయింది. అయితే వీటిలో ఎంత సౌకర్యం ఉందో... అంతకన్నా ఎక్కువ రిస్కూ ఉంది. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే మనం అనేకమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలి. వీటన్నిటికీ తోడు టెక్నాలజీ కన్నా వేగంగా పరిగెడుతున్నారు నేరగాళ్లు. రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకునే మార్గాల్లో భాగంగానే బయోమెట్రిక్ పరికరాలను తెస్తున్నాయి. బయొలాజికల్ ఐడెంటిఫికేషన్స్ ద్వారా ఖాతాకు లాగిన్ అవటంతో పాటు, వాటి సాయంతోనే ఏటీఎం, ఫోన్ లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది సురక్షితమైన విధానం. లోపాలు లేనిది కూడా. దీంతో ఇక పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. ఏమిటీ బయోమెట్రిక్స్... బయోమెట్రిక్స్ అంటే బయోలాజికల్ డేటాను విశ్లేషించే శాస్త్రం. ప్రస్తుతం ఇది వ్యక్తుల గుర్తింపు(ఐడెంటిటీ)లో బాగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ కౌంటర్లు బయోమెట్రిక్స్‌ను బాగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాణికుల వేలిముద్రలను, ఐరిస్ స్కాన్ల ద్వారా వారిని కచ్చితంగా, సరిగ్గా గుర్తించగలుగుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోనూ బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. అరచేతిని స్కాన్ చేయడం, వేలిముద్రల స్కానింగ్, రెటినా స్కాన్, కంఠస్వరం గుర్తింపు, ముఖాన్ని గుర్తించటం వంటి పలు టెక్నిక్లను బ్యాంక్‌లు వినియోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఫింగర్‌ప్రింట్ సెన్సింగ్ అనేది సాధారణ బయోమెట్రిక్ గుర్తింపు విధానం కానుంది. ఖాతాదారులు ఏటీఎంకు వెళ్లి స్క్రీన్‌పై వేలిముద్ర వేస్తే చాలు. అకౌంట్‌కు లాగిన్ అయి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే జపాన్,అమెరికాల్లోని ఏటీఎంల్లో బయోమెట్రిక్ అథంటికేషన్ డివైస్‌లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలకైతే ఖాతాదారుడు తన వేలి ముద్రను స్మార్ట్‌ఫోన్ లెన్స్‌కు టచ్ చేస్తే చాలు, అది స్కానై బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. తొలి బ్యాంకు.. ఐసీఐసీఐ దేశంలో బయోమెట్రిక్స్‌ను ఉపయోగించిన తొలి బ్యాంక్ ఐసీఐసీఐ అని చెప్పొచ్చు. కంఠస్వరం గుర్తింపు విధానాన్ని ఈ బ్యాంక్ వినియోగంలోకి తెచ్చింది. దీనికోసం ఖాతాదారుల వాయిస్ శాంపిల్స్‌తో కూడిన డేటాబేస్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరంభించింది. బ్యాంక్ రికార్డుల్లో ఉన్న ఖాతాదారుల నమోదిత ఫోన్ నంబర్ల నుంచి ఖాతాదారులు ఫోన్ చేస్తేనే ప్రస్తుతం వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఇన్స్టంట్ రుణాలందజేయడానికి ఈ బయోమెట్రిక్స్ టెక్నాలజీని వాడుతోంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వేలిముద్రను బ్యాంక్ బ్రాంచీలో ఉన్న డివైస్ ద్వారా సేకరిస్తారు. దీనికి ఆధార్ నంబర్‌ను జతచేసి ఆ వ్యక్తి వివరాలను తెలుసుకుంటారు. కొంత అదనపు సమాచారం సేకరించి కేవలం అరగంటలో కారు/ లేదా వ్యక్తిగత రుణాన్ని అందిస్తారు. ఇతర బ్యాంక్‌లు కూడా మున్ముందు ఈ దార్లో నడవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఐరిస్, కంఠస్వరం కూడా కంఠ స్వరం గుర్తింపు విధానాన్ని ఇప్పుడిప్పుడే భారత్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో ఫోన్ బ్యాంకింగ్ లావాదేవీల్ని సురక్షితంగా నిర్వహించుకోవచ్చు. కంటి రెటినా(ఐరిస్)ను స్కాన్ చేసి, మొబైల్ ఫోన్ల ద్వారా, లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల నుంచి ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. భవిష్యత్తులో మరింత విస్త ృతంగా.. బ్యాంకింగ్ రంగంలో బయోమెట్రిక్స్ విని యోగం ప్రస్తుతం తక్కువే అయినా... మున్ముందు విస్తృతమవుతుందన్నది సాంకేతిక నిపుణుల అంచనా. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్స్‌ను ప్రస్తుతం 35కు పైగా దేశాలు వాడుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా బయోమెట్రిక్ ఏటీఎంల వినియోగానికి పచ్చజెండా ఊపింది. మోసాలు జరిగే అవకాశాలు లేకపోవడం, భద్రత అధికంగా ఉండడం వల్ల పలు బ్యాంకులు దీనికి సై అంటున్నాయి. ప్రతికూలతలూ ఉన్నాయ్... బయోమెట్రిక్స్ ఉపయోగించేందుకు వివిధ ప్రమాణాలకు సంబంధించి అస్పష్ట అంశాలు చాలానే ఉన్నాయి. బయోటెక్నాలజీ కూడా పూర్తిగా లోపాల్లేని వ్యవస్థ అని చెప్పలేమని నిపుణులంటున్నారు. పూర్తి స్థాయి సురక్షిత వ్యవస్థగా బయోమెట్రిక్స్ రూపొందేవరకూ ఇతర అథంటికేషన్ మార్గాలను కూడా అనుసరించాలని వారు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏటీఎం వద్దకు ఖాతాదారుడు వెళ్లలేకపోవచ్చని, తన బదులు వేరొకరు లావాదేవీలు జరిపే అవకాశాలు లేకపోవటమన్నది దీన్లో ఉన్న లోపమని వారు చెబుతున్నారు. ఇలాంటి పలు సమస్యలను ఈ విధానం ఇంకా అధిగమించాల్సి ఉంది. -
టీడీపీ నేతపై చీటింగ్ కేసులు
- ఊట్ల నాగేశ్వరరావుపై ఆరోపణల వెల్లువ - అమాయకుల్ని మోసగించి కోట్ల రూపాయలు కైంకర్యం సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలు మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు ఊట్ల నాగేశ్వరరావు ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు విక్రయిస్తామంటూ నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. పెనుగంచిప్రోలు పోలీసుస్టేషన్లో ఇప్పటికే ఊట్లపై ఒక కేసు నమోదు కాగా మరొకరు ఫిర్యాదుచేశారు. ఊట్ల మోసాల చిట్టా ఊట్ల నాగేశ్వరరావు ఆయన కుమారుడు ఊట్ల గోపీచంద్, కుమార్తె దండెం సుభాషిణి, జెడ్పీ మాజీ సభ్యుడు గజ్జి కృష్ణమూర్తి రూ.60 లక్షలకు మోసం చేశారంటూ వారిపై కొందరు ఫిర్యాదుచేయగా పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వరరావు తన కుమార్తె, కుమారుడు పేర్లతో సిరంగి ధనమ్మ నుంచి 1.26 ఎకరాల భూమిని 2010లో కొన్నారు. దీనిని ఖమ్మంలోని ఏలూరు వెంకటేశ్వర్లుకు 2011 నవంబర్ 28న రూ.99.44లక్షలకు విక్రయించేందుకు సిద్ధమై స్టాంపు వెండర్ కూడా అయిన గజ్జి కృష్ణమూర్తి సహకారంతో రూ.60లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ తరువాత మిగిలిన సొమ్ము చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెంకటేశ్వర్లు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వెంకటేశ్వర్లు నందిగామ డీఎస్పీకి ఫిర్యాదు చేయగా నిందితులపై క్రైం నం: 43/15 కేసు నమోదుచేశారు. మరో వ్యవహారంలో విజయవాడ గుణదలలోని తమ వెంచర్‌లోని పది సెంట్లు విక్రయించేందుకు రూ.10.50 లక్షలతో ఊట్ల ఒప్పందం కుదుర్చుకుని 2013 జూన్‌లో రూ.10లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని మన్నే పద్మజ ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత తాను ఎన్నిసార్లు కోరినా అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు. వెకేషన్ కోర్టుకు వెళ్లగా ఇంజంక్షన్ ఆర్డరు ఇచ్చారన్నారు. గత వారం పెనుగంచిప్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశానన్నారు. నాగేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన రమణమ్మ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.9లక్షలు తీసుకుని రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఏడు లక్షలు ఇవ్వకపోవడంతో ఆమె కోర్టుకు వెళ్లారు. మరో సంఘటనలో హుజూర్‌నగర్‌కు చెందిన రవి అనే స్టాఫ్‌వేర్ ఉద్యోగి వద్ద నాగేశ్వరరావు కుమారుడు ఇళ్ల స్థలాలు విక్రయిస్తామని చెబుతూ రూ.40లక్షలు తీసుకుని చెల్లించకపోతే రవి చెక్ బౌన్స్ కేసు వేశారు. కాగా తనపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టిస్తున్నారని నాగేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదులో తాను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నానన్నారు. రమణమ్మ కేసును పెద్దల సమక్షంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు : సతీష్, ఎస్ఐ ఏలూరు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఊట్ల నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశాం. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. మన్నె పద్మజ ఇప్పటికే కోర్టుకు వెళ్లినందున నాగేశ్వరరావును, ఆయన కుటుంబసభ్యులు అరెస్టు చేయలేకపోతున్నాం.