ఘరానా మోసగాళ్ల గుట్టురట్టు
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: నకిలీ లెసైన్స్‌లు, లారీల ఆర్సీ, వే బిల్లులు, నంబర్ ప్లేట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పదకొండు మందిని అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్‌రావు నిందితుల వివరాలను, వారు మోసాలకు పాల్పడిన తీరును వివరించారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాకూరి శ్రీనివాస్, కరుతూరి కిషోర్‌బాబు, ఇల్లా దుర్గారావు, వంగర లోకేశ్వరరావు, రల్లే శ్రీను,పారెపల్లి శ్రీను, దేశబత్తుల వెంకట్రావు, జాలం దాసు, కొల్లేటి సుబ్రమణ్యం, ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ఛత్తీస్పూర్ జిల్లాకు చెంది న నీలం పవన్‌కుమార్ అలియాస్ చిన్నా, నల్లగొండ జిల్లాకు చెందిన దీపాల నర్సింహారెడ్డిలతో పాటు నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడిన వీరంతా రాజమండ్రిలో ఓ ముఠాగా ఏర్పడ్డారు. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని నకిలీ లెసైన్స్‌లు, ఆర్సీ, వేబిల్లులు సృష్టించారు. తమ లారీల్లో సరుకులను రవాణా చేస్తామని వ్యాపారులను నమ్మించేవారు. నకిలీ పత్రాలు వ్యాపారులకు చూయించి సరుకులను తమ లారీల్లో లోడ్ చేసుకుని చేరవేయాల్సిన చోటకు కాకుండా మరో ప్రాంతానికి తరలించేవారు.
మోసాలకు పాల్పడింది
ఎక్కడెక్కడంటే..
వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, నల్లగొండ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో ధాన్యం, బియ్యం, నూనె, జొన్నలను తమ లారీల్లో రవాణా చేస్తామని మోసాలకు పాల్పడ్డారు. పదహారు నెలలుగా సాగుతున్న ఈ దందాతో రూ.1.25 కోట్ల విలువ గల ధాన్యం ఇతరత్రా నిల్వల ను కోదాడలోని ఓపాడుబడిన మిల్లులో దాచి ఉంచారు.
పట్టుబడింది ఇలా..
ఇటీవల కోదాడ- హుజూర్నగర్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీ లు నిర్వహించారు. వారిలో కొన్ని లారీల వేబిల్స్, ఆర్సీ, లెసైన్స్‌లు నకిలీవని తేలాయి. వెంటనే ఆ లారీల డ్రైవర్లు, క్లీనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీం తో ముఠాలోని 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరి వద్ద నుంచి రూ.1 కోటి 25 లక్షల విలువైన వివిధ రకాల ధాన్యం నిల్వలను, 6 లారీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠాలోని మరో నలుగురు కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు. కేసును శోధించిన మిర్యాలగూడ డీఎ స్పీ సుభాష్‌చంద్రబోస్, హుజూర్నగర్ సీఐ బలవంతయ్య, ఎస్ పవన్‌కుమార్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది బల రాంరెడ్డి, శ్రీనివాస్, రంగరావు, రాం బాబు, నాగేశ్వరరావు, శ్రీను, సత్యం, హరినాయక్, వెంకటేశ్వర్లు, రమణారెడ్డిలను ఎస్పీ అభినందించారు.