breaking news
donabanda
-
బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల/జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ శివారులోని ఓ క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు దొర్లిపడటంతో వాటికింద చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. మృతుల్ని బత్తుల దుర్గారావు (19), సున్నా బీబీనాయక్ (40), బాగేల్ రాందేవ్ (36)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన బీబీ నాయక్, బాగేల్ రాందేవ్, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించేందుకు కొండపైకి ఎక్కారు.ఒడిశాకు చెందిన కుమారి బోలీ దిగువన ఉన్న బండరాళ్లను పగులకొట్టేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన ఉన్న రాళ్లను తొలగించే క్రమంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు ముగ్గురిపైనా పడటంతో విగతజీవులుగా పడి ఉన్నారు. బోలీ అనే యువకుడు సురక్షితంగానే ఉన్నాడు. మృతదేహాలను 5 గంటలపాటు శ్రమించి జేసీబీల సాయంతో వెలికితీశారు. క్వారీ యజమాని చింతల రామ్మోహనరావు నిర్లక్ష్యమే కార్మికుల పాటి మృత్యుపాశంగా మారింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆపకుండా పని చేయించటం ముగ్గురు కార్మికులను మృత్యు ఒడికి చేర్చాయి.ఘటనా స్ధలాన్ని జిల్లా మైనింగ్ ఏడీ వీరాస్వామి, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బి.రవికిరణ్, నందిగామ ఆర్డీఓ ఎ.రవీంద్రరావు, నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ యువకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పీవీఎస్ సుబ్రహ్మణ్యం, హేమలత, తహసీల్దార్ సుస్వాగతం పరిశీలించారు.సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలుప్రమాదం జరిగిన క్వారీలో మైనింగ్ సేఫ్టీ నిబంధనల్ని క్వారీ యజమాని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేయడంతోనే అక్కడ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలో ప్రతి 6 మీటర్లకు బెంచ్ ఫార్మేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు లూజును తీసివేయాల్సి ఉండగా.. అక్కడ బెంచ్ ఫార్మేషన్ చేయలేదని గుర్తించారు. మైనింగ్ సేఫ్టీకి సంబంధించి క్వారీలో ఓ మేనేజర్‌ను నియమించాల్సి ఉన్నా అలా చేయలేదు.రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కొండ చరియలు విరగటంతోపాటు, అక్కడ ఉన్న లూజు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా బోల్డర్లను డ్రిల్లింగ్ చేయటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కాగా.. క్వారీలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 801 సర్వే నంబరులో 99 లీజులు ఉన్నప్పటికీ ఏ క్వారీ యజమాని నిబంధనలు పాటించటం లేదు. క్వారీ యజమానులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోపాటు, అధికారులు సైతం మామూళ్లు తీసుకొని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండాపోయింది.మూడు కుటుంబాల్లో విషాదంమృతుల్లో ఒకరైన బీబీ నాయక్ 15 సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చి జి.కొండూరు మండలం చెవుటూరు బాపూజీ కాలనీలో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగేల్ రాందేవ్ సైతం ఒడిశా నుంచి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి భార్య, కుమార్తెతో చెవు టూరు శివారులోని క్వారీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పొట్ట కూటి కోసం క్వారీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రమాదంలో మృతి చెందిన బత్తుల దుర్గారావు చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో చెరువు మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.క్వారీ యజమానిపై కేసు నమోదుక్వారీ యజమాని చింతల రామ్మోహనరావుపై కేసు నమోదు చేసినట్టు నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడు దుర్గారావు తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.8.50 లక్షల చొప్పున క్వారీ యజమాని అందజేశారు.నా కళ్లెదుటే మరణించారుబీబీ నాయక్, రాందేవ్, దుర్గారావు కొండపైకి వెళ్లి రాళ్లను తొలగించే క్రమంలో పైనుంచి భారీ బండరాళ్లు వారిపై పడ్డాయి. దీంతో రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. నా కళ్లెదుటే ముగ్గురూ మరణించారు. – కుమారి బోలీ, సహ కార్మికుడుభద్రతా చర్యలు చేపట్టకపోవడమే కారణంసర్వే నంబర్ 801లో రెండు హెక్టార్ల రాతి క్వారీని చింతల రామ్మోహనరావు పదేళ్లపాటు లీజుకు పొందారు. మైనింగ్ ప్లాన్, సేప్టీ మెజర్మెంట్స్ లేకపోవటం, బెంచీలు ఏర్పాటు చేయకపోవటం, సిస్టమాటిక్ మెజర్మెంట్స్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ -
మంచిర్యాల: మమ్మీ.. నా రోగం ఎంతకీ తగ్గదేమోనే!
మంచిర్యాల రూరల్(హాజీపూర్): మాయదారి జబ్బు.. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొంది. అదేం జబ్బో అర్థంకానీ తల్లిదండ్రులు.. ఎంతకీ తగ్గదేమో అనే దిగులుతో.. ఆ కుటుంబం వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన ఆ టీనేజర్ చివరకు ప్రాణం తీసుకుంది. హాజీపూర్ మండలంలోని దొనబండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రచన, సత్తయ్య దంపతుల కుమార్తె కోట హారిక (19). మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హారిక డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పలు ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స కోసం ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హారిక బాబాయ్ కోట స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎస్ఐ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హజీపూర్(మంచిర్యాల జిల్లా): హజీపూర్ మండలం దొనబండకు చెందిన హరీష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హజీపూర్ ఎస్ఐ తహసీనోద్దీన్ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హరీష్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. -
దొనబండ క్వారీలో విషాదం
విజయవాడ : కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ క్వారీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. క్వారీలో పనులు చేస్తున్న ఇద్దరు కార్మీకులు 100 అడుగులపై నుంచి కిందపడ్డారు. దీంతో రూబెన్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచర కార్మికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్టు మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోలు బంక్ సమీపంలో '108' దగ్ధం
విజయవాడ: అంబులెన్స్‌లో నుంచి ఆక్సిజన్ సిలిండర్ మార్చుతుండగా.. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 108 వాహనం కాలిపోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనబండ పెట్రోల్‌బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. మూడు రోజుల కిందట 108 వాహనం మొరాయించడంతో అధికారులు ఆ వాహనాన్ని దొనబండ పెట్రోల్‌బంక్ సమీపంలో వదిలి వెళ్లారు. అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ అవసరం రావడంతో.. బుధవారం అర్ధరాత్రి చెడిపోయిన వాహనంలోని సిలిండర్‌ను మరో వాహనంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మంటలంటుకున్నాయి. ఆ వాహనంలో డ్రైవర్‌తో పాటు వైద్య సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన వీళ్లు వెంటనే వాహనాన్ని పెట్రోల్‌బంక్ నుంచి దూరంగా తీసుకెళ్లారు. వారు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 108 వాహనం పూర్తిగా కాలిపోయింది.