breaking news
delhi cm office
-
పార్లమెంటులో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంఓ కార్యాలయంపై సీబీఐ దాడులు చేయటం.. సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడి అంటూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పార్లమెంటులో మండిపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ దాడుల అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించారంటూ విపక్షాలు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో విపక్షాల ఆగ్రహం, ఆందోళనలతో సభ మూడుసార్లు వాయిదా పడింది. ‘‘ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. దేశంలో సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన అంశం’’ అని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఆయనతో గళం కలుపుతూ.. ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేస్తోందని ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీలు, జేడీయూ సభ్యులు కూడా తమ స్థానాల్లో నిల్చుని సర్కారుపై నిరసన వ్యక్తంచేశారు. విపక్షాల ఆందోళనకు ఉభయసభల్లోనూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేయలేదన్నారు. ఓ సీనియర్ అధికారి అవినీతి కేసులో ఉన్నారని.. ఆయన కార్యాలయంలో మాత్రమే దాడులు జరుగుతున్నాయన్నారు. -
కొట్లాడటం ఆ సీఎంకు ఫ్యాషనైపోయింది
పదే పదే కేంద్రప్రభుత్వంతో కొట్లాడటం, ప్రతి విషయానికీ ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఫ్యాషనైపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరగడం.. దానిపై ప్రధానిని విమర్శిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేయడంతో వెంకయ్యనాయుడు స్పందించారు. సీబీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడంలేదని, అలా పనిచేసే రోజులు కాంగ్రెస్‌తోనే పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు సీబీఐ ఒక స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం అందులో ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎలా విమర్శిస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ప్రధానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ మీద తాము కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వివరించాయి. గత కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు చెందిన టెండర్లన్నింటినీ ఒకే సంస్థకు కేటాయించడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్నారని, దీనిపై తాము వారంట్లు తీసుకుని ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు చేస్తున్నామని సీబీఐ తెలిపింది.