breaking news
CS Mahanti
-
రూపాయి బాకీ ఉండొద్దు..
జాతరలోపు ఎవరి బిల్లులు వారికే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ మహంతి హన్మకొండ, న్యూస్‌లైన్ : ‘నిధులున్నప్పుడు వెనుకాడొద్దు. జాతరకు సంబంధించి ఆయా విభాగాలకు చెల్లించాల్సిన బిల్లులన్నీ ఇచ్చేయండి. ఒక్క రూపాయి కూడా బాకీ ఉండొద్దు’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. కలెక్టరేట్లో జాతర నిర్వహణ, నిధుల వినియోగంపై మంగళవారం సమీక్ష నిర్వహించిన ఆయన పెండింగ్ బిల్లులపై నివేదికలు తీసుకున్నారు. విద్యుత్, ఆర్టీసీకి చెల్లించాల్సిన పాత బిల్లులపై అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం హైదరాబాద్ నుంచి మరోసారి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ, గిరిజనాభివృద్ధి శాఖల నుంచి పెండింగ్‌లో ఉన్న జాతర బిల్లులను వెంటనే చెల్లిం చాలని సూచించారు. విద్యుత్ శాఖ ఏర్పాట్ల బిల్లు రూ.1.12కోట్లను ప్రత్యేక ఫండ్ నుంచి విడుదల చేస్తున్నట్లు సీఎస్ ఆ శాఖకు సూచించారు. దీనిపై ఫ్యాక్స్ ద్వారా సమాచారమిచ్చారు. 2004 జాతర నుంచి వినియోగించిన విద్యుత్ బిల్లులు బాకీపడిన విషయం విదితమే. దేవాదాయ శాఖ నుంచి కేవలం వినియోగించిన విద్యుత్ బిల్లు(ఎనర్జీ చార్జెస్) ఇవ్వాలని ఇటీవల డిమాండ్ పెట్టారు. అయితే జాతరలో దుకాణాలు, ఇతర కమర్షియల్ సర్వీసుల నుంచి వసూలు చేసిన బిల్లులపై సమగ్ర నివేదికలను సిద్ధం చేశారు. ఏర్పాట్ల బిల్లులు మినహాయిస్తే.. జాతర లైట్లు, అమ్మవార్ల గద్దెలు, సేవలందించిన అధికారులు, సిబ్బంది ఉన్న తాత్కాలిక ఏర్పాట్ల కోసం వినియోగించిన విద్యుత్‌కు రూ.40లక్షల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. దీంతో దేవాదాయ శాఖ నుంచి ఎనర్జీ చార్జెస్కు రూ.40లక్షలను వెంటనే ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులిచ్చారు. వీటిని రెండు రోజుల వ్యవధిలోనే చెల్లించాలన్నారు. మంచినీటి సరఫరా కోసం మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో చేసిన పనులకు వాడుకున్న బిల్లులను సైతం వెంటనే చెల్లించాలని సూచించారు. ఇప్పటివరకు ఇరిగేషన్ నుంచి విద్యుత్ శాఖకు రూ.11లక్షలు పెండింగ్ బిల్లు ఉంది. వీటిని సైతం రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి స్నానఘట్టాలు, ఇతర పనుల కోసం వినియోగించిన విద్యుత్‌కు రూ.10లక్షలు బాకీపడ్డారని, ఆ శాఖ నిధుల నుంచి బిల్లులు ఇచ్చేయాలని ఆదేశాలిచ్చారు. జాతర నిధుల నుంచి విద్యుత్ శాఖకు రూ.10లక్షలు కేటాయించి డీడీలివ్వాలని ఉత్తర్వులిచ్చారు. కాగా, రూ.కోటిని రెండు శాఖల నుంచి ఆర్టీసీకి ఇవ్వాలని సీఎస్ ఆదేశాలిచ్చారు. -
12 అర్ధరాత్రి నుంచి ఎపిఎన్జిఓల సమ్మె
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న ఎపిఎన్జిఓ సంఘం సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఈ నెల 12 అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టాలని ఎపిఎన్జిఓ సంఘం నేతలు తీర్మానించారు. ఈ మేరకు వారు సమ్మె నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి అందజేశారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వారు ఆరోపించారు. దీన్ని తాము సహించమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. జీతాలు నష్టపోయినా, ఉద్యోగాలకే ప్రమాదం వచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ డిమాండ్‌లో మార్పు ఉండదని సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఎపి ఎన్జీఓలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యలు అలజడిని సృష్టించాయి. దాంతో ఎపి ఎన్జీఓలు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు. ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చారు.