breaking news
Community Center
-
అమెరికాలో ఎన్ఆర్ఐల అతిపెద్ద కమ్యూనిటీ సెంటర్
ప్రవాస భారతీయులకు సంబంధించి అమెరికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. జూన్ 15న ఇల్లినాయిస్లోని షాంబర్గ్‌లో మొట్టమొదటి, అతిపెద్ద యూఎస్ ఇండియన్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అహింసా విశ్వభారతి వ్యవస్థాపకుడు ఆచార్య డాక్టర్ లోకేష్ ముని సమక్షంలో యోగా ఫెస్ట్ నిర్వహించారు.కమ్యూనిటీ, సాంస్కృతిక, వినోద కేంద్రం అయిన ఈ హబ్ భారతీయ అమెరికన్ల ఐక్యతకు దోహదం చేస్తుంది. లాభాపేక్షలేని కేంద్రం లక్ష్యం అన్ని యూఎస్ కమ్యూనిటీలను, అన్ని వయసుల వర్గాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి రూపొందించిన సమగ్ర సేవలు, కార్యకలాపాలను అందించడం, ఆశావాదం, పురోగతి భావాన్ని పెంపొందించడం.1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన క్లాస్-ఏ భవనమైన నేషనల్ ఇండియా హబ్‌ను కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, చికాగో ఇండియన్ కాన్సులేట్ గౌరవ కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి, రాయబారి డాక్టర్ ఔసఫ్ సయీద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నేషనల్ ఇండియా హబ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇది యూఎస్‌లో మోడల్ కమ్యూనిటీ సెంటర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నేషనల్ ఇండియా హబ్ ఫౌండర్, చైర్మన్ హరీష్ కొలసాని వార్తా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్రం లక్ష్యం, విజన్ ను పంచుకున్నారు. ఈ ఐకానిక్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నిలుస్తుందని, సరిహద్దులు లేకుండా సమాజానికి సేవ చేయడానికి అంకితమైన 60కి పైగా సేవా సంస్థలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకే గొడుగు కింద అత్యధిక సేవా సంస్థలను కలిగి ఉన్న హబ్ ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు అర్హత సాధించిందని వివరించారు. -
మత మౌఢ్యమే సమస్య
మణికొండ (హైదరాబాద్): మందిరాలు, మసీదులు, చర్చిలు ఏవైనా, ఏమతం వారికైనా సాంత్వన చేకూరుస్తాయని.. శాంతిని నెలకొల్పుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని వీలైనంతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరమాత్మను అనేక రూపాలలో ఆరాధించడం మానవజాతి తొలినాళ్ల నుంచీ ఉందని పేర్కొన్నారు. ఆలయాలు సామాజిక కేంద్రాలని (కమ్యూనిటీ సెంటర్లు), అన్ని మతాలు శాంతినే ప్రబోధిస్తాయని చెప్పారు. మతం సార్వజనితమని.. కానీ మత మౌఢ్యం మనిషితో అమానుషమైన పనులు చేయిస్తుందన్నారు. ప్రపంచంలో ఏ మతం హింసను బోధించలేదని.. మధ్యలో వచ్చినవారే దీనిని జతచేసి చిచ్చుపెడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ రూ.200 కోట్లతో 400 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న శ్రీరాధాకృష్ణ, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాల సముదాయం, హెరిటేజ్ టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత పెంపొదిస్తున్నాం ‘‘హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మానవ జీవితాల్లో వేగం పెరుగుతోంది. ఎన్నో సమస్యలు, రోగాల వంటివాటిని జనం ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఆలయాల్లో సాగే భజనలు, కీర్తనలు స్వాంతన చేకూర్చే ఔషధాలుగా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే అత్యద్భుతంగా నిర్మించిన యాదగిరిగుట్ట దేవాలయానికి సర్వత్రా అభినందనలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం..’’అని కేసీఆర్ తెలిపారు. ‘హరేకృష్ణ’సహాకారం గొప్పది హరేకృష్ణ మూవ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహాకారం ఎంతో గొప్పదని సీఎం కేసీఆర్ శ్లాఘించారు. అక్షయపాత్ర, అన్నపూర్ణ పథకం వంటివాటి ద్వారా లక్షలాది మంది ఆకలి తీరుస్తోందన్నారు. ఒక్క ఫిర్యాదు లేకుండా ఒక్కరోజు ఆగకుండా నిర్విరామంగా చేస్తున్న కృషి వారి అంకితభావానికి నిదర్శనమన్నారు. కరోనా వంటి ఉపద్రవాలు వచ్చిన సమయంలో కూడా ముందుకొచ్చి సేవామూర్తులుగా నిలిచారన్నారు. నార్సింగిలో చేపట్టిన ఆలయాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా సేవ అందించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మతమౌఢ్యాన్ని తరిమికొట్టేందుకు హరేకృష్ణ మూవ్మెంట్ వంటి సంస్థలు కృషి చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్ల విరాళం ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుంది హరేకృష్ణ హెరిటేజ్ టవర్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందని.. సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతుందని హరేకృష్ణ మూవ్మెంట్ చైర్మన్ మధు పండిత దాస అన్నారు. తరాలు మారినా తరగని మన అద్భుత సంస్కృతిని ఆస్వాదిస్తూనే.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, జైపాల్‌యాదవ్, హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌరదాస, శ్రీకృష్ణ గోసేవ మండలి కార్యదర్శి సురేశ్‌కుమార్ అగర్వాల్, పలువురు నేతలు, దాతలు పాల్గొన్నారు. -
ఉడతతో ‘కోటి’ కష్టాలు
వాషింగ్టన్: వేలెడంత కూడా లేని ఉడత ‘కోటి’ కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలోని నిర్మాణంలో ఉన్న ఒక భవంతిలో విలువైన సామగ్రిని ధ్వంసం చేసి అధికారులకు చుక్కలు చూపింది. ఇండియానాలోని మెక్మిలిన్ పార్క్‌లో కమ్యూనిటీ సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఒక భవనంలో విద్యుత్ సామగ్రి, ఇతర వస్తువులను ఉంచారు. అయితే అక్కడే ఉన్న ఉడత తనకు కనిపించిన ప్రతీ వస్తువును నాశనం చేసి కనిపించకుండా పోయింది. అధికారులు ధ్వంసం అయిన సామగ్రి విలువను లెక్కతేల్చి చూసే సరికి వారి కళ్లు బైర్లు కమ్మాయి.... ఉడత వల్ల నష్టపోయిన సామగ్రి విలువ ఏకంగా 1.80 కోట్లుగా తేలింది. అయితే దీని వల్ల పెద్ద ఇబ్బంది లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. డ్యామేజీ అయిన సామగ్రికి ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు.