breaking news
Colgate-Palmolive India
-
కోల్గేట్ ఇండియా నుంచి కొత్త బ్రాండ్లు
న్యూఢిల్లీ: కోల్గేట్ (పామోలివ్) ఇండియా భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియో, వ్యాపార విస్తరణపై బలమైన అంచనాలతో ఉంది. సంస్థ అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియో నుంచి మరిన్ని బ్రాండ్లను భారత్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్ ప్రకటించారు. కోల్గేట్, పామోలివ్ బ్రాండ్లపై ఈ సంస్థ నోటి సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుండడం తెలిసిందే. మరిన్ని బ్రాండ్లను తీసుకురావడంపై మాతృ సంస్థతో చర్చిస్తున్నట్టు నరసింహన్ తెలిపారు. ప్రస్తుత బ్రాండ్లతోపాటు కొత్త బ్రాండ్ల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. పామోలివ్ బ్రాండ్‌పై ప్రీమియం బాడీ వాష్, హ్యాండ్ వాష్ విక్రయిస్తుండగా, ఏటా ఈ విభాగం 20–30 శాతం కాంపౌండెడ్ వృద్ధి నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. పామోలివ్ బ్రాండ్‌పై మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడం గురించి ప్రశ్నించగా.. అంతర్జాతీయంగా తమ పోర్ట్‌ఫోలియోలో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయని వివరిస్తూ.. మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టడంపైనే తాము దృష్టి సారించినట్టు ఆమె చెప్పారు. ఇక్కడి వినియోగదారుల అవసరాలకు సరిపోలే ఉత్పత్తులను తీసుకువస్తామని ప్రకటించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే కోల్గేట్ పామోలివ్ 88 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఆదాయంలో 4–5 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత మార్కెట్ ఎంతో కీలకం 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మార్కెట్.. కోల్గేట్ పోమోలివ్ అంతర్జాతీయ వృద్ధికి కీలకమని ప్రభా నరసింహన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత్ వాటా మరింత పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్గేట్కు అంతర్జాతీయంగా టాప్–5 మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత్‌లో మధ్యతరగతి ప్రజలు గణనీయంగా పెరగనుండడం తమకు అద్భుతమైన అవకాశాలను తెచి్చపెడుతుందన్న సంస్థ అంతర్జాతీయ సీఈవో ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ చానళ్లపై మరిన్ని డిజిటల్ ఫస్ట్ బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు ప్రభా నరసింహన్ తెలిపారు. కోల్గేట్ పర్పుల్, మ్యాక్స్ ఫ్రెష్ సెన్సోరీస్ శ్రేణి, మౌత్ వాష్లను కోల్గేట్ ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మరిన్ని ఉత్పత్తులు విడుదల ప్రణాళికతో ఉన్నట్టు ఆమె చెప్పారు. అయితే సంప్రదాయ కిరాణా స్టోర్లు తమ వ్యాపార వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్విక్‌కామర్స్ ఛానళ్లకు అనుకూలంగా ఆన్లైన్లో అధిక డిస్కౌంట్లు ఇస్తుండడంతో కోల్గేట్ పోమోలివ్ ఇండియా ఉత్పత్తులను మహారాష్ట్రలో బహిష్కరించాలంటూ అఖిల భారత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పంపిణీదారుల సంఘం ఇటీవలి ఇచి్చన పిలుపుపై స్పందిస్తూ.. అన్ని ఛానళ్లూ వృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.వినియోగం పుంజుకుంటుంది.. ఈ ఏడాది చివరికి పట్టణ వినియోగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రభా నరసింహన్ వ్యక్తం చేశారు. గ్రామీణ వినియోగ మార్కెట్ బలంగా ఉందంటూ, అదే వృద్ధి ఇకముందూ కొనసాగుతుందన్నారు. ‘‘కోల్గేట్ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్ ఎంతో కీలకంగా ఉంది. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులకు తోడు, ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పట్టణ వినియోగానికి మద్దతుగా నిలుస్తాయి. జనాభాతో పోల్చి చూస్తే గ్రామీణ మార్కెట్ పరిమాణం ఎంతో చిన్నగా ఉంది. తగిన నోటి సంరక్షణ ఉత్పత్తులతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోగలం’’అని వివరించారు. మాస్ మార్కెట్‌తోపాటు ప్రీమియం విభాగాలపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
పేస్ట్, సబ్బు, ఫేస్పౌడర్లు బంద్.. మరో నాలుగు రాష్ట్రాలకు!
ఎఫ్ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. రిటైల్ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది. ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తులైన పౌడర్, సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్. జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్, వాల్‌మార్ట్)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు. మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది. సంబంధిత వార్త: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. -
కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..
Colgate Products Shortage In Maharastra: కోల్గేట్ పేస్ట్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్ పేస్టులు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్ నడుస్తోంది. అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి మ్యాక్స్ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు. కారణం.. ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్ అంటే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) ఛానెల్ నుంచి స్టాక్లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు. కోల్గేట్ స్పందన.. కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్ లివర్ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది. లేఖలు రాసినా.. ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు).. ఎఫ్ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది). లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చదవండి: లేస్ చిప్స్ ‘ఆలు’పై పేటెంట్ రైట్స్ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట -
కోల్గేట్ లాభం రూ.143కోట్లు
ముంబై: ఎఫ్ఎంసీజీ మేజర్ కోల్గేట్-పామోలివ్ ఇండియా 2016-17సంవత్సరానికి క్యూ4 ఫలితాలు ప్రకటించింది. మార్చి 31 ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ .143 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. . కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 142.58 కోట్ల నికర లాభం ఆర్జించామని కాల్గేట్-పామోలివ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 244 కోట్లను నివేదించింది. మొత్తం ఆదాయం రూ. 1177 కోట్లను తాకింది. ప్రకటనల వ్యయాలు 24 శాతం పెరిగి రూ. 144 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 22.1 శాతం నుంచి 23.7 శాతానికి బలపడ్డాయి. అయితే అమ్మకాల పరిమాణం 3 శాతం క్షీణించినట్లు కంపెనీ తెలియజేసింది. టూత్‌పేస్ట్ మార్కెట్ వాటా మాత్రం 47 శాతం నుంచి 55 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. గత క్వార్టర్లో లిక్విడిటీ క్రంచ్ ప్రభావం నుంచి నాలుగవ త్రైమాసికంలో రికవరీ సాధించామని కోల్గేట్ పామోలివ్ (ఇండియా) ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసాం బచలాని ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు. మొత్తం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల లాభాలతో పోటిస్తే, ప్రస్తుతంరూ. 578 కోట్ల నికర లాభాలను సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో కోల్గేట్ 2శాతంపైగా నష్టపోయింది