నాలుగో తరగతి విద్యార్థికి అమానుష శిక్ష
చండీగఢ్: హరియాణాలోని ఓ మదర్సాలో హోం వర్క్ చేయలేదని నాలుగో తరగతి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ చిన్నారిని చైన్లతో కట్టేసి హింసించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఆ బాలుణ్ని కాపాడారు.
సంబంధిత టీచర్లపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరుతూ బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా సోమవారం విద్యార్థి స్కూల్ వర్క్ పూర్తి చేయకుండా, మదర్సా నుంచి ఇంటికి పారిపోయాడని, దీంతో తాము క్రమశిక్షణ చర్యల కింద చైన్లతో కట్టేశామని టీచర్లు చెప్పారు. స్కూల్ సమయంలో ఆ విద్యార్థి ఇంటికి పారిపోకుండా ఉండేందుకు ఇలా చేశామని తెలిపారు. పోలీసులు విచారణ అనంతరం ఇద్దరు టీచర్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు శిశుసంక్షేమ కమిటీ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.