breaking news
civil conflicts
-
సివిల్ వివాదంలో చిలకలగూడ ఎస్సై
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండల పరిధిలోని చిలకలగూడ ఠాణా ఎస్సై కె.రాజేష్ సివిల్ వ్యవహారంలో తలదూర్చాడు. రూ.25 లక్షలకు సంబంధించిన వివాదంలో ఓ వర్గానికి మద్దతిచ్చిన ఎస్సై మరో వర్గానికి చెందిన దంపతులను ఠాణాకు పిలిచి దురుసుగా ప్రవర్తించారు. బాధితులు సోమవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేయించిన ఆయన రాజేష్ పాత్ర నిర్ధారణ కావడంతో అతడిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం పూర్వాపరాలను వివరిస్తూ, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తూ కొత్వాల్ బుధవారం ఓ ఆడియోను పోలీసు అధికారులు/సిబ్బందికి విడుదల చేశారు. ఆ ఆడియో సారాంశమిది... ‘సహోద్యోగులారా పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి నా దృష్టికి వచ్చిన ఓ ఉదంతం తీవ్రంగా బాధించింది. రెండు రోజుల క్రితం (సోమవారం) రాత్రి 9.30 గంటలకు మధ్య వయస్కులైన ఓ జంట కమిషనరేట్‌లో నా దగ్గరకు వచ్చింది. మొదటిసారిగా పోలీసుల వద్దకు వచ్చినట్లు చెబుతూ కన్నీటిపర్యంతమైన ఆ మహిళ చెప్పిన విషయం నాకు విస్మయం కలిగించింది. విద్యాధికులు, సమాజంలో గౌరవంతో బతుకుతున్న వారు చెప్పిన అంశాలు నన్ను మరోసారి ఆలోచింపజేశాయి. ఓ సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసులు ఆమె భర్తను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి లాకప్‌లో ఉంచారు. భార్య ముందే భర్తపై చేయి చేసుకున్నారు. ఠాణాకు వచ్చిన ఆమెను అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్ దాదాపు 30 నిమిషాలు నిర్భంధించడంతో పాటు దుసురుగా ప్రవర్తించారు. తన బంధువులు, న్యాయవాదికి ఫోన్ చేయడానికీ అవకాశం ఇవ్వలేదు. వీరింటికి పోలీసులు వెళ్లింది అధికారిక వాహనంలో కాదు. ఈ వివాదంలో వీరికి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి కారులో. వారి ముందే ఈ దంపతులను తీవ్రంగా అవమానించారు. ఈ వ్యవహారం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ప్రతి అధికారీ/సిబ్బంది ఒక్కసారి ఆలోచించండి... పోలీసులు అంటే ఎలాంటి ఇమేజ్ను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఇదా మన నుంచి సమాజం కోరుకునేది? ప్రభుత్వం మనపై నమ్మకం ఉంచి, ఇన్ని వనరులు సమకూరుస్తున్నది ఇలాంటి వ్యవహారాల కోసమేనా? ఇదే అనుభవం మీకు ఎదురైతే ఎలా ఫీల్ అవుతారు? నగర పోలీసులకు ఇలాంటి సందేశం ఇవ్వాల్సి రావడం ఇబ్బందిగా, బాధగా ఉంది. సర్వకాలసర్వావస్థల్లోనూ ఎదుటి వారి ఆత్మగౌరవాన్ని కాపాడండి. వారి మర్యాదకు భంగం కలగకుండా వ్యవహరించండి’... అంటూ ఉన్న ఆడియోను పోలీసు అధికారిక వాట్సాప్ గ్రూప్ ద్వారా కమిషనర్ షేర్ చేశారు. చిలకలగూడ ఎస్సై రాజేష్‌పై వేటు వేసిన కొత్వాల్ అజమాయిషీ కొరవడిన ఆరోపణలపై ఆ ఠాణా ఇన్స్పెక్టర్ను సంజాయిషీ కోరినట్లు తెలిసింది. -
ఇద్దరు ఎస్సైలు, ఏసీపీపై కేసు నమోదు
హైదరాబాద్: సివిల్ తగాదాలో జోక్యం చేసుకుని ఓవ్యక్తిని చితకబాదిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్సైలతోపాటు ఒక ఏసీపీ అధికారిపై కేసు నమోదు చేశారు. సంతోష్‌రెడ్డి అనే వ్యక్తికి మరొకరితో భూ వివాదం ఉంది. ఈ విషయమంలో జోక్యం చేసుకున్న మీర్‌పేట పోలీసులు సంతోష్‌రెడ్డిని కొట్టారు. దీనిపై బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అతడు చెప్పింది వాస్తవమేనని తేలడంతో ఉన్నతాధికారులు.. జీవన్‌ప్రసాద్ అనే వ్యక్తితోపాటు ఏసీపీ రాములునాయక్, ఎస్సైలు సైదులు, నర్సింగ్ రాథోడ్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నారు.