breaking news
chipurupalli town
-
వస్తానని చెప్పి..విగత జీవిగా మారాడు
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : వస్తానని చెప్పి వెళ్లిన చేతికందొచ్చిన కొడుకు అందనంత లోకాలకు వెళ్లిపోయాడు. తమ కుమారుడు విగతజీవిగా మారాడన్న విషయం ఆ తల్లిదండ్రులకు తెలిసి బోరుమన్నారు. అప్పుడే వెళ్లిన తమ కొడుకు ఇంతలోనే మృత్యువాత పడ్డాడన్న వార్త ఆ కుటుంబానికి ఆశనిపాతమే అయ్యింది. వివరాల్లోకి వెళ్తే...పట్టణంలోని రామాంజనేయ కాలనీకి చెందిన సీదర్ల వినయ్(17) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్‌తో వెళ్లిన వినయ్ మృతి చెందగా వెనుక కూర్చొన్న స్నేహితుడు అశోక్‌కు గాయాలయ్యాయి. మృతుని తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీపురుపల్లి ఏఎస్ఐ వై.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు...రామాంజనేయ కాలనీకి చెందిన కృష్ణ, మంగ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ఐటీఐ చదువుతుండగా, కుమార్తె ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో పుర్రేయవలస వెళ్లి వస్తానంటూ ద్విచక్ర వాహనంపై వినయ్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. తనతో పాటు స్నేహితుడు అశోక్‌ను వెంటబెట్టుకు వెళ్లిన వినయ్ పుర్రేయవలస జంక్షన్ వద్దకు వెళ్లేసరికి అతి వేగంతో బైక్‌ను నడపడం వల్ల అదుపు చేయలేక మర్రి చెట్టుకు సమీపంలో గోడను ఢీకొట్టాడు. ప్రమాదంలో వినయ్ మృతి చెందగా అశోక్ ఎడమ చేతికి గాయమైంది. సమాచారం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాల పాలైన అశోక్ విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందొచ్చాడనుకుంటే... ఐటీఐ పూర్తి చేసుకొని ఏదో ఒక పని చేసి తమ బిడ్డ కుటుంబ జీవనంలో చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే దుర్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నీవు లేకుండా ఎలా జీవించేదంటూ వారు పెడుతున్న రోదనలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. మృతుని తల్లిదండ్రులు ప్రతి రోజు సాయంత్రం పట్టణంలో చిన్న టిఫిన్ దుకాణం నడుపుతూ కుటుంబ పోషణ చేస్తున్నారు. తమ బిడ్డ ఇక తమ కుటుంబ జీవనంలో అండగా ఉంటాడనుకుంటే భగవంతుడు ఇలా చేస్తాడని ఊహించలేదని గొల్లుమంటున్నారు. -
ఆదర్శ ప్రేమికులు
చీపురుపల్లి: మనిషి మరణానంతరం శరీరంతో పాటు అవయవాలు కూడా మట్టిలో కలిసిపోతాయి. అలా కలిసిపోకుండా మరొకరికి ఉపయోగపడతాయని తెలిసినా దానం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా అరుదు. కలకాలం కలిసి ఉండేందుకు ఏడడుగులు వేసే సమయంలోనే మరణానంతరం అవయవాల దానం కోసం నిర్ణయం తీసుకున్న ఆ నవ దంపతులు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు... పెద్దలను ఒప్పించారు...బంధువుల సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న ఆ నూతన వధువరులు పెళ్లి పీటలపై నుంచే అవయవ దానానికి అంగీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. వారిని చూసి వివాహానికి వచ్చిన బంధువులు, స్నేహితులు మొత్తం పదమూడు మంది అదే వేదికపై నేత్రదానానికి అంగీకరిస్తూ పత్రాలు సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని వంగపల్లిపేటలో శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఏనూతల అప్పారావు, పైడితల్లి అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అదే సమయంలో తమ మరణానంతరం శరీరంలో ఉండే అవయువాలన్నీ దానం చేసేందుకు నిర్ణయం తీసుకుని పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు బీవీ గోవిందరాజులుకు అంగీకార పత్రాలను అందజేశారు. వృత్యిరీత్యా కారు డ్రైవరుగా పనిచేస్తున్న అప్పారావు.. బీకాం చదువుకున్న పైడితల్లి తీసుకున్న నిర్ణయాన్ని వివాహానికి హాజరైన వారు గ్రామస్తులు అభినందించారు.