breaking news
Chintan haria
-
అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత ఎకానమీ పటిష్టంగా ముందుకు సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 7.6 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందనే సానుకూల అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి గతి (మూమెంటమ్) భారత్‌కు సానుకూలంగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు. దీన్ని భారతీయ స్టాక్ మార్కెట్లకు కూడా అన్వయించుకోవచ్చు. గత కొన్నాళ్లుగా పలు స్టాక్స్ ధరలు పెరుగుతూనే ఉండగా, మరికొన్ని అదే గతిని ఇకపైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మూమెంటమ్‌ను కీలక ఫిల్టరుగా ఉపయోగించి స్టాక్స్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండగలదు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ సూత్రం ప్రకారం లాభాల బాటలో ఉన్న కొన్ని స్టాక్స్ సమీప భవిష్యత్తులోనూ అదే గతిని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సమయానుగుణంగా ఇలాంటి స్టాక్స్ సమూహం మారవచ్చు గానీ సరైన మూమెంటమ్ స్టాక్స్‌లో కనుక ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్‌ఫోలియో మొత్తానికి లబ్ధిని చేకూర్చగలవు. ఇలాంటి వాటిలో సులభంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే పలు మార్గాల్లో నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ కూడా ఒకటి. ఈ సూచీ ప్రాతిపదికన ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ .. ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. పెరిగే ధరతో ప్రయోజనంపెరగడమైనా, తగ్గడమైనా ధరల్లో కదలికలు ఒకసారి మొదలైతే కొన్నాళ్ల పాటు స్థిరంగా అవే ధోరణులు కొనసాగుతాయనే ప్రాతిపదికన మూమెంటమ్ విధానం ఉంటుంది. మూమెంటమ్ ధోరణిని నిర్ణయించేందుకు 6 నెలలు, 12 నెలల ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుంటారు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ విధానంలో ధర పెరుగుతున్న స్టాక్స్‌లో స్వల్పకాలిక పొజిషన్లు తీసుకుని, ట్రెండ్ బలహీనపడుతున్నప్పుడు వాటి నుంచి నిష్క్రమించడం ద్వారా మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతుంది.ఆ తర్వాత పరుగు అందుకుంటున్న వేరే స్టాక్స్‌పై దృష్టి పెడతారు. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 సూచీలో నిఫ్టీ 200 స్టాక్స్ నుంచి ఎంపిక చేసిన 30 షేర్లు ఉంటాయి. కనీసం సంవత్సర కాలం పాటు లిస్టింగ్ చరిత్ర ఉండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లలో ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్న స్టాక్స్‌కు ఇందులో చోటు లభించే అవకాశం ఉంటుంది. మూమెంటమ్ స్కోరు ప్రాతిపదికన స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. 2024 మార్చి 31 నాటి డేటా ప్రకారం ప్రస్తుతం ఈ సూచీలోని టాప్ 5 రంగాల్లో ఆటో–ఆటో విడిభాగాల రంగానికి అత్యధికంగా 22.9%, హెల్త్‌కేర్‌కి 18 శాతం, క్యాపిటల్ గూడ్స్‌కి 15.5 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, కన్జూమర్ సర్వీసెస్ షేర్లకు 5.8 శాతం వాటా ఉంది. సూచీలోని స్టాక్స్‌ను ఏటా జూన్, డిసెంబర్లో సమీక్షిస్తారు.సాధారణ బెంచ్‌మార్క్‌కు మించి రాబడులుధరలు పెరిగే అవకాశమున్న వాటినే ఎంపిక చేయడం వల్ల ఈ సూచీలోని స్టాక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి సాధారణ బెంచ్‌మార్క్ సూచీతో పోలిస్తే అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు 2020 ఆఖర్లో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఐటీ, హెల్త్‌కేర్ స్టాక్స్‌కు అధిక వెయిటేజీ లభించింది. ఇక 2022 చివర్లో ఆర్థిక సేవల రంగం రాణిస్తుండటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా చూసినప్పుడు నిఫ్టీ 200 సూచీతో పోలిస్తే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ చాలా మెరుగ్గా రాణించింది. ఈ పట్టికను బట్టి చూస్తే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మూమెంటమ్ ఇండెక్స్.. నిఫ్టీ 200 కన్నా 7–10 పర్సంటేజీ పాయింట్ల మేర అధిక రాబడులే అందించిన సంగతి స్పష్టమవుతోంది. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. డీమ్యాట్ అకౌంటు లేని వారు ఇండెక్స్ ఫండ్ మార్గం ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 ఏడాది 3 ఏళ్లు 5 ఏళ్లు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 టీఆర్ఐ 70.0% 28.6% 23.6% నిఫ్టీ 200 టీఆర్ఐ 38.3% 18.4% 16.5% -
అక్కడ పెరిగినా.. ఇక్కడ తగ్గుతాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత బుల్ ర్యాలీలో చిన్న ఇన్వెస్టర్ల పాత్ర ఏ విధంగా ఉంది? ప్రస్తుత బుల్ ర్యాలీ మొదలై ఏడాది పూర్తవుతోంది. ప్రారంభ ర్యాలీకి దూరంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో గత మూడు నెలల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా లేదా ఫండ్స్ ద్వారా పెట్టబడులు పెడుతున్నారు. గత మూడు నెలల్లోనే మ్యూచువల్ ఫండ్స్‌లో సుమారు రెండు లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. కానీ దీనికి భిన్నంగా గత మూడేళ్లలో సుమారు 5 లక్షల చిన్న ఇన్వెస్టర్లు ఫండ్స్ నుంచి వైదొలగడం జరిగింది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే సిప్ సగటు మొత్తంలో ఎటువంటి పెరుగుదల కనపడలేదు కానీ, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు సిప్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. దీనికితోడు డెట్ పథకాల్లో పన్ను ప్రయోజనాలను తగ్గిస్తూ గత బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడంతో డెట్ ఇన్వెస్టర్లు కూడా ఈక్విటీ పథకాలకేసి చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఆరేళ్ల తర్వాత ఈక్విటీ రాబడులపై ఇన్వెస్టర్లకు నమ్మకం మరింత పెరిగింది. గరిష్ట స్థాయిలో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ కదలికలపై మీ అంచనాలు ఎలాగున్నాయి? ఈ ర్యాలీ మరికొన్ని ఏళ్లు కొనసాగుతుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అంతర్జాతీయ, దేశీయ పరిణామాల వల్ల మధ్యమధ్యలో ఒడిదుడుకులున్నా.. మరో మూడు నుంచి ఐదేళ్లు ఈక్విటీలు లాభాలను అందిస్తాయని అంచనా వేస్తున్నాం. ఈ సమయంలో జీడీపీ ఏడు శాతానికి చేరడం, వడ్డీరేట్లు దిగిరావడం, తయారీ రంగంలో ఆర్డర్లు పెరగడం, కంపెనీల ఆదాయం పెరగడం వంటి అంశాలన్నీ బుల్ర్యాలీని సమర్థించేవే. ఒక్కసారి ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల నిర్మాణం మొదలయితే వినియోగానికి సంబంధించిన అన్ని కంపెనీల ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా ప్రజల్లో వినిమయశక్తి పెరుగుతుంది. ప్రస్తుతం స్టాక్ సూచీలు మరీ అంత చౌక కాదు, అలా ఖరీదు కాదు. మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితి దృష్టితో ప్రస్తుత స్థాయిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వచ్చే 3-5 ఏళ్లలో సెన్సెక్స్ ఏ స్థాయికి చేరుకోవచ్చు? సెన్సెక్స్, నిఫ్టీ ఏ స్థాయికి వెళతాయని చెప్పడం కష్టం. గతేడాది ఇండెక్స్‌లు 45 నుంచి 50 శాతం రాబడినిచ్చాయి. ఇదే విధమైన రాబడులు భవిష్యత్తులో కూడా ఉంటాయని చెప్పలేం. కానీ వచ్చే మూడు నుంచి ఐదేళ్లు సెన్సెక్స్ కంపెనీలు పీఈ రేటింగ్‌తో సంబంధం లేకుండా సగటున 15 శాతం రాబడులను అందిస్తాయని అంచనా వేస్తున్నాం. అంటే వచ్చే మూడేళ్లలో సెన్సెక్స్ కంపెనీల ఆదాయం సుమారుగా 50 శాతం పెరుగుతుంది. కానీ ఇదే స్థాయిలో సెన్సెక్స్ పెరుగుతుందని చెప్పలేం. ఇండెక్స్‌ల కదలికలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వడ్డీరేట్లు మాత్రం బాగా దిగొస్తే ఆ మేరకు ఇండెక్స్‌లు మరింత లాభాలను అందిస్తాయి. ప్రస్తుతం ర్యాలీలో ఏ రంగాల వైపు చూడొచ్చంటారు? వేటికి దూరంగా ఉండాలని సూచిస్తారు? విలువ పరంగా బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఆటో కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా ఉంటే, వినియోగంతో సంబంధం ఉన్న ఎఫ్ఎంసీజీ వంటి షేర్లు ఖరీదైనవిగా చెప్పొచ్చు. విలువ పరంగా ఫార్మా షేర్లు కూడా అధిక విలువలో ఉన్నప్పటికీ వాటి వ్యాపార అవకాశాల దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన కంపెనీల షేర్లు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఐటీ రంగం షేర్లు వాస్తవ విలువకు దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి. దీర్ఘకాలిక దృష్టితో టెలికం షేర్లవైపు కూడా చూడొచ్చు. అమెరికా వడ్డీరేట్లు పెంచే అవకాశాలున్న తరుణంలో ఇండియాలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందా? అమెరికాలో వడ్డీరేట్లు పెంచితే ఎఫ్ఐఐ నిధుల ప్రవాహంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అమెరికా వడ్డీరేట్లు పెంచితే స్వల్పకాలంలో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనా దీర్ఘకాలంలో ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం పెరుగుతుంది. 2003-2007లో జరిగిన చరిత్రే ఇప్పుడు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకోవడంతో వడ్డీరేట్లు పెరగడం తథ్యం. వడ్డీరేట్లు పెరిగితే డాలరు విలువ బలపడి వర్థమాన దేశాల నుంచి ఈక్విటీ నిధులు అమెరికాలోకి వెళతాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కొద్దిగా పతనం కావచ్చు. కానీ రానున్న కాలంలో అమెరికా డెట్ ఫండ్స్‌లో ఉన్న పెన్షన్ నిధులు క్రమేపీ ఇండియా వంటి వర్ధమాన దేశాల్లోకి వస్తాయి. దీంతో తిరిగి మార్కెట్లు పెరుగుతాయి. ప్రస్తుతం అమెరికా వడ్డీరేట్లకు, దేశీయ వడ్డీరేట్లకు మధ్య వ్యత్యాసం 6.5 శాతంగా ఉంది. ఇది సాధారణంగా 4-4.5 శాతంగా ఉంటుంది. కాబట్టి రానున్న కాలంలో అమెరికా వడ్డీరేట్లు పెంచినా ఇక్కడ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో వచ్చే డిసెంబర్, 2015నాటికి దేశీయ వడ్డీరేట్లు 1.5 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. ఇదే సమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.59-62 శ్రేణిలో కదలొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గుతున్న తరుణంలో ఏయే రంగాలు లబ్ధి పొందనున్నాయి? పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంపైనే సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తగ్గనుంది. గత రెండేళ్లలో లీటరు డీజిల్ ధర రూ. 45 నుంచి రూ. 60కి పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు డీజిల్ ధరలు తగ్గుముఖం పడితే ఆ మేరకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. చమురు ధరలు తగ్గడం, తక్కువ ధరలోనే ఆహార వస్తువులు లభించడం, రవాణా చార్జీలు తగ్గడం, అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు దిగొస్తాయి. డీజిల్ ధరలు తగ్గడం వల్ల లాజిస్టిక్ కంపెనీలు ఎక్కువగా లభిస్తాయి.